అరగంట చాలు... సన్నగా కనిపించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా వ్యాయామం చేయాలనేది ప్రతి ఒక్కరూ చెప్పే మాట. కానీ తీరికెక్కడిది అంటారా? ఉదయం కుదరకపోతే... సాయంత్రం వేళకు మార్చుకోండి. ఆ సమయం కనీసం అరగంటైనా ఉండేలా చూసుకోండి. మొదట్లో కష్టంగా అనిపించినా... మీ శరీరం సౌకర్యంగా మారుతుంది. ఒత్తిడిని అదుపులో ఉంచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇందుకు తోటపని చేయొచ్చు. స్కిప్పింగ్ ఆడొచ్చు. మెట్లు ఎక్కి దిగొచ్చు... ఆలోచిస్తే మరెన్నో దారులు.
ఒత్తిడికి దూరంగా... ఇది మానసికంగానే కాదు శారీరకంగానూ బాధిస్తుంది. దీనివల్ల ఊబకాయం బారిన పడే ఆస్కారమూ ఉంటుంది. కాలక్రమంలో హార్మోన్ల అసమతుల్యత, నెలసరి క్రమం తప్పడం... ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదురు కావొచ్చు. అందుకే ఒత్తిడికి వీలైనంత దూరంగా ఉండాలి. అప్పుడే చురుకైన ఆలోచనలు చేయగలుగుతారు.
మీకోసం మీరు... బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించాలంటే... ఆరోగ్యంగా ఉండాలి. ఆనందంగా కనిపించాలి. ఇందుకు ఆకుకూరలు, గుడ్లు వంటి వాటితోపాటు బాదం, వాల్‌నట్, అవిసెగింజలు, గుమ్మడి గింజలు వంటివి క్రమం తప్పకుండా తీసుకోవాలి. జుట్టు, చర్మం అందంగా కనిపించేందుకు తగిన పోషణ చేసుకోవాలి. నువ్వుల నూనెతో మర్దన, పెడిక్యూర్, మేనిక్యూర్ వంటివన్నీ మీ మోములో కాంతిని పెంచుతాయి. సన్‌స్క్రీన్‌లోషన్, మాయిశ్చరైజర్ వంటివి వాడటాన్ని అలవాటు చేసుకోండి.
ఇదీ చదవండి: black fungus: ముందే గుర్తిస్తే.. మందులతోనే నయం!