ETV Bharat / opinion

శబ్ద కాలుష్యంతో ముంచుకొస్తున్న ముప్పు - world health organization

గత కొంతకాలంగా వినికిడి సమస్యలు ఉన్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. పరిమితికి మించిన స్థాయిలో శబ్దాలు వినడమే ఇందుకు చాలావరకు కారణమని తెలుస్తోంది. దీంతో మానసిక సమస్యలతో పాటు శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలు పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నాయి. అయితే ప్రాథమిక దశలోనే ముప్పును గుర్తించి జాగ్రత్తపడితే శాశ్వత వినికిడి సమస్యలనుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

An analysis story on Deaf problem due to sound pollution
శబ్ద కాలుష్యంతో ముంచుకొస్తున్న ముప్పు
author img

By

Published : Mar 4, 2021, 8:39 AM IST

ప్రపంచాన్ని వినికిడి సమస్యలు వేధిస్తున్నాయి. అవతలివారు అరిచి గీపెట్టినా ఒక్క మాటా వినిపించని వారి సంఖ్య గతంతో పోలిస్తే గడచిన కొంతకాలంగా బాగా పెరుగుతోంది. దేశంలో వ్యాధులబారినపడిన వారి జనగణన ప్రకారం- 6.3 కోట్లమంది తీవ్రమైన వినికిడి లోపాలతో సతమతమవుతున్నారు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ సమస్యలు అధికంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరిని ఈ సమస్య వేధిస్తోందన్న అంచనాలున్నాయి. ఈ సమస్య బారినపడుతున్నవారిలో అత్యధికులు మధ్యాదాయ దేశాల్లోనే ఉన్నారు. మరీ ముఖ్యంగా వీరిలో మూడింట ఒకటోవంతు 65 ఏళ్లకు పైబడినవారే!

వినికిడి సమస్యలు ఉన్నవాళ్లు 25 డెసిబుల్స్‌ ధ్వనిని గ్రహించలేరు. అవతలివారు సాధారణ స్థాయిలో మాట్లాడినా వినిపించదు. శ్రవణ సమస్యలు మితిమీరితే వినికిడి సాధనాల సాయం తీసుకోవాల్సి వస్తుంది. సమస్య శ్రుతిమీరినవారికి ఎలాంటి సాంకేతిక సాధనాలూ పనికిరావు. అలాంటివారు సంజ్ఞల ద్వారా అవతలివారితో సంభాషిస్తుంటారు. కొందరికి ఈ సమస్య వంశపారంపర్యంగా సంక్రమిస్తే ఇంకొందరు సాంక్రామిక వ్యాధుల కారణంగానో, పుట్టుకతోనే బరువు తక్కువ ఉండటంవల్లో లేదా కొన్ని రకాల ఔషధాలు ఒంటికి పడకపోవడం ద్వారానో వినికిడి లోపాలకు లోనవుతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 110 కోట్లమంది యువత వినికిడి సమస్యలతో బాధపడుతోంది.

పరిమితికి మించి..

పరిమితికి మించిన స్థాయిలో శబ్దాలు వినడమే ఇందుకు చాలావరకు కారణం. అత్యధికంగా ఇయర్‌ఫోన్లు వినియోగించేవారిని ఈ సమస్య వేధిస్తోంది. ఒకరు వాడిన ఇయర్‌ఫోన్లను మరొకరు ఉపయోగిస్తే దానివల్ల సాంక్రామిక వ్యాధులు తలెత్తుతున్నాయి. బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు విస్తరిస్తున్నాయి. చాలాసేపు అధిక శబ్దం వినడంవల్ల మానసిక ఇబ్బందులు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలూ తలెత్తుతున్నాయి. భారత ప్రభుత్వం 2000 ఫిబ్రవరి 14న శబ్ద కాలుష్యం (నిబంధనలు- నియంత్రణ) చట్టం తీసుకువచ్చింది. దానిప్రకారం పారిశ్రామిక ప్రాంతాల్లో పగటిపూట 75 డెసిబుల్స్‌, రాత్రి సమయాల్లో 70 డెసిబుల్స్‌ పరిమితి లోపే శబ్దం ఉండాలి. వాణిజ్య ప్రాంతాల్లో పగటిపూట 65 డీబీ, రాత్రి 55 డీబీకి మించిన శబ్దం ఉండరాదు. నివాస ప్రాంతాల్లో పగలు 55 డీబీ, రాత్రి 45 డీబీ పరిమితిలోపే శబ్దాలు ఉండాలి. నిశబ్ద ప్రాంతాల్లో పగలు 50డీబీ, రాత్రి 40డీబీ పరిమితి ఉండాలి. వైద్యశాలలు, విద్యా సంస్థలు, న్యాయస్థానాలవద్ద వాటికి వంద మీటర్ల దూరం వరకూ నిశ్శబ్ద జోన్లుగా ప్రభుత్వం తీర్మానించింది.

