మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందా? ఏ చిన్న టెన్షన్ ఎదురైనా, ఎవరితో మాట్లాడినా గోళ్లు తెగ కొరికేస్తున్నారా? మనలో చాలామంది తమకి తెలియకుండానే గోళ్లను నోట్లో పెట్టుకుని కొరికేస్తుంటారు. దేని గురించైనా ఆలోచిస్తున్నప్పుడో లేక ఏదైనా పనిని ఏకాగ్రతగా చేస్తున్నప్పుడో ఇలా ప్రతిదానికి చేతులు ఎప్పుడూ వారి నోట్లోనే ఉంటాయి. ఇలా చేయడం వల్ల గోళ్లలో ఉండే ఎన్నో క్రిములు నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశించి అనేక రోగాలకు కారణం అవుతాయి. ఇది మన బాడీ లాంగ్వేజ్‌ను కూడా మార్చేస్తుంది. ప్రత్యేకించి ఈ కరోనా కాలంలో ఈ అలవాటు అస్సలు మంచిది కాదు.
ఈ క్రమంలో- కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా ఈ అలవాటును దూరం చేసుకోవచ్చు. అవేంటంటే..
- సింపుల్‌గా గోళ్లకు మీకు నచ్చిన నెయిల్ పాలిష్ వేసేసుకోండి. అలా వేసుకోవడం వల్ల గోళ్లు నోట్లో పెట్టుకున్నప్పుడు నెయిల్ పాలిష్‌లో ఉండే రసాయనాలు లోపలికి వెళ్తాయని సాధ్యమైనంత వరకు పెట్టకుండా ఉంటాం. అలాగే నోట్లో పెట్టుకుంటే ఎక్కడ కోటింగ్ పోయి గోళ్ల అందం తగ్గిపోతుందో అని ఆలోచిస్తాం కదా!
- అలాగే గోళ్లను ఎప్పుడూ పొడుగ్గా పెరగనివ్వద్దు. ఎప్పటికప్పుడు చిన్నగా ట్రిమ్ చేసుకుంటే కొరకడానికి కూడా ఎక్కువ అవకాశం ఉండదు. ఏమంటారు?
- పొద్దున్నే లేవగానే నెయిల్ పాలిష్ రిమూవర్‌లో గోళ్లను ముంచి తీయండి. దీని వల్ల గోళ్లు నోట్లో పెట్టుకున్నప్పుడు చేదుగా, వగరుగా ఉంటాయి. ఫలితంగా వెంటనే నోట్లోంచి గోళ్లు బయటకు తీసేస్తాం.
- ఎప్పటికప్పుడు పెడిక్యూర్, మ్యానిక్యూర్ చేయించుకోవడం వల్ల శుభ్రంగా, అందంగా ఉన్న గోళ్లను అలాగే ఉంచడానికి ప్రయత్నిస్తాం. నోట్లో పెట్టుకుని వాటిని పాడుచేసుకోకుండా ఉండాలని ఆలోచిస్తాం.
- అలాగే దగ్గర్లో ఉండే ఫార్మసీల్లో హాని కలిగించని కెమికల్స్ ఉండే లిక్విడ్స్ తీసుకుని ఎప్పటికప్పుడు నెయిల్స్‌కు అప్త్లె చేసుకోవచ్చు. మీతో పాటు ఎప్పుడూ చిన్న బాటిల్‌లో ఈ లిక్విడ్స్‌ని పెట్టుకోవడం మరిచిపోవద్దు.
- వీలున్నంత వరకు చేతులను ఖాళీగా ఉంచకపోవడం మరో ప్రత్యామ్నాయం. అంటే నోట్లో ఎప్పుడూ బబుల్‌గమ్, చూయింగ్ గమ్.. నములుతూ, చేతులతో ఏదో ఒక పని చేస్తూ ఉండటం వల్ల గోళ్లు కొరకడం మీదకు దృష్టి మళ్లకుండా ఉంటుంది.
- ఎన్ని చిట్కాలు ప్రయత్నించినా ఈ అలవాటును మానుకోలేని వారు గోళ్లకు బ్యాండెయిడ్స్ అంటించుకుంటే మీరు కొరుకుదామన్నా అవి దొరికే అవకాశం ఉండదు. అలా క్రమంగా ఈ అలవాటుని మానే అవకాశం ఉంటుంది.
గోళ్లు కొరికే అలవాటుని దూరం చేయడానికి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మరెన్నో ఉన్నాయి. అయితే వీటన్నింటికంటే మనకుండే మానసిక సంకల్పం చాలా గొప్పది. ఇలాంటి అలవాట్లను మార్చుకోవడానికి ముందు మానసికంగా సన్నద్ధమై, మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. అప్పుడే మనం పాటించే ఎలాంటి చిట్కాలైనా వాటిని దూరం చేయడానికి ఉపకరిస్తాయి. ఇక మరీ తప్పదు అనుకుంటే సంబంధిత నిపుణులను సంప్రదించినా తప్పులేదు.
ఇదీ చదవండి: మానసికంగా డిస్టర్బ్ అవుతున్నారా? అయితే ఇలా చేసి చూడండి!