పొరుగు దేశాల్లో జరిగే కీలక పరిణామాలు భారత్ అంతర్గత భద్రతను ప్రభావితం చేస్తాయన్నది నిష్ఠుర సత్యం. కశ్మీర్‌లో వేర్పాటువాదం పేట్రేగకుండా ఉండాలంటే అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాద వ్యతిరేక ప్రభుత్వం ఉండాలి. ఈశాన్య భారతంలో శాంతి నెలకొనాలంటే మయన్మార్ నుంచి సైనిక సహకారం చాలా ముఖ్యం. ‘అఫ్గాన్‌లో యుద్ధాన్ని నాతో కలిపి నలుగురు అధ్యక్షులు చూశారు. అయిదో వారికి నేను అవకాశమివ్వను. సెప్టెంబర్ 11 నాటికి అమెరికా దళాలు స్వదేశానికి వచ్చేస్తాయి’ అంటూ ఇటీవల బైడెన్ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ఆయన అధికారంలోకి వస్తే తమ దేశంలో అమెరికా దళాలు కొనసాగుతాయని ఆఫ్గాన్‌లో పౌరప్రభుత్వ పెద్దలు ఆశించారు. కానీ, శాంతి చర్చల్లో తమ ప్రతినిధిగా జల్మే ఖలీల్జాద్‌ను కొనసాగించడంతో బైడెన్ సైతం ట్రంప్ విధానాన్నే అనుసరించనున్నట్లు తేలిపోయింది. పాక్ మిత్రదేశమైన టర్కీ అతిత్వరలో కాబూల్ విమానాశ్రయ రక్షణ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించడంతో నాటో దళాలూ ఇక్కడి నుంచి వేగంగానే మరలిపోయే అవకాశముంది.
పొంచి ఉన్న ముప్పు
అమెరికా సంకీర్ణ సేనల నిష్క్రమణ తరవాత అఫ్గాన్ దళాలపై తాలిబన్లు దండెత్తి మూడేళ్లలోపే అధికారాన్ని దక్కించుకొంటారని ట్రంప్ జమానాలో ఇంటెలిజెన్స్ వర్గాలు శ్వేతసౌధానికి నివేదించాయి. ఇటీవలే హిల్లరీ క్లింటన్ సైతం బైడెన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అఫ్గానిస్థాన్ నుంచి వెల్లువెత్తబోయే శరణార్థుల సునామీని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలన్న ఆమె మాటల్లో ‘అక్కడ అంతర్యుద్ధం తప్పదు’ అన్న హెచ్చరిక ధ్వనిస్తోంది. దళాల నిష్క్రమణకు గతంలో ట్రంప్ విధించిన గడువు దాటడంతో తాలిబన్ మూకల దాడులూ పెరిగిపోయాయి. తాజాగా కాబూల్‌లో ఓ పాఠశాలపై విరుచుకుపడి డజన్ల కొద్దీ ఆడపిల్లల ప్రాణాలను బలితీసుకున్నారు. ఈ పరిణామాలన్నీ భారత్‌లో ఆందోళనను పెంచుతున్నాయి.
రష్యా, చైనా వంటి దేశాలతో కలిసి..
అఫ్గాన్‌లో ఇప్పటికే మూడు వందల కోట్ల డాలర్లు వెచ్చించి పలు అభివృద్ధి పనులు చేపట్టిన ఇండియా, అక్కడి ప్రజా ప్రభుత్వాలతో సన్నిహిత సంబంధాలను నెరిపింది. అమెరికా సేనలు వెళ్లాక... భారత ప్రాజెక్టులు పాక్ ప్రేరేపిత హక్కానీ నెట్‌వర్క్, తాలిబన్లకు లక్ష్యంగా మారవచ్చు. కశ్మీర్‌లో తాము జోక్యం చేసుకోమంటున్న తాలిబన్ల మాటలనూ నమ్మలేం. వీరికి పాక్ సైన్యం, ఐఎస్‌ఐ మొదటి నుంచీ అండదండలందిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తాలిబన్లను బహిరంగంగా గుర్తించే విషయంలో భారత వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మనం అంగీకరించకపోయినా అఫ్గాన్‌లో తాలిబన్లు బలమైన వర్గం. భవిష్యత్తులో తాపీ పైప్‌లైన్ వంటి కీలక ఇంధన ప్రాజెక్టుల్లో భారత్‌కు సహకారం లభించాలంటే వారితో సంబంధాలు నెరపడం తప్పనిసరనే వాదన వినిపిస్తోంది. అవసరార్థం ఈ పని చేసినంత మాత్రాన తాలిబన్ల భావజాలాన్ని సమర్థించినట్లు కాదు. 1996-2001 నాటి పరిస్థితులు తలెత్తకుండా రష్యా, చైనా వంటి దేశాలతో కలిసి పనిచేయాలి.