750 బిలియన్​ డాలర్లు నష్టం

వినికిడి సమస్యల కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల మేరకు ప్రపంచవ్యాప్తంగా 750 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లుతోంది. ఆరోగ్య వ్యయాలు, విద్యా సంస్థల్లో వీరికి ప్రత్యేక వసతుల ఏర్పాటుకు అయ్యే ఖర్చు, ఉత్పాదకత నష్టం వంటి సామాజిక వ్యయాలన్నింటినీ బేరీజు వేసుకుని డబ్ల్యూహెచ్‌ఓ ఈ అంచనా వేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వినికిడి లోపాలున్న పిల్లలను పాఠశాలలకు పంపడం లేదు. మరోవంక ఈ ఇబ్బంది ఉన్న పెద్దవారిలో అత్యధికులకు ఉపాధి లభించడం కష్టమవుతోంది. ఈ సమస్యలున్న వారిపట్ల ప్రభుత్వాలు, పౌర సమాజం ప్రత్యేక శ్రద్ధతో స్పందించాలి. విద్యావకాశాలు కల్పించడం, వృత్తి విద్యలు నేర్పించడం, వారి ప్రత్యేక అవసరాలపట్ల యాజమాన్యాలకు అవగాహన కల్పించడం ద్వారా వినికిడి సమస్యలున్నవారు ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను సాధ్యమైనంతమేర తగ్గించవచ్చు.

ప్రజారోగ్య సౌకర్యాలను నాణ్యంగా తీర్చిదిద్దితే వినికిడి సమస్యలను చాలావరకు నివారించవచ్చు. సాంక్రామిక వ్యాధులు, పుట్టుకతో తలెత్తే ఆరోగ్య సమస్యలు, మితిమీరిన ఔషధ వినియోగం వంటి వాటివల్ల శ్రవణ లోపాలు తలెత్తుతుంటాయి. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యంపట్ల అవగాహన, టీకా సౌకర్యం కల్పించడం వంటి వాటి ద్వారా ఈ సమస్యలను ఎదుర్కోవచ్చు. వినికిడి లోపాలను పిల్లల్లో ఎంత త్వరగా గుర్తిస్తే అంత సత్వరం వాటిని పరిష్కరించడానికి వీలవుతుంది. పరిమితికి మించి శబ్దాలను వినడం, ఇయర్‌ ఫోన్లను ఉపయోగించడంవల్ల చెవులపై ఒత్తిడి పడుతోంది. దీనివల్ల మానసిక సమస్యలూ మితిమీరుతాయి. ప్రాథమిక దశలోనే ముప్పును గుర్తించి జాగ్రత్తపడితే శాశ్వత వినికిడి సమస్యలనుంచి తప్పించుకోవచ్చు. ఆ మేరకు ప్రభుత్వాలే కాకుండా పౌర సమాజమూ పూనుకొని ఆరోగ్యకర జీవనంపట్ల అవగాహన పెంచాలి.

రచయిత- డాక్టర్‌ సుబ్బారాయుడు యార్లగడ్డ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.