దేశంలో వాయు నాణ్యత క్షీణించి ప్రతిరోజూ లక్షమంది వరకు శ్వాసకోశ వ్యాధుల పాలబడుతున్నారన్న గణాంక విశ్లేషణ ఆమధ్య ఎందరినో దిగ్భ్రాంతపరచింది. బతకడానికి పీల్చేగాలి రోగాలపాలు చేయడమే కాదు, ఆయువును కుదించే దురవస్థా దాపురించింది. షికాగో విశ్వవిద్యాలయం కేంద్రస్థలిగా తాజా 'ఎపిక్' అధ్యయనం- గాలి కలుషితమై అంతర్జాతీయంగా సుమారు రెండేళ్లదాకా ప్రజానీకం ఆయుర్దాయం కోసుకుపోతున్నట్లు నిగ్గు తేల్చింది. దేశీయంగా సగటున 5.2 సంవత్సరాల వరకు పౌరుల జీవనకాలం తరిగిపోతుండగా, ఆ నష్టం ఉత్తరభారతావనిలో పదేళ్లదాకా ఉందంటున్నారు. లఖ్‌నవూ లాంటి నగరాల్లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిధికి 11రెట్ల వరకు అతిసూక్ష్మ ధూళికణాలు గాలిలో పేరుకుపోవడం సంక్షోభ తీవ్రతకు ప్రత్యక్ష తార్కాణం. కేవలం ఊపిరి పీలిస్తేనే ఉత్తర కోల్‌కతా వంటిచోట్ల స్థానికులు రోజుకు 22 సిగరెట్లు కాల్చినంత కాలుష్యం పాలబడుతున్నారంటే ఏమనుకోవాలి? కాలుష్య రాజధానిగా భ్రష్టుపట్టిన దిల్లీని తలదన్నే స్థాయిలో జీంద్, బాగ్‌పత్, ఘజియాబాద్, మొరాదాబాద్, సిర్సా, నొయిడా ప్రభృత ప్రాంతాల్లోని వాయునాణ్యతా ప్రమాణాలు హడలెత్తిస్తున్నాయి. ఎకాయెకి 66కోట్లమంది భారతీయుల జీవన ప్రమాణాల్ని వాయుకాలుష్యం కుళ్లబొడుస్తోందన్న విశ్లేషణ, దేశంలోని ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకదానికి కలుషిత గాలే కారణమన్న భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్‌ఆర్) ధ్రువీకరణల దరిమిలా- పరిస్థితి నేటికీ కుదుటపడనే లేదని షికాగో అధ్యయన ఫలితాలు ప్రస్ఫుటీకరిస్తున్నాయి. సుమారు రెండు దశాబ్దాలుగా భారత్‌లో గాలి కలుషితమవుతూనే ఉందన్న నిర్ధారణ- అంతకంతకు శిశువుల్లో ఉబ్బసం కేసులు, పెద్దవారిలో పక్షవాతం ఊపిరితిత్తుల క్యాన్సర్లు విజృంభించడానికి మూలాలెక్కడున్నదీ స్పష్టీకరిస్తోంది.
శ్రుతి మించుతోంది...
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణికాల ప్రకారం, ప్రతి ఘనపు మీటరు వాయువులో అతిసూక్ష్మ ధూళికణాలు పది మైక్రోగ్రాములకు మించకూడదు. అందుకు తగ్గట్లు జాగ్రత్తలు పాటించకుండా దేశంలోని మూడొంతుకుపైగా నగరాలు పట్టణాలు 'గ్యాస్ ఛాంబర్లు'గా దిగజారేలా అసమర్థ నిర్వాకాలు వెలగబెట్టిన కాలుష్య నియంత్రణ మండళ్లు క్షమార్హంకాని దోషులు. వాయు నాణ్యత సూచి ప్రాతిపదికన గరిష్ఠ ముప్పు దక్షిణాసియాలోని నాలుగు దేశాలకేనని, అందులోనూ బంగ్లాదేశ్ తరవాత అత్యంత కలుషిత దేశం ఇండియాయే అన్నది యావత్‌జాతీ తలదించుకోవాల్సిన రికార్డు. వాయు కాలుష్యంపై పొరుగున చైనాలో బహుముఖ పోరు ఎన్నదగింది. అక్కడ బొగ్గుతో నడిచే నూతన కర్మాగారాల నిర్మాణాన్ని నిషేధించి, అప్పటికే ఉన్నవాటినుంచి ఉద్గారాల విడుదలను నియంత్రించారు. కొన్ని ఉక్కు కర్మాగారాల్ని మూసేయడంతోపాటు, వాహనాల రాకపోకల్నీ క్రమబద్ధీకరించారు. ఏటా 25 టన్నుల బొగ్గు పులుసు వాయువును పీల్చి రోజూ 60 కిలోల ప్రాణవాయువు విడుదల చేసేలా ఉత్తర చైనాలో అటవీ పెంపకం వంటివి అక్కడి క్షేత్రస్థాయి స్థితిగతుల్ని గణనీయంగా కుదుటపరచాయి. ఇక్కడ విరుద్ధ దృశ్యం తాండవిస్తోంది. దేశంలో మునుపటి ప్రభుత్వాల విధానపరమైన అలసత్వాన్ని తుడిచిపెడుతూ తనవంతుగా మోదీ ప్రభుత్వం చేపట్టిన 'జాతీయ పరిశుద్ధ వాయు ప్రణాళిక' ఊపందుకోలేదు. విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. పర్యావరణ పరిరక్షణ కృషి, వాయు కాలుష్య మరణాల కట్టడి ఒకదానితో మరొకటి ముడివడిన అంశాలన్న స్పృహతో ప్రభుత్వాల ప్రాథమ్యాలు మారాలి. ప్రజల క్రియాశీల తోడ్పాటునూ కూడగట్టాలి. సామాజిక వనాల పెంపకం, కార్యాలయాల చేరువలో జనావాసాలు, ప్రజా రవాణా విస్తృతీకరణలు సాకారమైతేనే- వాయు నాణ్యత మెరుగుదలకు మేలు బాటలు పడినట్లు!
ఇదీ చూడండి: అయోధ్య శోభాయమానం- భూమిపూజకు ముస్తాబు