గుమ్మడికాయ డేట్స్ బొబ్బట్లు
కావాల్సినవి
* గుమ్మడికాయ తరుగు - ఒక కప్పు (పైన చెక్కు తీసేసి సన్నగా తరుగుకోవాలి)
* డేట్స్ - 10 (గింజలు తీసి తరిగి పెట్టుకోవాలి)
* రవ్వ - అర కప్పు
* నెయ్యి - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
* చక్కెర - ఒక కప్పు
* యాలకుల పొడి - పావు టీస్పూన్
* మైదా - ఒక కప్పు
* గోధుమపిండి - అర కప్పు
* ఉప్పు - చిటికెడు
* నూనె - రెండు టేబుల్‌స్పూన్లు
* నీళ్లు - పిండి కలపడానికి సరిపడా
తయారీ
ముందుగా ఒక ప్యాన్‌లో నెయ్యి వేసి రవ్వను కాస్త దోరగా వేయించాలి. ఆ తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన గుమ్మడికాయ తరుగును, డేట్స్ తరుగు కూడా వేసి ఐదు నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు దీనిలో చక్కెర, యాలకుల పొడి వేసి చక్కెర కరిగే వరకూ కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని వేరే బౌల్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఆపై దీన్ని స్టఫింగ్ కోసం చిన్న చిన్న బాల్స్‌లా తయారుచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్‌లో మైదా, గోధుమపిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆపై దీన్ని ఓ అరగంట పాటు నాననిచ్చి.. చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. వీటిని పూరీల్లా వత్తుకొని అందులో ఇందాక తయారుచేసి పెట్టుకున్న గుమ్మడి మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని చివర్లు మూసేయాలి. ఇలా తయారైన ముద్దను చేతి మునివేళ్లతో గుండ్రంగా, కాస్త మందంగా వత్తుకోవాలి. ప్యాన్‌పై నూనె వేస్తూ వీటిని రెండువైపులా కాల్చుకుంటే ఎంతో రుచికరంగా ఉండే గుమ్మడికాయ బొబ్బట్లు సిద్ధం.. వీటిని నెయ్యితో వడ్డించుకున్నా లేదంటే ప్లెయిన్‌గా తిన్నా బాగుంటాయి.
ఓట్స్ కొబ్బరి బొబ్బట్లు
కావాల్సినవి
* ఓట్స్ - అరకప్పు
* కొబ్బరి పొడి - అరకప్పు
* బెల్లం - ముప్పావు కప్పు
* యాలకుల పొడి - ఒక టీస్పూన్
* నెయ్యి - కొద్దిగా
* పాలు - పావు కప్పు
* గోధుమపిండి - ఒక కప్పు
* ఉప్పు - చిటికెడు
* నూనె - ఒక టేబుల్‌స్పూన్
తయారీ
ముందుగా ఒక బౌల్‌లో గోధుమపిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆలోపు స్టఫింగ్ కోసం సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ఓట్స్, కొబ్బరిపొడి, యాలకుల పొడి, బెల్లం.. ఈ నాలుగింటినీ మిక్సీలో వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో నెయ్యి వేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి కాసేపు వేయించుకోవాలి. ఆపై ఇందులో పాలు పోసి ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. ఈ మిశ్రమం ఉండలు కట్టుకోవడానికి వీలుగా తయారయ్యేదాకా ఇలా కలుపుకోవాలి. ఆపై దీన్ని దించి చల్లారనిచ్చి స్టఫింగ్ కోసం చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. ఇప్పుడు గోధుమపిండిని పూరీల్లా వత్తుకొని ఈ బాల్స్‌ని వాటిలో స్టఫ్ చేయాలి. ఈ ఉండల్ని చేతి మునివేళ్లతో గుండ్రంగా, కావాల్సిన పరిమాణాల్లో చేసుకొని ప్యాన్‌పై నెయ్యి వేస్తూ ఇరువైపులా కాల్చుకోవాలి. అంతే.. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా ఉండే ఓట్స్ కొబ్బరి బొబ్బట్లు రుచిచూడడానికి రడీ అయిపోయినట్లే..! వీటిని నెయ్యితో లేదంటే హాట్‌గా కావాలనుకుంటే మురుకులతో కూడా సర్వ్ చేసుకోవచ్చు.
