నా పేరు కీర్తన.. మాది బెంగళూరులో స్థిరపడిన కుటుంబం. మా అమ్మ మరాఠీ.. నాన్న తెలుగువారు.. ఇద్దరూ బెంగళూరులో కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రేమించుకొని పెళ్లాడారు. తమ ప్రేమకు పెద్దవాళ్ల అనుమతి తీసుకొని మరీ పెళ్లి చేసుకోవడంతో మాకు ఇరు కుటుంబాలతో ప్రేమతో పాటు.. రెండు సంప్రదాయాల గురించి కూడా తెలిసేది. నాతో పాటు ఓ తమ్ముడు కూడా. ఇద్దరం టామ్ అండ్ జెర్రీల్లా కొట్టుకున్నా.. ఒకరు లేకపోతే మరొకరు ఉండలేం.. అంత ప్రేమ ఒకరంటే ఒకరికి.. ఇలా సంతోషంగా జీవించే కుటుంబం మాది. నేను ఎంబీయే పూర్తిచేశాక ఓ చిన్న స్టార్టప్‌ని ప్రారంభించా. ఆ పనిలో బిజీగా ఉండగానే అమ్మానాన్నలు నా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. నేను ఎవరినీ ప్రేమించలేదు కాబట్టి నాకు వరుడిని చూసే బాధ్యత వాళ్ల మీదే పెట్టేశా. ఆరు నెలల పాటు వెతికి కొన్ని సంబంధాలు ఫైనల్ చేశారు అమ్మానాన్న. వాళ్లందరినీ కలిసిన తర్వాత నాకు నచ్చిన రాహుల్‌తో పెళ్లికి సరేనన్నా. అమ్మానాన్న కూడా ఎంతో సంతోషించారు. ఇద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు.
రాహుల్‌ది మరాఠీ నేపథ్యం ఉన్న సంప్రదాయ కుటుంబం. వాళ్ల అమ్మానాన్న పుణెలో ఉంటే.. తను ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉండేవాడు. దాంతో నేను పెద్దగా అడ్జస్ట్ కావాల్సిన అవసరం రాలేదు. పెళ్లి తర్వాత పదిహేను రోజులు పుణెలో ఉండి తిరిగొచ్చాం. ఈ పదిహేను రోజులు నన్ను మా అత్తగారు ఎంతో ప్రత్యేకంగా చూస్తుంటే ఓవైపు ఆశ్చర్యం, మరోవైపు ఆనందం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేవి. రాహుల్ కూడా బాగానే మాట్లాడేవాడు. తను చాలా రిజర్వ్‌డ్ టైప్ అని.. కొత్తవాళ్లతో కలిసిపోయేందుకు కాస్త సమయం పడుతుందని వాళ్ల అమ్మ, చెల్లి చెప్పడంతో నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ బెంగళూరుకు తిరిగొచ్చినా తన ప్రవర్తనలో పెద్దగా మార్పు రాలేదు..
బెంగళూరుకు వచ్చేశాక మేమిద్దరం కలిసి రాహుల్ ఆఫీస్‌కి దగ్గర్లో ఓ ఫ్లాట్ తీసుకున్నాం. ఆ ఇంటికోసం ఇంటీరియర్స్ అన్నీ ఎంతో ఇష్టపడి కొన్నా. నా పొదరిల్లును ప్రేమతో అలంకరించుకున్నా.. ఇక మొత్తం ఆనందమే అనుకున్నా.. కానీ అదే నా జీవితంలో కరువైంది. రాహుల్ మిగిలిన అన్ని విషయాల్లోనూ మామూలుగానే ఉండేవాడు. కానీ పెళ్లయిన ఆరు నెలలకు కూడా నన్ను దగ్గరికి రానివ్వలేదు. నన్నో స్నేహితురాలిగా చూసేవాడే తప్ప.. ప్రేమగా ముద్దులివ్వడం, సరసాలు, చిలిపి మాటలు ఇవేవీ మా మధ్య లేవు. పెళ్త్లెన కొత్తలో భార్యాభర్తల అనుబంధం గురించి నేను ఊహించుకున్నవన్నీ ఊహలుగానే మిగిలిపోతున్నాయని చాలా బాధగా అనిపించేది. దగ్గరయ్యేందుకు ఇబ్బంది పడుతున్నాడేమో.. కొన్నాళ్త్లెతే తనే సర్దుకుంటాడు అని చాలా కాలం వేచి చూశాను. ఆ తర్వాత ఓరోజు కోపం తట్టుకోలేక అడిగేశా.. దీంతో తనకు శృంగారమంటే పెద్దగా ఆసక్తి లేదని.. అందుకే ఇలా దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. నాకేం చేయాలో పాలుపోలేదు. నాతో పాటు పనిచేసే నా స్నేహితురాలి సలహా మేరకు తనని మంచి డాక్టర్‌కి చూపించాలనే నిర్ణయానికి వచ్చా. ఇక పెళ్త్లెన జంటల మధ్య ఉండే చిలిపి గిల్లికజ్జాలు మా మధ్య మొదలవుతాయన్న ఆనందంతో ఆరోజు మధ్యాహ్నమే ఇంటికి వెళ్లిపోయా.
