హిమజకు 40 ఏళ్లు. ఈ మధ్య తరచూ తీవ్ర నిస్సత్తువకు గురవుతోంది. చిన్న సమస్య వచ్చినా పరిష్కరించడంలో ఒత్తిడి, ఆందోళనకు లోనవుతోంది. ఇల్లు, పిల్లల బాధ్యతలను సమన్వయం చేసుకోలేకపోతోంది. కొలెస్ట్రాల్‌లో హెచ్చు తగ్గులే ఈ సమస్యలకు కారణమంటున్నారు(Telugu Health tips) వైద్యనిపుణులు. అందుకు పరిష్కారాలూ(Telugu Health tips) చెబుతున్నారు...
ధనియాలు... యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలిక్ యాసిడ్, ఎ, సి విటమిన్లు, బీటా కెరొటిన్ వంటివి ధనియాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. రోజూ చెంచా ధనియాలను కప్పు నీటిలో మరగనిచ్చి వడకట్టి గోరువెచ్చగా తాగితే అదుపులో ఉంటుంది.
ఓట్స్... రోజూ కప్పు ఓట్స్ తిని చూడండి. ఇందులోని పీచు ఒంట్లోని అధిక కొవ్వుని తగ్గిస్తుంది. బీన్స్, నారింజ వంటివీ కొవ్వు స్థాయుల్ని పెరగనివ్వవు. అలాగే పొట్టు తీయని ధాన్యం, పప్పుదినుసులను ఎంచుకుంటే పోషకాలు, పీచు సమృద్ధిగా శరీరానికి అందుతాయి. అధిక రక్తపోటూ తగ్గుతుంది.
ఇవి కూడా.. పసుపు... రక్తనాళాల్లో పేరుకునే కొవ్వును కరిగిస్తుంది. అలానే రోజూ తాజా కూరగాయలు, పండ్ల సలాడ్లు తీసుకోవాలి. తక్కువ నూనెతో వంటకాలు చేయడమూ అలవరుచుకోవాలి. అప్పుడే సమస్య దూరమవుతుంది.
శారీరక విశ్రాంతి కంటే మానసిక ఒత్తిడి ఎంతో అవసరం.. మానసికంగా ఒత్తిడికి గురైతే ఎన్నో అనారోగ్యాలు వచ్చే అవకాశముంది. అందుకే మంచి ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలను సులభంగా జయించొచ్చు అంటున్నారు వైద్యులు. ప్రొటీన్లతో కూడుకున్న ఆహారమైతే ఇంకా మేలు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటంటే..
బాదం: వీటిలో విటమిన్ బి2, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఇది ఒత్తిడీ, వ్యాకులతకు కారణమయ్యే కారకాలతో పోరాడుతుంది. వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది. అందుకే రోజూ నాలుగైదు బాదం పప్పులనైనా తినండి.
జామ/కమలా/ బొప్పాయి: ఇవి విటమిన్-సికి కేరాఫ్ అడ్రస్ లాంటివి. రక్తపోటును నియంత్రిస్తుంది. ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోనును అదుపులో ఉంచుతుంది. అల్పాహారం తర్వాత ఓ పండు తిని చూడండి. ఫలితం మీకే అర్థమవుతుంది.
పాలకూర: దీనిలో మెగ్నీషియం అధికం. ఇది కార్టిసాల్ స్థాయుల్ని నియంత్రిస్తుంది. మూడ్ స్వింగ్స్‌ని మారుస్తుంది. ఒత్తిడినీ అదుపులో ఉంచుతుంది.
పాలు: వీటిలో యాంటీ ఆక్సిడెంట్లూ, విటమిన్ బి2, బి12, మాంసకృత్తులూ, క్యాల్షియం ఎక్కువ. పాలలో ఉండే లాక్టిమమ్ యునిక్ మిల్క్ ఎక్స్‌ట్రాక్ట్.. మెదడుకి ఉపశమనాన్నిచ్చే సుగుణాలున్న బయోయాక్టివ్ ప్రొటీన్‌ని కలిగి ఉంటుంది. దాంతో ఒత్తిడి తగ్గుతుంది. ఇందులోని పొటాషియం కండరాల నొప్పులను తగ్గిస్తుంది.
చేపలు: వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్, అడ్రినలిన్ స్థాయులను నియంత్రిస్తాయి. కాబట్టి వారంలో రెండు సార్లు చేపలను రుచి చూసేయండి మరి.
ప్రణాళికబద్ధమైన జీవనశైలితో..
ప్రకృతికి దగ్గరగా ఉండడం, మంచి ఆహారం తీసుకోవడం, యోగా చేయడం, పనుల్ని క్రమబద్ధంగా చేసుకోవడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. యోగ, ధ్యానం, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్ సైజులను నిత్యం సాధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రణాళికబద్ధమైన జీవనశైలిని అలవర్చుకుంటే అసలు ఒత్తిడి అనేదే దరి చేరకుండా చూసుకోవచ్చు.
ఇదీ చదవండి: అలర్జీకి జీవితాంతం మందులు వాడాల్సిందేనా?