ETV Bharat / opinion

దేశానికే పరువు నష్టం!

ఆశించిన రంగంలో అద్భుతంగా ఎదగగలిగి ఉండీ ఇళ్లకే పరిమితమవుతున్న మహిళల వల్ల దేశం ఎంత నష్టపోతోందో అంచనా వేసే మహా గణకుడేడీ? సాటి మనిషిగా స్త్రీ మేధను గుర్తించి, వివేకాన్ని మన్నించి, ప్రతిభను ప్రోత్సహించాల్సిందిపోయి- పశువాంఛతో కాలుదువ్వుతున్న పురుషాహంకారం, కుసంస్కారం దేశప్రగతికి స్త్రీల ప్రాథమిక హక్కులకు ఉరితాళ్లు పేనుతున్నాయి.

a-brief-article-on-ex-minister-mj-akbhar-case
దేశానికే పరువు నష్టం!
author img

By

Published : Feb 21, 2021, 7:55 AM IST

పని ప్రదేశంలో మహిళ మానాభిమానాలపై పశుదాడికి తెగబడేవారికి ఆది గురువుగా భ్రష్టు పట్టినవాడు విరాటపర్వంలో కీచకుడు. కాంక్షల కళ్లతో కాటేస్తూ కాలనాగుల్లా వెంటాడే ఆ కీచక సంతతి- నేటి భారతంలో ఇందుగలదు అందు లేదన్న సందేహమే లేదు! ఎవరేమన్నా తలవంచుకు పోవాలంటూ ఆడపిల్లలకు నూరిపోసే సమాజంలో, తమకు జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తడమే మహాపరాధమవుతున్న వాతావరణంలో- 2017లో తొలిసారిగా గాలిమార్పు ప్రస్ఫుటమైంది. మహిళల సమానత్వ దినోత్సవానికి పురిటిగడ్డ అయిన అమెరికాలో హాలీవుడ్‌ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్‌ వేధింపులకు గురైనట్లు 70మందికి పైగా మహిళలు చేసిన ప్రకటన- దేశదేశాల్లో ‘మీ టూ’ ఉద్యమానికి నాంది. ప్రజాజీవనంలో లబ్ధప్రతిష్ఠుల చీకటి కోణాలపై వెలుగురేఖలు ప్రసరింపజేస్తూ 'టు ది హార్వీ వైన్‌స్టీన్స్‌ ఆఫ్‌ ది వరల్డ్‌' పేరిట వ్యాసం రాసిన ప్రియా రమణి అనే పాత్రికేయురాలు- 2018 అక్టోబరులో నాటి కేంద్రమంత్రి ఎంజే అక్బర్‌ పేరు బయట పెట్టడం సంచలనం సృష్టించింది. గతంలో ఎప్పుడో తనను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేసిన ప్రియా రమణిపై పరువు నష్టం కేసు పెట్టిన అక్బర్‌ దరిమిలా రెండు రోజులకే పదవికి రాజీనామా చేసి నిష్క్రమించాల్సి వచ్చింది. అప్పటినుంచి ఎన్నో మలుపులు తిరిగిన కేసులో నాలుగు రోజుల క్రితం దిల్లీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు- అభిమానవతుల గుండె గాయాలకు చందనలేపనం లాంటిది. పరువునష్టం పేరిట క్రిమినల్‌ నేరాభియోగాలతో బాధితుల నోరు కుట్టేయడం కుదరదంటున్న తీర్పు భేషుగ్గా ఉన్నా- మహిళల్ని వేధించడమే మగతనమనుకొనే మహా జాడ్యానికి నేటికీ సరైన మందు కొరవడింది. ఆ వైనం చిత్తగించండి.

