ఎలాంటి తోడూనీడా లేని చిన్నారి అభాగ్యులను చేరదీసి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు పరచాల్సిన ఆశ్రమ నిలయాలే నేడు దారితప్పుతున్నాయి. ఆశ్రమాల్లోని పిల్లలపై వికృత చేష్టలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. అనేకచోట్ల ఆశ్రమ నిర్వాహకులే తెరవెనక ఉంటూ చిన్నారులపై అఘాయిత్యాలను ప్రోత్సహిస్తుండటం మరింత విషాదం! సరైన సమయంలో చికిత్స లభించని చిన్నారులు మృత్యుఒడిలోకి చేరుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం తెలంగాణలోని అమీనాపూర్ అనాథాశ్రమంలోని ఓ బాలిక అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ మృతిచెందడమే ఇందుకు నిదర్శనం. దాతృత్వం పేరిట ఆశ్రమానికి నిధులు సమకూర్చే వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తే దారుణానికి ఒడిగట్టడం దిగ్భ్రాంత పరుస్తోంది. వికృత చేష్టలు అనేక ఆశ్రమాల్లో జరుగుతున్నా వాటిని వెలుగులోకి రానివ్వకుండా అధికారులను నిర్వాహకులు మచ్చిక చేసుకుంటున్నారనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. కాపాడాల్సినవారే కాటేస్తుంటే, ఇక చిన్నారులకు రక్షణ ఎక్కడ ఉంటుంది?
అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో ప్రభుత్వ ఆమోదం పొందిన పిల్లల అనాథాశ్రమాలు 2,874 ఉన్నాయని అంచనా! తెలంగాణలోని 429 ఆశ్రమాల్లో సుమారు 13 వేలమంది రక్షణ పొందుతున్నారు. నేర విభాగం గణాంకాల ప్రకారం 2018లో దేశంలోని అనాథాశ్రమాల్లో 707మంది పిల్లలపై అఘాయిత్యాలు చోటుచేసుకున్నాయి. అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్‌లో 40.7శాతం, మహారాష్ట్రలో 22.8శాతం, మధ్యప్రదేశ్‌లో 8.6 శాతం, ఆంధ్రప్రదేశ్, హరియాణాల్లో 6.9 శాతం చొప్పున కేసులు నమోదయ్యాయి. 2018లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ బిహార్‌లో నిర్వహించిన అధ్యయనంలో అనాథ బాలికలు ఘోరమైన లైంగిక వేధింపులకు గురవుతున్న దారుణాలు వెలుగుచూశాయి. ముజఫర్‌పూర్ ఆశ్రమ గృహంలో ఏకంగా 34 మంది మైనర్ బాలికలు నెలల తరబడి అత్యాచారానికి బలయ్యారు. పిల్లలతో నిర్వాహకులు వారి వ్యక్తిగత పనులు చేయించుకోవడం, మాట వినకపోతే చిత్రహింసలకు గురిచేయడం సర్వసాధారణమైయింది. బిహార్ అనేకాదు, వివిధ రాష్ట్రాల ఆశ్రమాల్లో వెలుగుచూస్తున్న ఈ తరహా ఘటనలు మానవతకే మచ్చగా మిగులుతున్నాయి. మరోవైపు పేరొందిన ఆశ్రమాలకు ఏదో ఒక రూపంలో నిధులు అందుతున్నప్పటికీ, కొన్ని ఆశ్రమాల్లో పిల్లలకు కనీస సౌకర్యాలైనా లేకపోవడం- నిధుల దుర్వినియోగానికి నిదర్శనం.
టాటా అధ్యయనాంశాల దరిమిలా సుప్రీంకోర్టు రెండేళ్ల క్రితం సమగ్ర వివరాలు కోరింది. దాంతో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సర్వే చేపట్టింది. 2,874 ఆశ్రమాలకు గాను 1.9 శాతం ఆశ్రమాలే సరైన సమాచారం పొందుపరచాయి. 16 శాతం ఆశ్రమాల్లోనే నిధుల వినియోగం సక్రమంగా ఉందని తేలింది. 13 శాతం ఆశ్రమాల్లోనే పూర్తి ఆధారాలతో కూడిన రికార్డులు ఉన్నాయి. మొత్తంగా అధిక శాతం ఆశ్రమాల నిర్వహణ లోపభూయిష్ఠంగా ఉందని స్పష్టం అవుతోంది. కనుక పిల్లల సంరక్షణ కోసం పనిచేస్తున్న ఆశ్రమాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఆశ్రమంలో నిఘా నేత్రాల ఏర్పాటు ఎంతో అవసరం. దాతల వివరాలు, నిధుల వివరాలను పారదర్శకంగా ఉంచాలి. దాతలు ఎలాంటి సహాయం అందజేస్తున్నారో వెల్లడికావాలి. పిల్లలకు భద్రతకు సంబంధించి చేపడుతున్న చర్యలను విధిగా ప్రదర్శించాలి. అధికారుల వివరాలు పిల్లలకు అందుబాటులో ఉండేలా చూడాలి. మెరుగైన జీవన ప్రమాణాలను అందించేందుకు సరైన పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలి. కొత్తగా అనుమతులు పొందే ఆశ్రమాల నిర్వాహకుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని అనుమతులివ్వాలి. ప్రతి ఆశ్రమాన్ని నెలలో రెండుసార్లు అధికారులు తనిఖీ చేసి పిల్లల అభిప్రాయాలు సేకరించాలి. పౌరసమాజం నుంచి పర్యవేక్షణలను పెంచాలి. ఏటా సమీక్ష అనంతరమే ఆశ్రమాలకు అనుమతులు మంజూరు చేయాలి. పారదర్శకత పాటించని ఆశ్రమాల అనుమతులను రద్దుచేయాలి. ప్రభుత్వ అనుమతులు లేని ఆశ్రమాలను మూసేయాలి. ప్రభుత్వ అధీనంలో నడిచే ఆశ్రమాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. వాటిలో పిల్లల హక్కుల పట్ల అనుభవం ఉన్న సిబ్బందిని మాత్రమే నియమించాలి. ఆశ్రమాల్లో పనిచేసే సిబ్బంది వ్యవహార శైలి పట్ల పిల్లల నుంచి ప్రతి వారం సమాచారం సేకరించాలి. సత్ప్రవర్తన లేని సిబ్బందిని వెంటనే తొలగించాలి. బాలల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండాలి. అన్నింటినీమించి అనాథలపై అకృత్యాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా సంబంధిత చట్టాలకు కోరలు తొడగాలి.
- డాక్టర్ సిలువేరు హరినాథ్
(రచయిత- 'సెస్'లో రీసెర్చ్ అసిస్టెంట్)