ఒక పద్ధతిగా సాగుతున్న జీవితాలను కరోనా అల్లకల్లోలం చేసింది. అన్ని రంగాల్లోనూ అనిశ్చితి రకరకాల భయాందోళనలను పెంచుతోంది. అంటువ్యాధి లాగే ఈ భయం కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉంది. అందుకే దాన్ని మొదట్లోనే తుంచేయాలి.
భావోద్వేగమే!
సంతోషం, కోపం, దుఃఖం తదితరాల్లాగే భయమూ ఒక భావో ద్వేగమే. చుట్టూ ఉన్న పరిస్థితులూ జరిగే సంఘటనలూ వినే మాటలూ దాని తీవ్రతను పెంచుతాయి. జీవితమన్నాక సమస్య లుంటాయి. కష్టాలుంటాయి. భయాలుంటాయి. వాటిని తప్పించుకోవడం అసాధ్యం. ఆందోళన, భయం, అవమానం... ఈ మూడు భావోద్వేగాలూ మనిషిలో విచారానికి కారణమవుతాయంటారు ‘ద డ్యాన్స్ ఆఫ్ ఫియర్’ అనే పుస్తకం రాసిన హారియట్ లెర్నర్. సహజంగానే ఉండే భావోద్వేగాలకు కరోనా వల్ల చోటుచేసుకున్న పరిస్థితులు ఆజ్యం పోస్తున్నాయి. ఓ పక్క వ్యాధి భయమూ మరో పక్క సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అది చూపిన ప్రభావమూ... కలిసి అభద్రతని పెంచుతున్నాయి. కరోనా నేపథ్యంలో మనుషుల్లో అసహజ ప్రవర్తన ఎక్కువైందనీ మానసిక సమస్యలతో వైద్యులను సంప్రదించడం పెరిగిందనీ అధ్యయనాలు చెబుతున్నాయి. కుటుంబాల్లో పెరుగుతున్న గృహహింస, పెరుగుతున్న దురలవాట్లూ కూడా దాని ఫలితమే.
అపోహలు
కొత్తలో కరోనాకి సంబంధించిన అపోహలతో చాలామంది ఆందోళనకు గురయ్యారు. చిత్తూరు జిల్లాలో ఆరోగ్యంగా ఉన్న ఓ వ్యక్తి రెండు తుమ్ములు రాగానే తనకి వైరస్ సోకిందని భావించి తనవల్ల కుటుంబసభ్యులకీ సోకుతుందని భయపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొన్నిచోట్ల ఈ వైరస్ భయం మనిషిలోని మానవత్వాన్నే చంపేసింది కూడా. సాధారణ అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తులకు కూడా కరోనానే కారణమని భావించి అంత్యక్రియలు చేయకుండా అడ్డుకున్నారు కొందరు. కుటుంబసభ్యులకు కనీసం చివరిచూపు కూడా దక్కనీయలేదు.
మోతాదు మించితేనే...
అతి ఏదైనా అనర్థదాయకమేనంటారు. భయమూ అంతే. అది పుట్టేది మనసులోనే కానీ మొత్తంగా శరీరాన్ని వణికిస్తుంది. విపరీతమైన భయం వ్యాధినిరోధక శక్తిని తగ్గిస్తుంది. గుండె జబ్బులకు దారితీస్తుంది. జీవితకాలం బాధపడే మానసిక ఆరోగ్య సమస్యల్ని సృష్టిస్తుంది. ఎంత భయపడితే మన ఆరోగ్యానికి అంత నష్టం. అందుకని భయానికి- భయపడకూడదంటారు మానసిక శాస్త్రవేత్తలు. ఇప్పుడే కాదు, రేపు ఎలా ఉంటుందన్నదానికి ఎప్పుడూ గ్యారంటీ లేదు. ఎవరి ప్రాణానికీ నూరేళ్ల హామీ లేదు. అయినా మనిషి ఆశాజీవి కాబట్టి... క్రమశిక్షణతో జీవితం గడపాలని ఆశిస్తాడు కాబట్టి... జీవితకాలపు ప్రణాళికలు వేసుకుంటాడు. కానీ పరిస్థితులన్నీ మన చేతిలో ఉండవు కనక ఎవరి ప్రణాళికా అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు.
