హైదరాబాద్ మెహిదీపట్నానికి చెందిన షబానా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. ఆరోగ్య సమస్యల వల్ల యోగా అభ్యసించారు. వివాహానంతరం సౌదీ వెళ్లి... శిక్షకురాలిగా మారారు. వరంగల్‌కు చెందిన గృహిణి శాలినిదీ ఇలాంటి కథే. డాక్టర్ శ్రీలత, డాక్టర్ రాధిక అమెరికాలో వైద్యవృత్తిని నిర్వర్తిస్తూనే కొంత సమయాన్ని యోగా శిక్షణకు కేటాయిస్తున్నారు. ఇలా ఇంకెం దరో.. యోగప్రక్రియ ప్రస్తుత కాలంలో అందరికీ ఆరోగ్యమంత్రంగా మారింది. ఒకప్పుడు పట్టణాల్లో గురువులు సామూహికంగా యోగా శిక్షణ ఇచ్చేవారు. వ్యక్తిగత సమస్యల మేరకు శిక్షణ కోరుకోవడం ఇప్పటి పోకడ. ముఖ్యంగా మహిళలు రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్, అధికబరువు, మానసిక ఒత్తిడి తదితర సమస్యల పరిష్కారానికి యోగాను ఆశ్రయిస్తున్నారు. పదిమందితో కలిసి సాధన చేసేందుకు బిడియపడే స్త్రీలు... తమ ఇబ్బందులను స్వేచ్ఛగా పంచుకునేందుకు మహిళా శిక్షకులనే ఎంచుకుంటున్నారు. ఎక్కువగా ఆన్‌లైన్ ద్వారా సాగే ఈ శిక్షణ ఉభయతారకంగా ఉంటోంది.
మంచి రాబడి
మహిళా శిక్షకులు అటు సామూహికంగాను, ఇటు వ్యక్తిగతంగాను తర్ఫీదు ఇస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ సంస్థలో యోగా శిక్షకురాలి వార్షికాదాయం రూ. 14 లక్షలు. మహిళలకు ఆదాయవనరుగా యోగా మారటం శుభపరిణామమని శిక్షకురాలు కలిదిండి సునీత తెలిపారు. గంటకు రూ.1000-2000 నుంచి... నెలకు లక్షల్లో ఫీజు తీసుకునే శిక్షకులు కూడా ఉన్నారని చెప్పారు. ఏపీ, తెలంగాణల్లోని సుమారు 8 వేల మంది శిక్షకుల్లో మూడో వంతు మహిళలుంటారని అంచనా.
ఆరోగ్యం.. ఆదాయం
15 ఏళ్లుగా శిక్షణ ఇస్తున్నా. సాధకులు తమకు వీలైన సమయంలో ఇంటి వద్దనే శిక్షణ పొందుతున్నారు. వయసుకు తగిన వ్యాయామాలు, ఆహార మార్పులను సూచిస్తుంటాం. శిక్షకులు కేటాయించే సమయానికి తగినట్టుగా ఆదాయం సమకూర్చుకునే వెసులుబాటు ఉంది. కుటుంబాన్ని చూసుకుంటూనే, ఆరోగ్య శిక్షణతో ఆదాయం సంపాదించటం సంతృప్తిగా ఉంటుంది. - ప్రమీల, హైదరాబాద్
వైద్యవృత్తిని వదిలేశా..
వైద్యురాలిగా మంచి ప్రాక్టీసున్నా, అందరికీ ఆరోగ్యాన్ని పంచేందుకు యోగా గొప్పమార్గమనే భావనతో అటు అడుగులు వేశాను. ఇషా యోగాలో చేరాను. సద్గురు జగ్గీ వాసుదేవ్ స్ఫూర్తితో వైద్యవృత్తిని వదిలి యోగా శిక్షణకు అంకితమయ్యాను. గుంటూరు శ్యామలానగర్‌లో యోగాలయం నిర్మించి శిక్షణ ప్రారంభించాం. యోగా అంటే ప్రకృతికి దగరగా జీవించటం.. తనను తాను తెలుసుకుని నడుచుకోవటం. ప్రస్తుతం అన్ని వర్గాల్లోనూ దీనిపై ఆసక్తి పెరిగింది. కొందరు ఇంట్లోనే శిక్షణ పొందుతున్నారు.
- డాక్టర్ శ్రీవిద్య, గుంటూరు
ఐటీ నుంచి యోగా వైపు...
మొదటిసారి మా అక్క గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెకు యోగా ఎంతగా ఉపయోగపడిందో ప్రత్యక్షంగా గమనించా. ఐటీ ఉద్యోగం చేస్తూ శిక్షణ తీసుకున్నా. తరువాత ఉద్యోగం వదిలేసి యోగా శిక్షకురాలిగా పూర్తిసమయం కేటాయిస్తున్నా. నా స్నేహితురాళ్లు కూడా ఒకరిద్దరు యోగా నేర్చుకుని.. పార్ట్‌టైమ్ శిక్షకులుగా మారారు. చాలా మంది ఆన్‌లైన్ ద్వారా నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. - - జె.మౌనిక, ఎల్బీనగర్
యోగా... జీవన విధానం
యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం... వ్యాధులను, ఒత్తిడిని తగ్గించుకునేందుకు మాత్రమే కాదు. సరైన ఆలోచనల దిశగా మనల్ని నడిపించే జీవనవిధానాలు. యువతులు, గృహిణులు యోగాను వృత్తిగా మలచుకోవటం మంచి పరిణామం. మహిళకు ఆరోగ్య స్పృహ ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగానే ఉంటుంది. వ్యక్తిగత యోగాకు డిమాండ్ పెరుగుతోంది. మా నాయనమ్మ సాధమ్మ స్ఫూర్తితో వాలీబాల్ అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణిస్తున్న సమయంలో యోగా శిక్షణ వైపు వచ్చాను. పూర్తిస్థాయి సాధనతో నైపుణ్యం అలవరచుకున్న తరువాతనే శిక్షకులుగా మారాలి. - - అరుణ, అరుణయోగ శిక్షణ సంస్థ
ఇదీచూడండి: MAA elections 2021: 'మా' ఎన్నికల్లో గెలిచి నిలిచేది ఎవరు?