ఒక్కసారి ఎండలోకి వెళ్తే శరీరంలోని నీటి స్థాయులు తగ్గిపోయి, చర్మం వాడిపోయినట్లు అయిపోతుంది. ఇక పెరిగిన ఉష్ణోగ్రత కారణంగా ట్యాన్ వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు లేకపోలేవు. అయితే కొన్ని ఫేస్‌ప్యాక్స్ ఉపయోగించడం ద్వారా అటు చర్మానికి చల్లదనాన్ని అందిస్తూనే, ఇటు సౌందర్య సంబంధిత సమస్యలకు స్వస్తి పలకచ్చు.
పాలు, నిమ్మరసంతో..
అరకప్పు చల్లని పాలు తీసుకొని అందులో ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్త్లె చేసుకుని 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. దీని ద్వారా చర్మంపై పేరుకొన్న ట్యాన్ తొలగిపోవడంతోపాటు, మచ్చలు, మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే నిమ్మరసం చెమట ఎక్కువ పట్టకుండా చేసి.. చర్మం మృదువుగా, తాజాగా కనిపించేందుకు దోహదం చేస్తుంది.
పుదీనా, పసుపుతో..
గుప్పెడు తాజా పుదీనా ఆకులు తీసుకుని సరిపడినన్ని నీళ్లు వేస్తూ మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఇందులో చెంచా పసుపు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్త్లె చేసుకోవాలి. సుమారు 10 నుంచి 15 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత గాఢత తక్కువగా ఉండే సోప్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పుదీనా అలసిపోయిన చర్మానికి చల్లదనం, జీవం అందిస్తే పసుపు యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
శెనగపిండితో..
కొద్దిగా శెనగపిండి తీసుకొని అందులో సరిపడినంత పెరుగు వేసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఇందులో నిమ్మచెక్క నుంచి తీసిన రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్త్లె చేసుకొని 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. శెనగపిండి చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగించి, ప్రకాశవంతంగా మారేలా చేస్తుంది. పెరుగు మేనుకు చల్లదనాన్నిస్తుంది.
కలబంద, పెరుగుతో..
ఒక చిన్న పాత్రలో కలబంద గుజ్జు 4 చెంచాలు, పెరుగు 2 చెంచాలు తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు మందంగా కనిపించేలా ప్యాక్‌లా అప్త్లె చేసుకోవాలి. సుమారు 10 నుంచి 15 నిమిషాలు ఆరనిచ్చి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఎంజైమ్స్, అమైనో యాసిడ్స్, విటమిన్ ఎ, బి, సి, ఎఫ్.. వంటివన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఫలితంగా చర్మానికి చల్లదనం చేకూరడంతోపాటు ఎండకు కమిలిన చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది.
పుచ్చకాయ, తేనెతో..
రెండు లేదా మూడు పుచ్చకాయ ముక్కలు తీసుకొని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇందులో చెంచా తేనె వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు దట్టంగా పట్టించాలి. సుమారు 15 నుంచి 20 నిమిషాలు ఆరనిచ్చి ఆ తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే విటమిన్ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి చల్లదనాన్ని అందించడంతో పాటు తిరిగి తాజాగా కనిపించేలా చేస్తాయి. అలాగే చర్మంపై ఉండే ముడతలు, సన్నని గీతలు కూడా తగ్గుముఖం పడతాయి.
దోసకాయతో..
దోసకాయ తీసుకొని తొక్క చెక్కేసి చిన్న ముక్కల్లా కోసుకోవాలి. నాలుగు లేదా ఐదు బాదంపప్పులు తీసుకొని దోసకాయ ముక్కల్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమంలో చల్లని పాలు కొద్దిగా వేసి బాగా కలిపి దాన్ని ముఖం, మెడకు ప్యాక్‌లా అప్త్లె చేసుకోవాలి. దాదాపు 10 నుంచి 15 నిమిషాలపాటు ఆరనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ద్వారా అలసిన చర్మం తక్షణమే తాజాగా మారుతుంది. అలాగే ప్రకాశవంతమైన, మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
టొమాటోతో..
బాగా పండిన టొమాటో ఒకటి తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఇందులో కాస్త తేనె వేసి బాగా కలిపి ఆ మిశ్రమంతో ముఖం, మెడకు ప్యాక్ వేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనిచ్చి, తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. జిడ్డుచర్మతత్వం ఉన్న వారికి ఈ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ ప్యాక్స్‌ను రోజూ వేసుకోవడం ద్వారా వేసవిలో వేడికి అలసిన చర్మానికి తిరిగి తాజాదనం చేకూరుతూనే; వేడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
ఇదీ చదవండి: ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి!