నా పేరు జెస్సీ. వరంగల్‌లో ఉంటాను. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, జానకి .. ఇది నా కుటుంబం. ఏంటీ.. జానకి ఎవరా అని ఆలోచిస్తున్నారా? తను నా ప్రాణానికి ప్రాణమైన స్నేహితురాలు. ఆమెని కూడా నా కుటుంబ సభ్యురాలిగానే భావిస్తా. అందుకే ప్రతి విషయం గురించి ఇద్దరం చర్చించుకుంటే కానీ ఓ నిర్ణయం తీసుకోం. మేమంతా కలిసి చాలా సంతోషంగా ఉండేవాళ్లం.
నేను, జానకి చిన్నప్పట్నుంచి కలిసే చదువుకున్నాం. జానకి వాళ్ల తల్లిదండ్రులది పల్లెటూరి నేపథ్యం. అందుకే తనకు అంతగా స్వేచ్ఛనిచ్చేవారు కాదు. మా అమ్మానాన్న అయితే జానూని తమ సొంతబిడ్డలానే చూసుకునేవారు. డిగ్రీ వరకు ఆడుతూపాడుతూ చదువుకుంటూ సమయం తెలియకుండానే గడిపేశాం. తర్వాత జానకి వాళ్ల తల్లిదండ్రులు మంచి సంబంధం వచ్చిందంటూ తనకి 25రోజుల్లో పెళ్లి చేసేశారు. ఆ కాస్త వ్యవధిలో వివాహానంతరం తను అడుగుపెట్టబోయే కొత్తజీవితం గురించి, తల్లిదండ్రుల్ని, నా స్నేహాన్ని వదిలిపెట్టడం గురించి ఆలోచించడానికే తనకి సరిపోయింది. అతని గురించి తెలుసుకోవడానికి లేదా అతనితో మాట్లాడటానికి తను అసలు ప్రయత్నించలేదు. వాళ్ల నిశ్చితార్థానికి వెళ్లినప్పుడు నేను అతన్ని మొట్టమొదటిసారి చూశాను. పేరు నీరజ్. ఎంబీఏ చేశాడు. ఎమ్మెన్సీలో ఉద్యోగం చేస్తున్నాడట. చూడటానికి మనిషిని నమ్మచ్చనిపించే విధంగానే కనిపించాడు. అలా కొద్ది రోజుల్లోనే చాలా ఘనంగా వారి పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత నీరజ్‌కి మా వూరికే ట్రాన్స్‌ఫర్ అయింది. దాంతో మా అందరికీ దగ్గరగా ఉండచ్చని జానూ చాలా సంతోషించింది. అప్పుడప్పుడు తను మా దగ్గరికి రావడం లేదా మేమే తన ఇంటికి వెళ్లడం చేసేవాళ్లం. నీరజ్ కూడా తనని చాలా బాగా చూసుకుంటున్నాడని పొంగిపోయేది.
ఓ రోజు నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్లొస్తుంటే నీరజ్ వేరే అమ్మాయిని తన బైక్‌పై ఎక్కించుకొని చాలా క్లోజ్‌గా మాట్లాడుతూ వెళ్లడం నా కంట పడింది. తర్వాత నేను జానకి దగ్గరకి వెళ్లినప్పుడు ఈ విషయం ప్రస్తావిస్తే ఎవరో ఫ్రెండ్ అయి ఉంటుందని వెనకేసుకొచ్చింది. అదీగాక నా ముందే తన భర్తని నవ్వుతూనే ఈ విషయం గురించి అడిగేసింది. దానికి నీరజ్ నవ్వుతూ 'తను మా ఆఫీస్ కొలీగ్.. వేరే చోట మీటింగ్‌కి వెళ్లాల్సొస్తే ఇద్దరం కలిసెళ్లాం. అంతే..' అంటూ సమాధానమిచ్చాడు. దాంతో నేను కూడా ఆ విషయాన్ని అక్కడితో వదిలేశా.
