హరియాణాకు చెందిన జప్నా రిషీకౌశిక్ ఫుడ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. బ్రిటానియా, నెస్టే, కోకకోలా లాంటి ప్రముఖ సంస్థలో వివిధ స్థాయుల్లో పనిచేసింది. ఓ రోజు దినపత్రిక చదువుతున్న ఆమెను... మన దేశంలోని చిన్నారుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు పోషకాహారలేమితో బాధపడుతున్నారన్న వార్త ఆలోచనల్లో పడేసింది. దాంతో పిల్లలకు పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో 'హంగ్రీ ఫౌల్' అనే అంకుర సంస్థను స్థాపించింది. భర్త వివేక్ కౌశిక సహకారంతో ఓట్స్, ఎండుద్రాక్ష, బాదం, అటుకుల మిశ్రమంతో పిల్లలకు చిరుతిళ్లను తయారుచేసి సరఫరా చేస్తోంది.
అందరికీ అందుబాటులో
ఎండు ఫలాలు, తృణధాన్యాలతో చిరుతిళ్లను తయారుచేసినా తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. అందుకే ఒక్కో చాక్లెట్ ధర రూ. ఐదు నుంచి పది లోపే ఉంటుంది. దిల్లీలోని చిన్నచిన్న దుకాణాల్లోనూ ఇవి అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. అలాగే దిల్లీకి మాత్రమే పరిమితం కాకుండా ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఇవి లభ్యమయ్యేలా చేస్తోంది.
మార్కెట్లో ఇప్పటికే కొన్ని సంస్థలు తృణధాన్యాలతో చాక్లెట్లను తయారుచేస్తున్నాయి. కానీ వాటి ధర ఎక్కువగా ఉంటోంది. అధిక ధరల వల్ల అవి సామాన్యులకు అందుబాటులో ఉండట్లేదు. వాటికి భిన్నంగా జప్నా రిషీ 'హంగ్రీ ఫౌల్' ద్వారా తక్కువ ధరకే అందిస్తోంది. దాంతో ఇవి అల్పాదాయ వర్గాల వారికీ అందుబాటులో ఉండి వారికీ పోషకాహారాన్ని అందిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా ఉండే స్కూళ్లు, అంగన్వాడీ, కేర్ సెంటర్ల దగ్గర వీటిని విక్రయించే ఏర్పాట్లు చేసింది. అంతేకాదు గర్భిణులు, బాలింతలకు కూడా ఇవి అందుబాటులో ఉండేలా చేస్తుంది.
ఎదిగిందిలా..
జప్నారిషీ సారథ్యంలో నాలుగేళ్లలో ఈ సంస్థ ఎంతో అభివృద్ధిని సాధించింది. మొదట్లో ఏడాదికి రెండు లక్షల రూపాయలున్న సంస్థ ఆదాయం ఇప్పుడు మూడు కోట్లకు చేరుకుంది. 'సంస్థ ఎదుగుదలకు కారణం ఆహారంలో రుచి, పోషకాలు రెండూ ఉండాలి జాగ్రత్తలు తీసుకోవడమే. పోషకాలభరితమైన చిరుతిళ్లను తక్కువ ధరలకు అందించడంతో అవి అందరికీ చేరువయ్యాయి. చిన్నారులు పోషకాహార లేమితో బాధపడకుండా నా వంతుగా ప్రయత్నించడం ఎంతో ఆనందంగా ఉంది. అందుకే మా సంస్థ ద్వారా ఒక్క ఆదాయాన్ని మాత్రమే కాకుండా అంతులేని సంతృప్తినీ అందుకుంటున్నాం' అంటోంది జప్నా.
ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్