భారతావని ఓటరు నాడిని పసిగట్టడం ఎవరి తరం? తరం మార్పును బిహార్ శాసించనుందంటూ సర్వేక్షకులంతా సందడి చేసినా ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్దేశిస్తూ బిహారీయులు వెలువరించిన తీర్పు ఆసాంతం ఉత్కంఠభరితం! నిరుడు లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌వ్యాప్తంగా 40 స్థానాలకు 39 గెలిచి ఏకంగా 225 అసెంబ్లీ స్థానాల్లో ఎన్‌డీఏ ఆధిక్యం చాటింది. సార్వత్రిక-స్థానిక ఎన్నికల మధ్య విలక్షణతను గుర్తెరిగి సరైన తీర్పునివ్వడంలో రాటుతేలిన ఓటర్లు ఈసారి మహాఘట్‌బంధన్‌కు అంబారీ కట్టనున్నారన్న విశ్లేషణలు పోటెత్తాయి. తీరా ఫలితాల్ని గమనిస్తే- పాలక ఎన్‌డీఏ బొటాబొటి మెజారిటీతో గట్టెక్కింది.
క్రితంసారి 19శాతం ఓట్లతో 80 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్‌జేడీ- ఈసారి 23.1శాతం ఓట్లతో ఆ హోదాను నిలబెట్టుకొన్నా సీట్ల సంఖ్య 76కు పరిమితమైంది. కూటమిగా మహాఘట్‌బంధన్ వెనకబాటుకు ‘పీక సన్నం ఆశ లావు’ చందంగా నిర్వాకం వెలగబెట్టిన హస్తం పార్టీనే తప్పు పట్టాలి. లోగడ 41స్థానాల్లో పోటీ పడి 27 గెలిచిన కాంగ్రెస్ ఈసారి 70 స్థానాల్లో బరిలోకి దిగి గెలవగలిగింది కేవలం పందొమ్మిదే. పోటీ-గెలుపు రేటు ప్రాతిపదికన 17 చోట్ల గెలిచిన వామపక్షాలతో పోలిస్తే కాంగ్రెస్ సాధించింది దిగదుడుపే! ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉంటూ ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి నీతీశ్ కుమార్ మీద కత్తి దూసిన లోక్ జనశక్తి నేత చిరాగ్ పాసవాన్ పోషించిన సైంధవ పాత్ర పాలకపక్షం కొంప ముంచింది. 2015లో అయిదు వేలలోపు మెజారిటీతో 33 సీట్ల ఫలితం తేలిన బిహార్‌లో జేడీ(యు)పై ఎల్‌జేపీ పోటీ నితీశ్ పార్టీ స్కోరును పదిహేనేళ్ల కనిష్ఠానికి దిగలాగింది. 72 స్థానాలు గెలిచిన కమలం పార్టీయే పాలక కూటమి పరువు నిలిపి సాధారణ మెజారిటీ మార్కును దాటించింది. తక్కిన చోట్ల ఉప ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌తో పాటు, గుజరాత్, కర్ణాటక, మణిపూర్, తెలంగాణ, యూపీల్లో భారీ విజయాలు నమోదు చేసిన భాజపాకు మూణ్నాళ్ల ముందే వచ్చింది దీపావళి!
కొవిడ్ మహమ్మారి కోర సాచిన వేళ ఎన్నికల మహా క్రతువును నిర్వాచన్ సదన్ సమర్థంగా నిభాయించింది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఇంతలా మొహం వేలాడేయడానికి కొవిడ్‌తో పాటు చిరాగ్ పాస్వానే కారణమని జేడీ(యు) విశ్లేషిస్తోంది. 2005 లగాయతు సీట్ల పరంగా జారుడుమెట్లమీద ఉన్న ఎల్‌జేపీ క్రితంసారి స్కోరూ సాధించలేక ఒక్కసీటుకే పరిమితమైనా- ఏకైక పెద్దపార్టీగా అవతరించగల జేడీ(యు) అవకాశాలకు మాత్రం గండి కొట్టింది. నిరుటి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 18 అసెంబ్లీ పరగణాల్లోనే ఆధిక్యం చూపిన మహాఘట్‌బంధన్ నేడు 110 స్థానాలు గెలుచుకోగలిగిందంటే ఆర్‌జేడీ అధ్యక్షుడిగా తేజస్వి- జనం ఆకాంక్షల్ని తన గళంలో పలికించడమే కారణం. 7.29 కోట్లమంది ఓటర్లలో సగానికి పైగా 18-39 ఏళ్లలోపువారే.
కొవిడ్ కష్టాలతో ఇంటిదారి పట్టిన 16లక్షల మంది వలస శ్రామికుల్ని కలుపుకొంటే మెజారిటీ యువతను పీడిస్తున్న సమస్య, ఉపాధే! కుల సమీకరణల సామాజిక న్యాయం నుంచి ఆర్థిక న్యాయసాధనే లక్ష్యమంటూ తేజస్వి చేసిన పదిలక్షల ఉద్యోగాల పరికల్పన వాగ్దానం- కమల నాథుల్నీ కదిలించి 19లక్షల ఉపాధి అవకాశాల కల్పన హామీకి ప్రేరేపించింది. నితీశ్ 15 ఏళ్ల పాలనలో మౌలిక సదుపాయాలు సమకూరినా ఉపాధి దారిద్య్రం వెంటాడుతూనే ఉంది. బిహార్ స్థూలోత్పత్తిలో 18.7శాతం వాటాగల వ్యవసాయంపై ఏకంగా 75శాతానికి పైగా ప్రజలు ఆధారపడి ఉండటంతో రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటులో మూడోవంతుకే పరిమితమైంది. మొత్తం 38 జిల్లాల్లో మూడోవంతు కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతుండటం- నితీశ్ కుమార్ పాలన ప్రాథమ్యాలు మారాల్సిన అవసరాన్ని చాటుతోంది. ప్రజల ఆకాంక్షల్ని తీర్చడానికే ప్రభుత్వం పని చేయాలన్న విస్పష్ట హెచ్చరిక తాజా తీర్పులో ప్రతిధ్వనిస్తోంది!