కింద పార్కింగ్‌లో తన కారు చూసి ఎంతో ఆనందంగా ఈ విషయం తనకు చెప్పాలని గంతులేస్తూ పైకి వెళ్లాను. అయితే చాలాసేపు తలుపు కొట్టినా తీయకపోవడంతో నా దగ్గరున్న కీతో తలుపు తెరచుకొని నేనే లోపలికి వెళ్లాను. బెడ్‌రూం తలుపు కొద్దిగా వేసి ఉండడంతో తను పడుకున్నాడేమో అనుకుంటూ లోపలికి వెళ్లిన నేను అక్కడ కనిపించిన దృశ్యం చూసి హతాశురాలినైపోయా. బెడ్‌పై రాహుల్ మరో అబ్బాయితో కలిసి ఉన్నాడు. నన్ను చూసి వాళ్లిద్దరూ భయపడిపోయారు. వెంటనే నేను హాల్లోకి వచ్చేశా. ఆ అబ్బాయి డ్రస్ మార్చుకొని బయటకు వెళ్లిపోయాడు. ఈ విషయం గురించి రాహుల్‌తో ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. దీంతో రెండు రోజుల పాటు మా మధ్య మౌనం రాజ్యమేలింది. ఆ తర్వాత రోజు రాహుల్ నాకు ఫోన్ చేసి మాట్లాడాలని ఇంటికి పిలిచాడు. అప్పుడే తన మనసులోని మాటను బయటపెట్టాడు. అది విన్న తర్వాత ఇన్నాళ్లపాటు నేను కట్టుకున్న ప్రేమ పొదరిల్లు కళ్లముందే కూలిపోయినట్లుగా అనిపించింది.
'నేను గేని.. నాకు అమ్మాయిలంటే ఆసక్తి లేదు. అబ్బాయిలనే ప్రేమిస్తాను. అందుకే ఇన్నాళ్లూ నిన్నో మంచి స్నేహితురాలిగా భావించగలిగానే తప్ప ప్రేమించలేకపోయా. పెళ్లి చేసుకొని నిన్ను ఇబ్బందిపెట్టడం నాకూ పెద్దగా ఇష్టం లేదు. కానీ మా అమ్మ నేను వివాహం చేసుకోకపోతే తను నిద్రమాత్రలు మింగి చచ్చిపోతానని నన్ను బెదిరించింది. తన మీద ఉన్న ప్రేమతో తన మాట కాదనలేకపోయాను. నీకు నేను చాలా అన్యాయం చేశానని నాకు తెలుసు. అది నన్ను ఇన్ని నెలల నుంచి నిద్ర లేకుండా చేస్తోంది. కానీ ఇది నేను కావాలని చేసినది కాదు.. నేను గే అని తెలిస్తే సమాజం ఏమంటుందో అని మా అమ్మానాన్న భయపడ్డారు. పెళ్లి చేస్తే నేను మారతానేమో అనుకున్నారు. నా వల్ల నీ జీవితం నాశనం కాకూడదని నా శాయశక్తులా ప్రయత్నించాను. ఇప్పటికీ నీ జీవితం పాడవకుండా ఉండేందుకు నువ్వేం చెప్పినా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా.. కావాలంటే నువ్వు నేను గే అని చెప్పి.. నాకు విడాకులిచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా..' అంటూ తన మనసులోని బాధను వెళ్లగక్కాడు రాహుల్.
ఆరోజు నా జీవితంలోనే మర్చిపోలేని రోజు. ఒక్క రాత్రి అంత భయంకరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా కళ్లముందే నేను అన్ని రోజులు కన్న కలలన్నీ నాశనమైపోతుంటే కళ్లవెంట నీళ్లు ధారలై కారాయి. ఏడవడం తప్ప నేనేం చేయలేకపోయా. ఉదయాన్నే ఓ నిర్ణయానికి వచ్చా. జరిగినదానిలో రాహుల్ తప్పు లేదని చెప్పలేను. అయితే తన కుటుంబాన్ని కాపాడుకోవాలన్న ఆశతో తను ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. సమస్యంతా సమాజంతోనే అనిపించింది. అందుకే సమాజానికి ఎదురు నిలిచేందుకు నిర్ణయించుకున్నా. రాహుల్‌కి విడాకులిచ్చి.. అతడికి తన స్నేహితుడితో పెళ్లి చేయాలనే నిర్ణయానికి వచ్చా. ఎప్పుడూ తన మనసుకు నచ్చే మంచి స్నేహితురాలిగా ఉండేందుకు సిద్ధమయ్యా. నా నిర్ణయం సమాజానికే కాదు.. రాహుల్ కుటుంబానికి కూడా నచ్చకపోవచ్చు. కానీ నేను ప్రేమించిన వ్యక్తి సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది..
ఇదంతా మీకెందుకు చెబుతున్నానంటే.. హోమోసెక్సువలిజం తప్పు కాదని ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ఒప్పుకుంది. కానీ మనం మాత్రం ఇంకా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. హోమోసెక్సువల్ అనగానే వాళ్లేదో వేరే గ్రహం నుంచి వచ్చిన వ్యక్తుల్లా చూడడం మానేసి.. వాళ్లనీ మనుషులుగానే గుర్తించండి. ముఖ్యంగా మీ పిల్లలు హోమోసెక్సువల్ అయితే పెళ్లితో వారిలో మార్పొస్తుందని చెప్పి వారికి బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నించకండి. దీనివల్ల మీరు మీ పిల్లల జీవితంతో పాటు మరో కొత్త వ్యక్తి జీవితాన్ని కూడా నాశనం చేసినవారవుతారు.
ఇదీ చదవండి: ఈ నీళ్లు తాగితే కరోనా దరిచేరదట...!