‘అరవయ్యేళ్లు దాటాయి.. ఇక జీవితం ముగిసిపోయింద’నే భావన సరికాదంటున్నారు నిపుణులు. వృద్ధాప్యం శాపం కానే కాదనీ, ‘ఈ వయసులో ఇంకా ఏం చేస్తాంలే’ అని వదిలేయకుండా.. కొత్త సృజనాత్మక అంశాలను నేర్చుకోవడంపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. యువతతో పోల్చితే.. 60 ఏళ్లు దాటిన వ్యక్తులు సంక్లిష్ట సమయాల్లోనూ కచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. వీరిలో మెదడు కుడి, ఎడమ భాగాలను ఒకేసారి వినియోగించుకోగలిగే సామర్థ్యం పెరుగుతుందని చెబుతున్నారు. యుక్తవయస్కులతో పోల్చితే 60 ఏళ్లు దాటిన వారిలో మెదడు ప్రభావశీలతపై ‘వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయన పత్రం ఇటీవల ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమైంది. యువతను, వృద్ధులను వేర్వేరుగా అధ్యయనం చేయగా.. ఒకే రకమైన క్లిష్ట సమస్య పరిష్కారానికి యువత గందరగోళానికి గురవుతుండగా.. 60 ఏళ్లు దాటిన వారు తడబాటు లేకుండా సాఫీగా, వేగంగా పరిష్కరిస్తున్నారని తేలింది. అందుకే వయసు పెరుగుతున్నదనే భావనతో ఎటువంటి ఆందోళనలు వద్దని నిపుణులు చెబుతున్నారు.
అధ్యయనం ఏం చెబుతోంది?
సాధారణంగా మనం కుడిచేతి వాటం వారమైతే మన మెదడు ఎడమ భాగం చురుగ్గా పనిచేస్తుంది. సమీకరణాలను విశ్లేషించి, పరిష్కరిస్తుంది. అదే ఎడమచేతి వాటం వారికి మెదడు కుడి వైపు భాగం బాగా పనిచేస్తుంది. అందరిలోనూ 60 ఏళ్లు దాటాక మెదడు రెండు భాగాల మధ్య సమన్వయం పెరిగి.. మరింత బాగా పని చేస్తుందని అధ్యయనం చెబుతోంది. సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ మెదడులో చురుకుదనం తగ్గుతుంది కానీ కచ్చితత్వం, సృజనాత్మకత మాత్రం పెరుగుతాయి. ఏదైనా అంశాన్ని లోతుగా విశ్లేషించే సామర్థ్యం పెరుగుతుంది. ప్రతికూల భావోద్వేగాలు తక్కువగా ఉంటాయి. కుంగుబాటుకు లోనవడం 60 ఏళ్లు దాటిన వారిలో తక్కువే. మెదడు కుడి, ఎడమ భాగాల మధ్య సమన్వయం 60 ఏళ్ల నుంచి పెరుగుతూ.. పెరుగుతూ 70 ఏళ్లకొచ్చేసరికి గరిష్ఠస్థాయికి చేరుకుంటుందని అధ్యయనం వివరించింది. మనిషి పరిపూర్ణంగా మెదడును వినియోగించుకోగలిగే సామర్థ్యం ఈ వయసులోనే వస్తుందని పేర్కొంది.
సృజన ఎందుకు ఎక్కువంటే..
మెదడులో తెల్ల (వైట్), బూడిద రంగు (గ్రే) పదార్థాలుంటాయి. తెల్ల పదార్థంలో ‘మైలిన్ (కొవ్వు)’ ఉంటుంది. ఇది వయసు పెరుగుతున్న కొద్దీ మరింత పెరుగుతుంది. తద్వారా ఒక అంశానికి, మరో అంశానికి మధ్య సమన్వయం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. మెదడులో న్యూరాన్ల మధ్య అనుసంధానాన్ని ఈ తెల్లపదార్థం మరింత పెంచుతుంది. ఇలా పెరగడం వల్ల 60-70 ఏళ్ల వయసులో మెదడులో సమన్వయ సామర్థ్యం 300 శాతం వరకూ పెరుగుతుందని అధ్యయనం పేర్కొంది. విషయ పరిజ్ఞానం పెరగడం వల్ల ఏ అంశానికి ఎంత సమయం కేటాయించాలనే అవగాహన ఏర్పడుతుందని తెలిపింది.
ఎవరిలో ఈ సామర్థ్యం అధికం?
- ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లున్నవారు
- శారీరకంగా కదలికలు ఎక్కువగా ఉన్నవారు
- కుటుంబం మద్దతు ఎక్కువగా లభించినవారు
- ఆరోగ్య సమస్యలను అదుపులో ఉంచుకున్నవారు
60 ఏళ్లు దాటాక మరింత ఉత్సాహంగా..
ఎవరికైనా బాల్యం నుంచి చూపు లేకపోతే మెదడులో చూపునకు సంబంధించిన భాగం క్రమంగా తగ్గిపోతుంది. మెదడులో ఎక్కువగా వినియోగించుకునే భాగాలకు సంబంధించిన కణాలు బాగా వృద్ధి చెందుతుంటాయి. వయసు పెరిగే కొద్దీ జీవక్రియలు సహజంగానే నెమ్మదిస్తాయి. అంటే నెమ్మదిగా నడుస్తారు. జీర్ణశక్తి తగ్గుతుంది. మెదడు మాత్రం చురుగ్గా పనిచేస్తుంది. ఏ పనైనా ప్రభావవంతంగా చేయగలుగుతారు. అందుకే మన పూర్వీకులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దవారి సలహాలు తీసుకోవాలని చెబుతుంటారు.
- డాక్టర్ హరి రాధాకృష్ణ, సీనియర్ న్యూరాలజిస్ట్, కేర్ ఆసుపత్రి
ఆశావహ దృక్పథంతో జీవించాలి
పెద్దవారిలో విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. సంక్లిష్ట విషయాలను సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. వృద్ధులకు మెదడు పనితీరు బాగుండాలంటే.. కుటుంబ మద్దతు కూడా అవసరం. పెద్దవారిని ప్రోత్సహించాలి. శారీరంగా చురుగ్గా ఉండడం.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం కూడా ప్రధానం. ఈ వయసులో తరచూ స్నేహితులను కలుస్తుండాలి. కొత్త ప్రదేశాలకు, సినిమాలు, షికార్లకు వెళ్తుండాలి. షాపింగ్ చేస్తుండాలి. ఈ వయసులో కూడా భవిష్యత్‌కు కొత్త దారులు వేసుకోవాలి. ఆశావహ దృక్పథంతో జీవించాలి.
- డాక్టర్ శ్రీరంగ లక్ష్మి, న్యూరాలజీ విభాగాధిపతి, ఉస్మానియా ఆసుపత్రి
- ఇదీ చూడండి:
Mla Jaggareddy: రాష్ట్ర కాంగ్రెస్‌లో మళ్లీ మొదలైన ముసలం.. పార్టీని వీడిన జగ్గారెడ్డి