2015 పారిస్ వాతావరణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపసంహరించుకోవడం అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే రానున్న అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్-కమలా హ్యారిస్ నేతృత్వంలోని డెమొక్రాట్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. పారిస్ ఒప్పందంలో అమెరికా రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హ్యారిస్ వల్లే...!
బైడెన్, హ్యారిస్ ఇద్దరూ పర్యావరణ పరిరక్షణను బలంగా ప్రోత్సహించేవారే. అయితే ఒకవేళ డెమొక్రాట్ ప్రభుత్వం ఏర్పడి వాతావరణ ఒప్పందంలో అగ్రరాజ్యం తిరిగి చేరితే.. అందుకు కమలా హ్యారిస్‌దే కీలక పాత్ర అని నిపుణులు చెబుతున్నారు.
ఉపాధ్యక్షురాలిగా బైడెన్ ఎంచుకున్న కమలా హ్యారిస్.. న్యూయార్క్‌కు చెందిన అలెగ్జాండ్రియా ఒసాసియో-కార్టెక్స్తో కలిసి క్లైమేట్ ఈక్విటీ యాక్ట్(సీఈఏ) ప్రవేశపెట్టారు.
"వాతావరణం, పర్యావరణం విషయంలో ప్రజలను దృష్టిలో పెట్టుకుని, వారి నిర్ణయాలను పరిగణిస్తూ విధానాలు, నిబంధనలను రూపొందించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇది ప్రత్యక్ష విధానాలతో పాటు రవాణా, ఇల్లు, ఉద్యోగాలు, మౌలిక వసతులు సహా మరిన్ని విషయాలకు కూడా వర్తిస్తుంది."
--- క్లైమేట్ ఈక్విటీ యాక్ట్.
ఇది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనకు పూర్తి విరుద్ధంగా ఉండటం గమనార్హం. ఈ సీఈఏతో పారిస్ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:- 'పారిస్' నుంచి వైదొలుగుతూ ఐరాసకు అమెరికా లేఖ
హ్యారిస్‌ను ఉపాధ్యక్షురాలి పదవికి బైడెన్ ఎంపిక చేసిన అనంతరం.. పారిస్ ఒప్పందం అంశంపై స్పందించారు న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ చీఫ్ నిక్లాస్ హొన్నె.
"వాతావరణంలో దౌత్య విధానానికి ఇది(హ్యారిస్ ఎంపిక) కచ్చితంగా మంచి విషయం. బైడెన్-హ్యారిస్ కలయిక అంటే.. వాతావరణ విధానాలు, పారిస్ ఒప్పందంపై రాత్రింబవళ్లు పనిచేస్తున్నట్టే."
--- నిక్లాస్ హొన్నె, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ చీఫ్.
దిల్లీలోని అబ్జర్వర్-రీసర్చ్ ఫౌండేషన్ అధిపతి ఆగ్రీస్ లైడియా పావెల్ ఈ విషయంపై స్పందించారు. వాతావరణం అంశంలో ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా బైడెన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు పావెల్.
"స్థానిక ఉద్యోగాల విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శిలాజ ఇంధనాలను డెమొక్రాట్లు కూడా పూర్తిగా వ్యతిరేకించకపోవచ్చు. కానీ మరింత శుభ్రమైన ఇంధనాల వినియోగానికి ప్రపంచం పరుగులు తీస్తుంది. ఇదే వాస్తవం. వాళ్లు(బైడెన్-హ్యారిస్) పారిస్ ఒప్పందంలో కచ్చితంగా చేరతారు. అందులో అనుమానం లేదు."
-- పావల్, అబ్జర్వర్- రీసర్చ్ ఫౌండేషన్ చీఫ్.
పారిస్ ఒప్పందాన్ని ఉద్దేశించి.. మిత్రపక్షాలతో అమెరికా ఎలా వ్యవహరించాలో, శత్రువులతో ఎలా మసులుకోవాలో తనకు తెలుసని బైడెన్ తన ప్రచారాల్లో స్పష్టంచేశారు. పారిస్ ఒప్పందంలోకి అమెరికాను తిరిగి చేర్చడమే కాకుండా.. పర్యావరణ పరిరక్షణకు బైడెన్ అంతకుమించిన కృషి చేస్తారని ఆయన ప్రచార వెబ్సైట్లో రాసి ఉంది.
2017లో పారిస్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందని ఆరోపించారు. తన దేశం శాశ్వతంగా నష్టపోతుందన్నారు. తన 'అమెరికాకే తొలి ప్రాధాన్యం' విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:- 'అమెరికా నిర్ణయం 'పారిస్' ఒప్పందాన్ని బలహీనపరుస్తుంది'
అమెరికా ఉపాధ్యక్ష పదవిక పోటీ చేస్తున్న తొలి నల్లజాతి మహిళ, ఆసియా అమెరికన్ హ్యారిస్. తన జీవితంలో పర్యావరణ పరిరక్షణకు అనేక విధాలుగా కృషి చేశారు హ్యారిస్. శాన్ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా.. ఎన్విరాన్మెంట్ జస్టిస్ యూనిట్‌ను ఏర్పాటు చేసి ఎన్నో సంఘాలకు సహాయం అందించారు.
(రచయిత- అరునిమ్ భుయాన్)
ఇవీ చూడండి:-