బాధితురాలిపైనే కేసు

ఆర్కన్‌ సాస్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు (1991) బిల్‌ క్లింటన్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ నాటి ఉద్యోగి పౌలా జోన్స్‌ పాతికేళ్ల క్రితం దాఖలు చేసిన కేసు పెను సంచలనం అయింది. కేసు దాఖలయ్యే నాటికి దేశాధ్యక్షుడిగా ఉన్న క్లింటన్‌కు రాజ్యాంగపర రక్షణలు ఏమైనా ఉన్నాయా అన్నదానిపై అక్కడి న్యాయపాలిక తీర్పు ఇవ్వగా, అంతటి అధ్యక్షుడూ అంతిమంగా పరువుమాసి, జరిమానా కట్టి లెంపలు వేసుకోవాల్సి వచ్చింది. దురదృష్టం ఏమిటంటే అక్కడి నేరన్యాయ వ్యవస్థకు భిన్నంగా ఇక్కడి బాధితురాలిపైనే పరువునష్టం కేసు దాఖలైంది.

ఉల్టా చోర్‌ల కోరలు పీకిన తీర్పు

'తమపై జరిగిన వేధింపుల గురించి ఎప్పుడైనా, ఏ వేదికద్వారా అయినా స్పందించే హక్కు స్త్రీలకు ఉంది' అని ప్రకటించిన దిల్లీ తీర్పు- 'స్త్రీ గౌరవాన్ని, జీవించే హక్కును పణంపెట్టి మరొకరి పరువు హక్కును కాపాడలే'మని ఉన్నతాదర్శానికి గొడుగు పట్టింది. సామాజికంగా పలుచన అవుతామన్న భయంతో చాలామంది మహిళలు తమపై జరిగే అఘాయిత్యాల్ని బయట పెట్టలేరంటూ- అందుకు ధైర్యం కూడగట్టుకొన్న వారికి దన్నుగా నిలబడే విధంగా తీర్పు వెలువరించింది. ఇంటా బయటా స్త్రీమూర్తుల గౌరవాన్ని నిలబెట్టడమే మగవారి పరువు చిహ్నంగాని, అధికార మద బలంతో అబలల్ని సాధించాలనుకోవడం అక్షరాలా క్రిమినల్‌ నేరమవుతుంది. అలాంటి 'ఉల్టా చోర్‌'ల కోరలు పీకిన తీర్పు ఇది!

భర్తఎదుటే

బాల్య వివాహాల్ని అడ్డుకొంటోందన్న కోపంతో రాజస్థాన్‌కు చెందిన భన్వారీదేవి అనే సర్కారీ సామాజిక కార్యకర్తను 1992లో ఆమె భర్త ఎదుటే సామూహిక అత్యాచారం చేశారు. ఏవో చిన్నా చితకా కేసులు పెట్టి దోషుల్ని తొమ్మిది నెలల్లోనే వదిలేసిన అవ్యవస్థపై పెల్లుబికిన సామాజిక ఆందోళనకు ఫలశ్రుతిగా సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.

పని ప్రదేశంలో మహిళలకు రక్షణ ఎండమావే

పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించడానికి, ప్రతి దశలోనూ స్త్రీ ఉద్యోగుల భద్రతకు ఆ సంస్థ యాజమాన్యమే బాధ్యత వహించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో- 1997లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని 142 అధికరణ కింద అసాధారణ అధికారాన్ని ఉపయోగించి తాము ఇచ్చిన ఆదేశాలకు భవిష్యత్తులో తగు చట్టం వచ్చేదాకా చట్టబద్ధత ఉంటుందంటూ జస్టిస్‌ జేఎస్‌ వర్మ వెలువరించిన తీర్పు- పని ప్రదేశాల్లో స్త్రీల రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ఏకరువు పెట్టింది. అది జరిగిన 16 ఏళ్లకు కేంద్రం చట్టం తెచ్చినా- సుప్రీం ఆదేశాలే దానికన్నా మన్నికైనవిగా పేరెన్నికగన్నాయి. 1997 ఆదేశాల స్ఫూర్తి, 2013 నాటి చట్ట నిబంధనలూ ఏ మేరకు అమలవుతున్నాయని ఆరా తీస్తే ఆవేదన కలుగుతుంది. పని ప్రదేశాల పద్మవ్యూహంలో అభిమన్యుడిలా మారిన అభాగినుల మూగరోదన ఎవరికీ పట్టకపోబట్టే అరాచకాలకు అంతూపొంతూ లేకుండా ఉంది.
లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఉద్యోగిని బ్యాంకు సీనియర్‌ అధికారిపై ఆరోపణ చేస్తే ఆమెనే అక్కడినుంచి బదిలీ చేశారు. ఆ బదిలీ ఉత్తర్వుల్ని రద్దు చేసిన న్యాయపాలిక- ఆ తరహా వేధింపులు బాధితుల ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమేనని నిరుడు ఈ రోజుల్లో స్పష్టీకరించింది.