పారిపోవద్దు... ఎదుర్కోవాలి
మనకి భౌతికంగా కానీ మానసికంగా కానీ హాని జరుగుతుందనుకున్నప్పుడు లేదా మనం భయపడినప్పుడు మెదడులో స్ట్రెస్ హార్మోన్ విడుదలవుతుంది. అదే సమయంలో నాడీమండలంలో ఓ భాగం కూడా ఉత్తేజితమవుతుంది. దాంతో కళ్లు పెద్దవి అవడం, ఊపిరి వేగంగా తీసుకోవడం, బీపీ, దాంతోపాటే గుండెకొట్టుకునే వేగం పెరగడం లాంటివన్నీ జరుగుతాయి. ఆ హార్మోన్‌ని ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ హార్మోన్ అంటారు. అంటే ‘ఎదురుతిరిగి పోరాడు లేదా పారిపో’ అని హెచ్చరిస్తుందన్నమాట. చాలా సందర్భాల్లో మనం భయపెట్టే పరిస్థితులకు దూరంగా పారిపోతాం, లేదా వాయిదా వేస్తాం. అలా కాకుండా నిలిచి ఆ పరిస్థితిని ఎదుర్కొనగలగాలి... అప్పుడే గెలుస్తాం. నిజానికి ఏ విషయంలోనైనా అసలు భయం పది శాతమే ఉంటుంది. మిగిలిన తొంభైశాతమూ మనసు కల్పించే భయమే. మనం ఎంతగా తప్పించుకుందామని చూసినా వినదు. ఎక్కడెక్కడి విషయాల్నీ గుర్తుచేసి భయాన్ని పెంచుతుంది. ‘
వదిలించుకోవాలి
ఖాళీగా ఉన్న బుర్ర ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. అందుకని కొన్ని అలవాట్లతో అనవసరమైన ఆలోచనలనూ భయాలనూ దూరం పెట్టొచ్చు.
వ్యాయామం: ఇది శరీరాన్నీ మెదడునీ కూడా రిలాక్స్‌డ్‌గా ఉంచుతుంది. ఒత్తిడిగా అనిపించినప్పుడు ఒక పదినిమిషాలు ఒంటరిగా కూర్చుని శ్వాస వ్యాయామాలు చేయాలి. అలా చేయడం వల్ల అనవసర ఆలోచనలు పోయి వర్తమానం మీద దృష్టిపెట్టడానికి వీలవుతుంది. నచ్చిన సంగీతం వినడమూ అందుకు దోహదం చేస్తుంది.
మీరే రోల్ మోడల్: తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించేవారిని చూసి భయపడుతున్నారా- వారిని మనం శాసించలేం కానీ ఎలా ప్రవర్తించాలో చేసి చూపించగలం. కాబట్టి అందరూ ఎలా ప్రవర్తించాలని మీరు అనుకుంటున్నారో అలా మీరే ప్రవర్తిస్తూ రోల్‌మోడల్ అవండి.
పోయేదాకా ఎందుకు: ఉద్యోగం పోతే ఎలా అన్నది మీ భయమైతే- నిజంగా పోతే ఏం చేయాలనుకుంటున్నారో ముందే ఆలోచించండి. ఉన్న నైపుణ్యాలేమిటీ కొత్తవి ఏవి నేర్చుకుంటే అవకాశాలు పెరగవచ్చు... ఇలా ఆలోచనలను దారి మళ్లిస్తే అర్హతలనూ వాటితోపాటే ఆత్మవిశ్వాసాన్నీ పెంచుకోవచ్చు.
పుస్తకంలో రాయాలి: విద్యుత్ తరంగాలలాంటివి మన మెదడులో నిరంతరం వెలువడుతుంటాయి. గుండెకు ఈసీజీ తీసినట్లు బ్రెయిన్‌కి ఈఈజీ తీస్తే అలలుగా అవి కనపడతాయి. భయపడినప్పుడూ ఒత్తిడికి గురైనప్పుడూ ఈ అలల్లో మార్పు ఉండడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఈ నేపథ్యంలో వాళ్లు చేసిన ఒక ప్రయోగంలో- భయపెడుతున్న ఆలోచనల గురించి వివరంగా కాగితం మీద రాసుకున్నవాళ్లలో ఆ భయం తగ్గినట్లు తెలిసింది. కాబట్టి ఒక పుస్తకం పెట్టుకుని వచ్చిన ఆలోచనలను వచ్చినట్లు దాంట్లో రాసుకుంటూ ఉంటే మనసు బరువు తగ్గుతుంది. అలా రాసే క్రమంలో ఆలోచనల్లో స్పష్టత రావడమే కాదు, ఒక్కోసారి సరైన పరిష్కారమూ తట్టవచ్చు.
సానుకూల దృక్పథం: అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని... అని సినీ కవి ఏనాడో చెప్పినట్లు సానుకూల దృక్పథం అలవాటు చేసుకుంటే అసలు భయం మన దరికే రాదు.
ఇదీ చదవండి: కరోనా మానసిక ఆందోళనను ఇలా జయించండి