నెలసరి వచ్చినప్పుడల్లా చాలామంది మహిళలు, అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యే ఇది! పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, కడుపులో మెలిపెట్టినట్లుగా అనిపించడం, నీరసం, అలసట, వికారం.. ఇలా ఒకటా రెండా ఎన్నో అనారోగ్యాల్ని మోసుకొస్తాయి పీరియడ్స్. ఇక వీటి నుంచి తక్షణ ఉపశమనం కోసం చాలామంది మాత్రల్నే ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇవి ఇప్పటికిప్పుడు సమస్యను తగ్గించినా.. దీర్ఘకాలంలో మాత్రం వీటి వల్ల ముప్పు తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికి ప్రత్యామ్నాయమే.. హీటెడ్ మెనుస్ట్రువల్ కప్(heated menstrual cup). అబ్యాన్ నూర్ అనే సంస్థ రూపొందించిన ఈ కప్ నెలసరి సమస్యలన్నింటికి చెక్ పెడుతుంది.
ఈ పరికరం(heated menstrual cup)లో కప్పు, రింగు అనే రెండు భాగాలుంటాయి. కప్పు రక్తాన్ని నిల్వ చేస్తే... రింగు వెచ్చదనాన్ని అందిస్తుంది. సిలికాన్‌తో తయారైన కప్పు పై భాగాన ఈ రింగును అమర్చుకోవచ్చు. వాడటానికీ సౌకర్యంగా ఉంటుంది.
- ఇదీ చదవండి : రుతుస్రావంపై ఈ విషయాలు మీకు తెలుసా?
నొప్పి నుంచి ఉపశమనం..
‘నెలసరి సమయంలో మహిళలు నడుము, తల, కడుపు నొప్పులు, వికారం, వాంతులు... ఇలా రకరకాలుగా బాధపడుతుంటారు. దాంతో మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడతారు. ఈ సమస్యను తీర్చడానికి ఈ కప్పును తయారు చేశా. వేడిని అందించే ఈ మెనుస్ట్రువల్ కప్పు వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. - అబ్యాన్ నూర్
- ఇదీ చదవండి రుతుచక్రం గుట్టు విప్పుదాం..!
దుష్ప్రభావాలుండవు..
దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. వయసు, సైజు, రక్తప్రవాహంతో సంబంధం లేకుండా ఎవరైనా వీటిని ఉపయోగించవచ్చు. యాత్రలు, ప్రయాణాల్లో చక్కగా వాడుకోవచ్చు. ట్రెక్కింగ్, రోడ్ ట్రిప్స్, సైట్ సీయింగ్, సాహసాలు చేసేవారు వీటిని ఎంచక్కా ఎంచుకోవచ్చు. పీఎమ్‌ఎస్ (ప్రీమెనుస్ట్రువల్ సిండ్రోమ్)తో బాధపడే మహిళలకు ఈ కప్పు వాడకం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది’ అని చెబుతోంది నూర్. ఈ కప్పులు(heated menstrual cup) పర్యావరణ హితమైనవి. వాడకం, శుభ్రం చేయడం కూడా సులభమే. ఈ ప్రత్యేకమైన కప్పుల గురించి ప్రచారం కల్పిస్తోన్న నూర్... వీటి ప్రచారానికి అండగా ఉండే వారికి వీటిని రాయితీపై అందించనుంది.