ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మందికి కంటి నిండా కునుకు ఉండటం లేదు. కనీసం 6 గంటల కూడా సరిగా నిద్రపోవడం లేదు. దీనివల్ల పలు శారీరక, మానసిక రుగ్మతలను కొని తెచ్చుకుంటున్నారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 47 శాతం మందిలో తగినంత నిద్ర కరవౌతోందని తాజాగా ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ) అధ్యయనంలో తేలింది. ఇందుకు 38 కారణాలు దోహదం చేస్తుండగా.. చాలామందిని అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా(ఓఎస్‌ఏ) ముప్పు వేధిస్తోందని, దీంతో సంపూర్ణ నిద్రకు దూరమవుతున్నారని తేల్చారు. నిద్రలేమి.. వ్యక్తుల జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు.
ఇటీవల ఏఐజీ ఆధ్వర్యంలో స్లీప్ డిజార్డర్స్‌పై సర్వే నిర్వహించారు. ఇందులో 816 మంది పాల్గొని దాదాపు 28 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, శ్రీలంక తదితర చోట్ల నుంచీ చాలా మంది స్పందించారు. వివరాలను క్రోడీకరించిన ఏఐజీ వైద్యులు.. చాలా మందిలో నిద్రలేమి సమస్య ఉందని తేల్చారు. శుక్రవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్మనాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ విశ్వనాథ్ గెల్లా, ఈఎన్‌టీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ కిషోర్, ఇతర వైద్యులు వివరాలను వెల్లడించారు. నిద్రలేని సమస్య అనేక రుగ్మతలకు కారణమవుతుందని చెప్పారు. ఆకస్మిక గుండెపోటు, పక్షవాతం, మానసిక ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. 11-12% మంది ఓఎస్‌ఏ ముప్పు ముంగిట ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించామన్నారు. గురుకతో చాలామంది నిద్రకుదూరమవుతున్నారన్నారు.
స్లీప్ అప్నియాకు చికిత్స తీసుకోవాలి..
"నిద్రలేమికి ప్రధాన కారణం స్లీప్ అప్నియా. దీనికి చికిత్స తీసుకోకపోతే కొన్నిసార్లు ప్రాణాంతకం అవుతుంది. 40 శాతం హైవే ప్రమాదాలకు నిద్రలేమి కారణం. నిద్రలేకపోతే తర్వాత రోజు తలనొప్పి, రోజంతా అలసట, చికాకు, పనిలో ఏకాగ్రత కోల్పోవడం జరుగుతుంది. ఇతర శారీరక రుగ్మతలకు ఇది కారణమవుతుంది." - -డాక్టర్ విశ్వనాథ్ గెల్లా, డైరెక్టర్, పల్మనాలజీ, ఏఐజీ
ఆటంకం లేని నిద్ర అవసరం..
"పేరుకే నిద్ర పోవడం కాదు. మధ్యలో ఆటంకం లేకుండా నిర్ణీత సమయం పాటు గాఢంగా నిద్ర పోవడం అవసరం. జీవనశైలి మార్పులతో చాలా మంది నిద్రకు దూరమవుతున్నారు. భారతీయుల్లో స్లీప్ అప్నియా సమస్య పెరుగుతోంది. మంచి ఆహారపు అలవాట్లతోపాటు తగినంత వ్యాయామం అవసరం. రోజూ కనీసం 6-8 గంటలపాటు గాఢ నిద్రపోవాలి." -డాక్టర్ శ్రీనివాస్ కిషోర్, డైరెక్టర్, ఈఎన్‌టీ, ఏఐజీ
అధ్యయనంలో వెలువడిన ఆసక్తికర అంశాలు..
- అధ్యయనంలో పాల్గొన్న వారు 816 మంది
- తగినంత నిద్ర ఉండటం లేదన్నవారు 47%
- తరచూ గురక ఇబ్బంది 45%
- వెంటనే నిద్ర పట్టడం లేదన్నవారు 61%
- తరచూ మెలకువ వస్తోందన్న వారు 75%
- తిరిగి నిద్ర పట్టడం లేదని చెప్పిన వారు 21%
- నిద్రలేమితో ఏ ఇబ్బంది ఎందరిలో..
- చిరాకు 34%
- మతిమరుపు 19%
- అలసట 34%
- పనిలో తప్పులు చేయడం 22%
- మరుసటి రోజు మగతగా ఉంటోందన్న వారు 42%
- తరచూ తలనొప్పి ఇబ్బందులు 27%
- డ్రైవింగ్‌లో నిద్ర వస్తుందని చెప్పిన వారు 37%
- పగటి పూట.. కూర్చొని ఉన్నప్పుడూ నిద్ర వస్తోందని చెప్పినవారు 54%
- ఆలోచన చేయలేక పోవడం 27%
ఇదీచూడండి: