నా విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే సాగింది. ఎంబీఏ పూర్తి చేశాక కొన్నాళ్లు కార్పొరేట్ రంగంలో పనిచేశా. పెళ్లి, పిల్లలతో నా కెరీర్‌కి బ్రేక్ పడింది. ఇప్పుడు వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటున్నారు. ఈ తీరిక సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు సింథటిక్ న్యాప్కిన్ల వల్ల వచ్చే ఇబ్బందుల గురించి తెలిసింది. వాటితో ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలే కాదు...పర్యావరణానికీ హానే. ఇవి భూమిలో త్వరగా కలిసిపోవు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటని ఆలోచిస్తున్నప్పుడు పర్యావరణానికి మేలుచేసే సేంద్రియ న్యాప్కిన్ల గురించి తెలిసింది.
రసాయనాలు వాడకుండా... అరటి, వెదురునార, చెక్కగుజ్జు వంటి సహజ ముడిసరకుతో వీటిని చేయడం నేర్చుకున్నాను. వీటి తయారీకోసం ప్రత్యేకించి ఓ యంత్రాన్ని సొంతంగా తయారు చేయించుకున్నా. ఇద్దరితో మొదలై ప్రస్తుతం పదిమంది ఉద్యోగులతో మా సంస్థ నడుస్తోంది. చెక్కగుజ్జుని కొవిడ్ ముందు వరకూ చైనా నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. ప్రత్యామ్నాయంగా ఆర్గానిక్ కాటన్‌ని వాడుతున్నా. ఇక వెదురునారని అసోం, మహారాష్ట్రల నుంచి తెప్పించుకుంటా.ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో అరటి నారని కొనుగోలు చేస్తున్నాం.
నెలసరి పరిశుభ్రత, ప్యాడ్ల వాడకం విషయంలో నిరక్షరాస్యులతోపాటు చదువుకున్నవారికీ నిర్లక్ష్యం ఎక్కువే. అందుకే కాలేజీ విద్యార్థినులతో కలిసి ‘డొనేట్ ఎ ప్యాడ్’ క్యాంపెయిన్ చేశాం. గూంజ్, స్పందన వంటి ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్నాం. అరబిందో, సురక్షా ఫార్మా వంటి కొన్ని ప్రముఖ సంస్థలు తమ సీఎస్‌ఆర్ కార్యక్రమల కోసం మా ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. సంస్థ ప్రారంభించిన కొద్దికాలంలోనే ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. సిడ్బీ సంస్థ ఉత్తమ ఉత్పత్తిగా గుర్తించి సత్కరించింది.
- ఇదీ చూడండి అబ్బాయిలూ.. మీ ముఖాలు వెలిగిపోయే చిట్కా ఇది!