అమ్మమ్మలు, నాన్నమ్మలు అన్నీ మట్టిపాత్రల్లోనే వండేవాళ్లు. స్టీలు సామాన్లొచ్చి వంటింటిని ఆక్రమించేశాయి. చరిత్ర పునరావృతమవుతుంది అన్నట్టు ఇప్పుడు మళ్లీ వీటిల్లో వండేందుకు సిద్ధపడుతున్నారు కొందరు. ఆ లాభాలేంటో మనమూ చూద్దామా!
ప్రకృతిలోంచి వచ్చిన మట్టిలో బి12తో సహా అనేక విటమిన్లు ఉంటాయి. కాయగూరల్లోని పోషకాలేవీ వృథా పోవు. పాత్ర నిండా ఆవిరి పరచుకుని, దానితోనే మగ్గుతుంది కనుక ఆరోగ్యానికి మంచిది. పైగా రుచి కూడా అధికం.
* మట్టిపాత్ర త్వరగా వేడెక్కుతుంది.. పదార్థాలూ త్వరగా ఉడుకుతాయి. వీటిల్లో ఎక్కువ సమయం తీసుకునే కందిపప్పు, దొండ కాయ లాంటివే కాదు మాంసాహారాలు సైతం వేగంగా, రుచిగా వండుకోవచ్చు. సమయం, ఇంధనం కలిసొస్తాయి. ఆహారమూ చాలా సేపు వేడిగా ఉంటుంది కాబట్టి మళ్లీ మళ్లీ వేడి చేయనవసరం లేదు. అందువల్ల పోషకాలు ఆవిరైపోవు.
* ఈ పాత్రల్లో వంటకు నూనె పెద్దగా అవసరం ఉండదు. దీనివల్ల ఒంట్లో కొవ్వు చేరదు. మట్టి పాత్రలు త్వరగా పగిలిపోతాయనే భయం అవసరం లేదు. వీటిని అమర్చే విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలాకాలం మన్నుతాయి.
జాగ్రత్తలు ఇలా...
* ఒకేసారి ఎక్కువ మంటపెడితే పగిలే అవకాశం వుంది. కనుక సెగ నెమ్మది నెమ్మదిగా పెంచాలి.
* వీటిని సబ్బుతో శుభ్రపరిస్తే దాన్ని పీల్చుకుంటాయి. కనుక సున్నిపిండి, వేడినీళ్లతో కడగటం ఉత్తమం.
* అతి శీతలం నుంచి అతి ఉష్ణానికి మారిస్తే వీటికి పగుళ్లు రావచ్చు. కనుక అంత తేడా లేకుండా చూడాలి.
* మట్టి పాత్రలు అనగానే కట్టెల పొయ్యి మీదే వాడాలి కాబోలు అనిపిస్తుంది. కానీ గ్యాస్ పొయ్యి మీద కూడా ఈ పాత్రలతో నిరభ్యంతరంగా వండుకోవచ్చు. అందుకు అనువుగా పట్టుకోవడానికి హ్యాండిల్‌తో సహా వాటిని రూపొందిస్తున్నారు.
ఇదీ చదవండి: Beauty Tips: అమ్మయ్యాక కూడా ఇలా అందంగా మెరిసిపోదాం!