ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 1990 నుంచి మూడో వంతు వరకు తగ్గిందని సర్వేలు చెప్తున్నాయి. అయితే 2016లో ఆత్మహత్యలు చేసుకున్నవారిలో 44.2 శాతం భారతీయులు, చైనీయులు ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. బలవన్మరణాలకు పాల్పడే వారిలో స్త్రీల కంటే పురుషులే అధికంగా ఉండటం గమనార్హం.
ప్రతి లక్ష మంది పురుషుల్లో 15.6శాతం మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ సంఖ్య తగ్గి 7 శాతం ఉంది. వయస్సు రీత్యా ఆత్మహత్యల తగ్గింపును గణించినపుడు స్త్రీలలో 49శాతం తగ్గుదల కనిపించగా, పురుషుల్లో 24శాతం మాత్రమే నమోదైంది. అత్యధిక దేశాల్లో స్త్రీలలో ఎక్కువ తగ్గుదల కనిపించింది.
సామాజిక, ఆర్థిక కారణాలతోనే ఎక్కువమంది తమ ప్రాణాలను తీసుకుంటున్నారని వాషింగ్టన్ వర్సిటీ పరిశోధకులు స్పష్టం చేశారు. దేశాలు, వివిధ సమూహాల మధ్య ఈ మరణాల రేటు గణనీయంగా మారుతోందని తెలిపారు. ఉన్నతశ్రేణి వ్యక్తులతో పోలిస్తే పేద, మధ్యతరగతి ప్రజల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉందని వివరించారు.
ఏడాదికి 8 లక్షల బలవన్మరణాలు సంభవిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. 2015-2030 కాలంలో 1/3 వంతు ఆత్మహత్యలను తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్ఓ) లక్ష్యంగా పెట్టుకుంది. అయితే బాధితులను గుర్తించడమే ఎంతో కీలకంగా మారనుంది.
ప్రపంచవ్యాప్తంగా మనుషులు రకరకాల కారణాలతో చనిపోతున్నారు. ఉదాహరణకు ప్రమాదాలు, వైద్యం, జన్యు సంబంధిత వ్యాధులతో ఇలా రకరకాల కారణాలతో మరణిస్తున్నారు. మొదటి పది కారణాలలో ఆత్మహత్య ఒకటిగా ఉంది.