ఆ తర్వాత కొద్ది రోజులకు నేనొక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించా. అక్కడ తనూజ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి తక్కువ కాలంలోనే ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఓ రోజు ఒకబ్బాయి ఫొటో చూపిస్తూ ఇతనే నా బాయ్‌ఫ్రెండ్ అని చెప్పింది. అది చూసి షాకవడం నా వంతైంది. అందులో ఉన్నది నీరజ్. వెంటనే తనూజని తీసుకుని జానకి ఇంటికి పరుగుపెట్టా. అప్పటికి నీరజ్ ఇంట్లో లేడు. జానూకి వెంటనే విషయం చెప్పి, ఫొటోలు చూపించాం. దాంతో తను కూడా కంగుతింది. ఏం చేయాలో తెలియక ఏడవడం మొదలెట్టింది. నేను ముందుజాగ్రత్తగా జరిగిందంతా తనూజకి వచ్చేదారిలో చెప్పాను. తర్వాత ఏం చేయాలి అనే విషయం గురించి కూడా ఇద్దరం మాట్లాడుకొని ఓ ప్లాన్ సిద్ధం చేశాం. జానూని కాస్త వూరడించి ఆ ప్లాన్ తనకి చెప్పాం. వెంటనే తను కూడా తమాయించుకుని మామూలు స్థితికి వచ్చింది.
పథకం ప్రకారం జానూని తన అమ్మవాళ్లింటికి వెళ్తున్నట్లు నీరజ్‌కి చెప్పమన్నాం. ఆ తర్వాత తనూజ ఫోన్ నుంచి నీరజ్‌కు 'నీతో పర్సనల్‌గా మాట్లాడాలి. బయటికెళ్దాం' అంటూ మెసేజ్ పంపించాం. వెంటనే నీరజ్ 'నేను నిన్ను ఈ రోజు ఒకరి ఇంటికి తీసుకెళ్తా' అంటూ రిప్త్లె ఇచ్చాడు. తనూజకి తన రక్షణకు అవసరమయ్యే అన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాం. మా ప్లాన్ కాస్త రిస్క్‌తో కూడుకున్నది కాబట్టి పోలీసుల్ని కూడా ముందుగానే సంప్రదించి అవసరమైన భద్రతాచర్యలు తీసుకున్నాం. మేం అనుకున్నట్లుగానే నీరజ్ తనూజని వాళ్లింటికి తీసుకెళ్లాడు. అక్కడ తనూజ పెళ్లి గురించి ప్రస్తావించగా, 'పెళ్లి సంగతి తర్వాత.. ముందు నువ్వు కావాలంటూ' ఆమెను లోబర్చుకోవడానికి ప్రయత్నించాడు నీరజ్. తనూజ ప్రతిఘటిస్తుండగానే జానకి, నేను, పోలీసులు అక్కడికి చేరుకున్నాం. వెంటనే పోలీసులు నీరజ్‌ని అరెస్ట్ చేయడం, అక్కన్నుంచి తీసుకెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు జానకి తన తల్లిదండ్రులతోనే కలిసి ఉంటోంది. నీరజ్ విషయంలో మోసపోయింది కాబట్టి ఆ వివాహాన్ని రద్దు చేయాల్సిందిగా కోర్టుకి అర్జీ పెట్టింది. ఇప్పుడు జానకి, నేను, తనూజ కూడా మంచి స్నేహితులమయ్యాం. సంతోషంగా ఉంటున్నాం.
పెళ్లయినా నీరజ్‌లా పరాయి అమ్మాయిల పంచన చేరే వంచకులు చాలామందే ఉంటారు. వీళ్లంతా భార్యల ముందు శ్రీరామచంద్రుల్లా నటిస్తూ.. బయటికెళ్లగానే శ్రీకృష్ణుడిగా మారిపోతూ ఉంటారు. కాబట్టి ఆడవాళ్లే వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అలాగని మగవాళ్లందరినీ, వాళ్ల స్నేహాలన్నిటినీ అనుమానించమని నా ఉద్దేశం కాదు. కానీ అనుమానం వస్తే నిర్లక్ష్యం వహించొద్దని మాత్రమే చెబుతున్నా.
- జెస్సీ
ఇదీ చూడండి: చేయూత ఇచ్చింది.. చేయందుకున్నాను!