తనదాకా వచ్చేసరికి!

దురదృష్టం ఏమిటంటే- తనదాకా వచ్చేసరికి బాధితుల ప్రాథమిక హక్కుకు సాక్షాత్తు సుప్రీంకోర్టూ సరైన భరోసా కల్పించలేకపోయింది. 2019 మే నెలలో అప్పటి సీజేఐ రంజన్‌ గొగోయికి 'క్లీన్‌ చిట్‌' ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టే న్యాయసమ్మతంగా వ్యవహరించలేదన్న ఆక్షేపణలు వినవచ్చాయి. జస్టిస్‌ గొగోయిపై వచ్చిన ఆరోపణలు కుట్రపూరితమంటూ అప్పట్లో తనంత తానుగా నమోదు చేసిన కేసునూ తాజాగా సుప్రీంకోర్టు మూసేసింది. ఆదర్శానికి ఆచరణకు నడుమ అగాధంలో ప్రతిధ్వనిస్తున్న స్త్రీమూర్తుల వేదనలకు రోదనలకు ఎవరు జవాబుదారీ?

దేశకార్మిక శక్తిలో మహిళా వాటా20లోపే

పని ప్రదేశంలో వేధింపులకు తాళలేక వెంకటేశ్వర వైద్యకళాశాల పూర్వ విద్యార్థిని డాక్టర్‌ శిల్ప 2018లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిరుడు ఈ రోజుల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే ముగ్గురు ఆచార్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. బాసర ట్రిపుల్‌ ఐటీలో అంతక్రితం ఓ ప్రొఫెసర్‌కు బేడీలు పడ్డాయి. ఆడవారిని ఆటబొమ్మగా తప్ప చూడలేని మానసిక వికారం అన్ని స్థాయుల్లోనూ పాతుకుపోయింది. దేశ కార్మికశక్తిలో మహిళల వాటా భూటాన్‌లో 58.3, నేపాల్‌లో 81.6, చైనాలో 60.6, బంగ్లాదేశ్‌లో 36.1, శ్రీలంకలో 34.7శాతంగా ఉంటే ఇండియాలో అది 20శాతం లోపే నమోదవుతోంది. 15-59 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 60శాతం ఇంటిపనుల్లోనే నిమగ్నమయ్యారని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఆశించిన రంగంలో అద్భుతంగా ఎదగగలిగి ఉండీ ఇళ్లకే పరిమితమవుతున్న మహిళల వల్ల దేశం ఎంత నష్టపోతోందో అంచనా వేసే మహా గణకుడేడీ? సాటి మనిషిగా స్త్రీ మేధను గుర్తించి, వివేకాన్ని మన్నించి, ప్రతిభను ప్రోత్సహించాల్సిందిపోయి- పశువాంఛతో కాలుదువ్వుతున్న పురుషాహంకారం, కుసంస్కారం దేశప్రగతికి స్త్రీల ప్రాథమిక హక్కులకు ఉరితాళ్లు పేనుతున్నాయి. కాదంటారా?

- పర్వతం మూర్తి

ఇదీ చూడండి: అమ్మభాషతోనే స్వావలంబన: వెంకయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.