సత్సంబంధాలు కీలకం..
మరోవైపు భారత ఈశాన్య సరిహద్దుల్లో మయన్మార్ సంక్షోభం మరో తలనొప్పిగా మారింది. అక్కడి సైనిక పాలకులపై ఆంక్షలు విధిస్తున్న పశ్చిమదేశాలు, భారత్ సైతం తమ బాటలో నడవాలని ఆశిస్తున్నాయి. భారత్-మయన్మార్‌కు 1,624 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. భవిష్యత్తులో ‘చికెన్స్ నెక్’ (సిలిగుడి నడవా) సంక్షోభంలో పడితే, ఈశాన్య రాష్ట్రాలకు కీలక సరఫరాలు కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ మార్గమైన కళాదాన్ ప్రాజెక్టు మయన్మార్‌లోనే ఉంది. భారత్-మయన్మార్-థాయ్‌లాండ్ రోడ్డు మార్గానికీ ఇరు దేశాల సత్సంబంధాలు చాలా కీలకం.
భారత అంతర్గత భద్రతే కీలకం
ఫిబ్రవరిలో టామడోవ్ (మయన్మార్ సైన్యం) తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక అక్కడ హింస పేట్రేగుతోంది. చైనా ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నం చేస్తోంది. మయన్మార్‌లో జరిగిన దాన్ని మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణగా అభివర్ణించింది. మరోవైపు, మొదటి నుంచి టామడోవ్‌తో మన సంబంధాలు సాఫీగా లేవు. మయన్మార్‌లో ప్రజాస్వామ్య ఉద్యమానికి 1988లో భారత్ మద్దతు పలికింది. ఇది అక్కడి సైన్యం ఆగ్రహానికి కారణమైంది. దీంతో భారత్‌లో ఈశాన్యప్రాంత వేర్పాటు వాదానికి ఆ దేశం అడ్డాగా మారింది.
'క్యూక్పియు' రేవు కోసం..
1993 నుంచి ఇరుదేశాల మధ్య సహకారం మొదలైనా, 2011 తరవాత రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. ఫలితంగా చైనాపై ఆధారపడటాన్ని టామడోవ్ తగ్గించింది. ఈశాన్య భారత్‌లో వేర్పాటు వాదుల ఏరివేతలో భారత్‌కు సహకరించింది. ఇరు సైన్యాల పరస్పర సహకారం కారణంగా 2020లోనే 644 మంది ఉగ్రవాదులు లొంగిపోయారు. ఇంకో మూడు వేల మంది వరకు నాగా, మణిపూర్, అసోం మిలిటెంట్లు మయన్మార్‌లో ఉన్నట్లు అంచనా. మరోవైపు, ఆ దేశ సైనిక పాలకుల సాయంతో బంగాళా ఖాతంలో తిష్ఠవేయడానికి చైనా కాచుకుని కూర్చొంది. పాక్‌లోని సీపెక్ మాదిరిగా చైనా-మయన్మార్ ఆర్థిక నడవా సాయంతో 'క్యూక్పియు' రేవును దక్కించుకొనేందుకు పావులు కదుపుతోంది. ఇదే జరిగితే భారత్‌కు అత్యంత కీలకమైన అండమాన్ దీవుల దగ్గర చైనా నావికాదళ కదలికలు పెరుగుతాయి. కాబట్టి మయన్మార్ విషయంలో మరీ ఎక్కువగా జోక్యం చేసుకోకుండా సరిహద్దు భద్రతను పటిష్ఠం చేసుకోవడంపై భారత్ దృష్టిపెట్టాలి!
- పెద్దింటి ఫణికిరణ్, రచయిత
ఇదీ చదవండి: ముమ్మర దాడులు-వలస బాటలో పాలస్తీనియన్లు