డ్రైఫ్రూట్స్ బొబ్బట్లు
కావాల్సినవి
* బాదంపప్పు - అరకప్పు
* జీడిపప్పు - అరకప్పు
* వాల్‌నట్స్ - అరకప్పు
* నువ్వులు - ఒక టేబుల్‌స్పూన్
* గసగసాలు - ఒక టేబుల్‌స్పూన్
* కొబ్బరిపొడి - ఒక కప్పు
* బెల్లం - ఒకటిన్నర కప్పు
* గోధుమపిండి - ఒకటిన్నర కప్పు
* ఉప్పు - చిటికెడు
* నెయ్యి - కొద్దిగా
* నూనె - కొద్దిగా
తయారీ
ముందుగా ఒక బౌల్‌లో గోధుమపిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం తయారుచేసుకోవాలి. ఇందులో భాగంగా ముందుగా డ్రైఫ్రూట్స్‌ని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆపై నువ్వులు, గసగసాల్ని కూడా మిక్సీలో వేసి మెత్తటి పౌడర్‌లా చేసుకోవాలి. ఈ రెండింటినీ కలుపుకోవాలి. ఆ తర్వాత స్టౌపై బౌల్ పెట్టి తురిమిన బెల్లం వేసి కొన్ని నీళ్లు పోయాలి. ఇది పూర్తిగా కరిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందాక తయారుచేసుకున్న పౌడర్ మిశ్రమంలో వేసి ముద్దలాగా కలుపుకోవాలి. వీటిని స్టఫింగ్ కోసం చిన్న చిన్న ఉండల్లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న చపాతీ పిండిని తీసుకొని పూరీల్లా వత్తుకోవాలి. వాటి మధ్యలో డ్రైఫ్రూట్స్ బాల్స్‌ని పెట్టి చివర్లు మూసేయాలి. ఇలా తయారుచేసుకున్న బాల్స్‌ని మునివేళ్లతో చిన్న చిన్న పూరీల సైజులో వత్తుకోవాలి. వీటిని ప్యాన్‌పై నెయ్యి వేస్తూ ఇరువైపులా కాల్చుకుంటే ఎంతో రుచికరంగా ఉండే డ్రైఫ్రూట్స్ బొబ్బట్లు సిద్ధమైన్నట్లే..
రవ్వ కేసరి బొబ్బట్లు
కావాల్సినవి
* రవ్వ - ఒక కప్పు
* చక్కెర - రెండు కప్పులు
* నీళ్లు - ఒక కప్పు
* పాలు - ఒక కప్పు
* జీడిపప్పులు - 10
* బాదంపప్పులు - 5
* కిస్‌మిస్‌లు - 10
* యాలకుల పొడి - ఒక టీస్పూన్
* మైదాపిండి - రెండు కప్పులు
* ఉప్పు - చిటికెడు
* నూనె - ఐదు టీస్పూన్లు
* నెయ్యి - కొద్దిగా
తయారీ
ముందుగా స్టౌ మీద ప్యాన్ పెట్టి రవ్వను దోరగా వేయించుకోవాలి. ఇందులో చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పాలు, కొన్ని నీళ్లు పోసి మిశ్రమం ఉండలు కట్టకుండా చిక్కపడేంత వరకూ కలుపుతుండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి పోసి, యాలకుల పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరో ప్యాన్‌లో కాస్త నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ని దోరగా వేయించుకోవాలి. వీటిని ఇందాక పక్కన పెట్టుకున్న రవ్వ కేసరి మిశ్రమంలో వేసి మరోసారి కలిపి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో మైదాపిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని పావుగంట పాటు పక్కన పెట్టి.. ఆపై చిన్న చిన్న ముద్దలా చేసుకొని పూరీల్లా వత్తుకోవాలి. ఇందులో స్టఫింగ్ కోసం తయారుచేసుకున్న కేసరి మిశ్రమపు ఉండను ఉంచి చివర్లు మూసేయాలి. ఈ ముద్దను గుండ్రంగా పూరీ సైజులో వత్తుకొని ప్యాన్‌పై వేసి నెయ్యితో ఇరువైపులా కాల్చుకుంటే చూడగానే నోరూరించే రవ్వ కేసరి బొబ్బట్లు సిద్ధం.
క్యారట్ కొబ్బరి బొబ్బట్లు
కావాల్సినవి
* తురిమిన క్యారట్ - అరకప్పు
* పచ్చికొబ్బరి తురుము - అరకప్పు
* యాలకుల పొడి - అర టీస్పూన్
* బాదంపప్పు పొడి - మూడు టీస్పూన్లు
* జీడిపప్పు పొడి - మూడు టీస్పూన్లు
* చక్కెర - ఒక కప్పు
* గోధుమపిండి - ఒక కప్పు
* ఉప్పు - చిటికెడు
* నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు
తయారీ
ముందుగా ఒక బౌల్‌లో గోధుమపిండి, ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని ఓ అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌపై ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి కొబ్బరి తురుము, క్యారట్ తురుమును దోరగా వేయించుకోవాలి. ఆపై ఇందులో చక్కెర కూడా వేసి చక్కెర కరిగి, క్యారట్ ఉడికేంత వరకూ సిమ్‌లో కలుపుతూ ఉండాలి. ఆపై యాలకుల పొడి, జీడిపప్పు పొడి, బాదంపప్పు పొడి వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని చల్లారనిచ్చి స్టఫింగ్ కోసం చిన్న చిన్న ఉండల్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని పూరీల్లా వత్తుకోవాలి. అందులో క్యారట్ మిశ్రమాన్ని పెట్టి చివర్లు మూసేయాలి. వీటిని చేతి మునివేళ్లతో గుండ్రంగా, మనకు కావాల్సిన పరిమాణాల్లో వత్తుకొని ప్యాన్‌పై నెయ్యితో ఇరువైపులా కాల్చుకుంటే క్యారట్ కొబ్బరి బొబ్బట్లు రడీ.
ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా!
ఇలా మనం తయారుచేసుకున్న ఈ వెరైటీ బొబ్బట్లు మనకు రుచిని పంచడమే కాదు.. ఆరోగ్యాన్నీ అందిస్తాయి. ఇందుకు వాటిలో మనం వాడిన పదార్థాల్లోని పోషకాలే కారణం.
* ఎన్నో విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉన్న డేట్స్‌లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు రక్తహీనతను నివారిస్తుంది.. మలబద్ధకం సమస్యనూ తగ్గిస్తుంది. అలాగే వీటిలోని క్యాల్షియం ఎముకలు దృఢంగా మారేందుకు దోహదపడుతుంది.
* గుమ్మడికాయలో ఉండే పీచు పదార్థం, పొటాషియం, విటమిన్ సి.. వంటివి శరీరంలో బీపీని అదుపులో ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో, మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో గుమ్మడికి సాటి వేరేదీ లేదంటే అతిశయోక్తి కాదు.
* నెయ్యి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. అలాగే ఇందులోని బ్యుటిరికామ్లం రోగనిరోధక శక్తిని పెంచుతుందని పలు పరిశోధనల్లో తేలింది. అంతేకాదు.. ఆకలి వేయాలన్నా, బరువు తగ్గాలన్నా నెయ్యిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా అవసరం.
* రక్త ప్రసరణ మెరుగవడానికి, నోటి దుర్వాసనను పోగొట్టడానికి, శరీరంలోని మలినాలను బయటికి పంపించేయడానికి, గొంతు సంబంధ ఇబ్బందులను తగ్గించడానికి.. ఇలా పలు సమస్యలను దూరం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో యాలకుల పాత్ర కీలకమే అని చెప్పుకోవచ్చు.
* రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుకోవడానికి ఓట్స్ బాగా తోడ్పడతాయి. అలాగే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి కూడా ఇది మంచి ఆహారం. చిన్నారుల్లో ఆస్తమా, మలబద్ధకం వంటి సమస్యల్నీ దూరం చేస్తుంది.
* కొబ్బరిలోని ల్యూరికామ్లం, బయో యాక్టివ్ సమ్మేళనాలు ఆరోగ్యానికి ఎంతో అవసరం. అలాగే ఇందులో కాపర్, క్యాల్షియం, మాంగనీసు, మెగ్నీషియం, జింక్.. వంటి ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
* శరీరంలోని అనవసర పదార్థాలను తొలగించి కాలేయాన్ని సంరక్షించడంలో బెల్లం పాత్ర కీలకం. ఇది జీర్ణశక్తిని పెంచడంతో పాటు ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు చర్మంలోని ఫ్రీరాడికల్స్‌ని నిర్మూలించి చర్మాన్ని నవయవ్వనంగా మారుస్తాయి.
* డ్రైఫ్రూట్స్‌లో భాగంగా బాదంపప్పులు బరువును అదుపులో ఉంచడంలో, రక్తంలోని చక్కెర స్థాయుల్ని కంట్రోల్ చేయడంలో తోడ్పడతాయి. వాల్‌నట్స్‌లో క్యాన్సర్‌తో పోరాడే గుణాలున్నాయి. అలాగే ఇవి మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. జీడిపప్పులోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు జీవనక్రియల్ని మెరుగుపరచడంలో సహకరిస్తాయి. కిస్‌మిస్‌లు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు శరీరంలో ఐరన్ స్థాయుల్ని పెంచడంలో తోడ్పడతాయి. అలాగే ఎముకల్ని దృఢంగా చేయడంలోనూ ఇవి కీలకపాత్ర పోషిస్తాయి.
* శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి నువ్వుల్ని మించిన ఆహారం వేరే లేదనడంలో సందేహం లేదు. అలాగే ఇవి రక్తహీనతను తగ్గిస్తాయి.. హార్మోన్లను బ్యాలన్స్ చేయడంతో పాటు గుండె ఆరోగ్యాన్నీ సంరక్షిస్తాయి.
* గసగసాలు మహిళల్లో సంతానోత్పత్తిని పెంచడానికి తోడ్పడతాయి. అలాగే జీర్ణశక్తిని పెంచడం, నిద్రలేమిని తరిమికొట్టడం, శరీరానికి తక్షణ శక్తిని అందించడం.. వంటివన్నీ గసగసాల ద్వారా సాధ్యమవుతాయి.
* కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో క్యారట్‌లోని విటమిన్ ఎ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు ఏ అనారోగ్యాన్నైనా ఇట్టే తరిమికొడతాయి. దంత సంరక్షణకు, చర్మ సౌందర్యాన్ని చేకూర్చడానికి కూడా క్యారట్ బాగా ఉపయోగపడుతుంది.