కరోనా వైరస్ గురించి చిన్నారులకు తెలియదు. ‘జ్వరం, జలుబు, దగ్గు వస్తే పూర్తిగా తగ్గేవరకు ఇంట్లో ఉండి ఎలా విశ్రాంతి తీసుకుంటామో... ఇప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పాలి. కాస్త పెద్ద పిల్లలకు ఆ వైరస్ వ్యాప్తి, దానివల్ల జరిగే అనర్థాలను వివరించాలి. అలాని చిన్నారులను భయపెట్టకూడదు. దానిపట్ల అవగాహన కల్పించాలి.
వంటింట్లోనూ వాళ్లే
టీనేజీ పిల్లలను వంటలో సాయం చేయమనడం, వాళ్ల నాన్నగారి ఆఫీసు పనిలో భాగంగా ఏదైనా లెక్కలు రాయమడం లాంటి పనులు అప్పజెప్పాలి. అలాగే దుస్తులు ఇస్త్రీ చేయడం, అల్మారా సర్దడం, పాత్రలు కడగడం లాంటి పనులు దగ్గరుండి నేర్పించాలి. సొంతంగా వారు చేసేలా చూడాలి.
కోపానికి ఉందోయ్ మందు
ప్రసుత్తం సమయం గడవడం చాలా ముఖ్యం. ఖాళీగా ఉండే చిన్నారులకు ఎటూ పాలుపోక కోపం వస్తుంది. దాంతో రకరకాల పద్ధతుల్లో వారి కోపాన్ని ప్రయోగిస్తారు. అలా కాకుండా ఉండాలంటే... వారు దెబ్బలు తగిలించుకోకుండా చేసే చిన్న చిన్న పనులు అప్పజెప్పవచ్ఛు దుస్తులు మడత పెట్టడం, పుస్తకాలు సర్దుకోవడం, చిరిగిన వాటికి అట్టలువేసుకోవడం, వారి గది సర్దుకోవడం లాంటి పనులు అప్పగించాలి. మీ పర్యవేక్షణ తప్పనిసరి.
మెగాస్టార్, సూపర్ స్టార్
చెప్పిన పనులను చక్కగా చేసినవారికి మెచ్చుకోలుగా స్టార్స్ ఇవ్వాలి. ఎవరికి ఎక్కువ స్టార్స్ వస్తే... వారికి బహుమతులు ఇస్తామని చెప్పాలి. ఈ కరోనా కల్లోలం తగ్గిన తరువాత వారికి కావాల్సినవి కొనిస్తామని చెప్పాలి. దీన్ని కొన్నిరోజులపాటు కొనసాగించాలి. పనులు,బాధ్యతలు అప్పజెప్పుతూ ప్రోత్సాహకాలను అందించాలి.
ఇండోర్... వండర్లు
చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఉల్లాసంగా ఉండేలా చూడాలి. మీరు చిన్నప్పుడు ఆడుకున్న వనగళ్ల పీట, చింతగింజల ఆట, చిట్టీలు (దొంగా-పోలీస్), అష్టాచెమ్మా, పచ్చిసూ, వైకుంఠపాళి... ఇలా పాత తరం ఆటలను కొత్తగా వారికి పరిచయం చేయాలి. క్యారమ్స్, చదరంగం ఆటల్లో మీరూ వారితో పోటీి పడండి. గెలిచిన వారికి చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం మరవొద్ధే
సమాజానికి కొంత..
పెద్ద పిల్లలైతే వారితో శానిటైజర్లు తయారుచేయించడం, మాస్కులు కుట్టించడం చేయండి. వీటిని దగ్గరల్లోని అనాథాశ్రమ పిల్లలకో, స్వచ్ఛంద సంస్థకో అందేలా ఏర్పాటు చేయండి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారికి చిన్నప్పటి నుంచే పరోపకార బుద్ధి అలవడుతుంది.
టైంమెషీన్ ఎక్కిద్దాం
మన పండగలు, దేశ, రాష్ట్రాల చరిత్ర, స్వాతంత్య్ర సమరయోధులు, కళలు, పురాతన కట్టడాల గురించి చెప్పండి. తెలుగు భాష తీపిని రుచి చూపించండి. అ, ఆ ల నుంచి సుమతీ, వేమన, భాస్కర శతకాల వరకు అన్నింటనీ కాస్తయినా పరిచయం చేయండి. రామాయణం, భారతం లాంటి ఇతిహాసాలను చిన్న చిన్న కథలుగా చెప్పండి. గొప్ప గొప్ప కవులు, మహారాజుల ఇతివృత్తాలను కథలుగా చెప్పండి.
జ్ఞానదీపాలు వెలిగించండి....
చదువూ చదువూ అంటూ వెంట పడకుండా ఒక్కోటి క్రమపద్ధతిలో అలవాటు చేయండి. ఇంగ్లిష్ స్పెల్లింగ్స్, గణితం, విజ్ఞాన శాస్త్రం ప్రతిదానికి కొంత సమయాన్ని కేటాయిస్తూ ఆసక్తి కలిగేలా నేర్పించాలి. మరీ చిన్నారులకైతే రైమ్స్, తెలుగు పద్యాలు నేర్పించాలి. వారిలో ఉండే నైపుణ్యాలను వెలికి తీయడానికి, శక్తి సామర్థ్యాలను పెంచడానికి ఇదే చక్కటి సమయం. ప్రతి పనిని ప్రాక్టికల్‌గా నేర్పించాలి. కంప్యూటర్స్ నేర్చుకునేలా ప్రోత్సహించాలి. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఒక్కోరికి కొంత సమయం కేటాయించాలి.
కళాకారుల్లారా... కదలండి
చిన్నప్పుడు సెలవుల్లో కాగితాలతో పడవలు, పూలు చేసిన గుర్తులు జ్ఞాపకం ఉన్నాయా... ఆ మధుర స్మృతులను వారితో పంచుకోండి. బంకమన్ను, క్రేయాన్, క్లేలతో బొమ్మలు తయారుచేయడం నేర్పండి. యూట్యూబ్‌లో చూసి రకరకాల బొమ్మలు చేసేలా ప్రోత్సహించండి. చిన్నారులతో రకరకాల చిత్రాలు గీయించి నచ్చిన రంగులు అద్దమనండి.