పిల్లలకు టీవీ, ఫోను చూసే అలవాటుని మార్చాలంటే... పెద్దలుగా మనం కొన్ని పరిమితులు విధించుకోవాలి. డైనింగ్ టేబుల్ దగ్గరా, పడకగదిలోనూ, అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండాలనే నియమం పెట్టుకోవాలి. అప్పుడే వారూ మిమ్మల్ని అనుసరిస్తారు. దాన్ని క్రమంగా ఇతర సందర్భాలకూ వర్తించేలా చేయాలి.
టీవీ, ఫోన్ వాడేందుకు పిల్లలకు ఓ సమయాన్ని కేటాయించండి. అది పావుగంటైనా, అరగంటైనా... ఆ తరువాత వారిని వాటికి దూరంగా ఉంచేందుకు ప్రయత్నించండి. మొదట్లో మాట వినరు. అలాగని బలవంతం చేసినా మొండికేస్తారు. అలాంటప్పుడు వారి దృష్టిని మరల్చేందుకు వారికి నచ్చే పని ఇంకేదైనా చేసే అవకాశం కల్పించండి. అది ఆటలు ఆడటం, పాటలు పాడటం... ఏదైనా సరే!
చాలామంది తల్లిదండ్రులు... పిల్లలకు మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వడం లేదంటే... ఎక్కువగా ఆంక్షలు పెట్టడం చేస్తారు. ఇలా చేయడం వారి పెంపకంలో గొప్పదనం అని భావిస్తుంటారు. కానీ రెండూ తప్పే... ఇలాంటి పనులవల్లే కొందరు చిన్నారులు ఒంటరితనంతో టీవీలు, ఫోనులకు అలవాటు పడతారు. ఈ పరిస్థితి తలెత్తకుండా మీరు వారితో గడిపేందుకు సమయాన్ని కేటాయించండి. క్రమంగా మీతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. మీరు చెప్పినట్లూ వింటారు.