అందరూ వెళ్లే దారిలోనే తనూ వెళితే అందులో తన ప్రత్యేకత ఏముందనుకుంది. అందుకే కాస్త విభిన్నమైన రంగాన్ని ఎంచుకుని విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది సునయనా హర్జాయ్. లండన్ కాలేజీలో ఫ్యాషన్ రిటైల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తిచేసింది. ముప్పై ఏళ్లుగా తండ్రి ఇదే వ్యాపారంలో కొనసాగుతున్నారు.
తండ్రి నుంచి వ్యాపార మెలకువలు నేర్చుకున్న సునయన కొత్త పద్ధతుల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకుంది. తను నేర్చుకున్న అంశాలను జోడించి విభిన్నమైన డిజైన్లలో బూట్లను రూపొందిస్తోంది. వాటిని ఆన్‌లైన్‌లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. నాణ్యమైన లెదర్ బూట్లు అనగానే చాలా ఎక్కువ రేటు ఉంటాయనే అందరూ అనుకుంటారు.
అలాకాకుండా మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ధరకు అందించాలని నిర్ణయించుకుంది. అందుకే తయారీదారు నుంచి నేరుగా వినియోగదారుడికి చేరుకునేలా ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించింది. దీనికి మంచి స్పందన రావడంతో వినూత్నమైన డిజైన్‌లలో బూట్లను తయారుచేయడం మొదలుపెట్టింది. తన పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త బ్రాండ్‌కు రూపకల్పనా చేసింది. లాక్మే ఫ్యాషన్ వీక్, బెంగళూర్ ఫ్యాషన్ వీక్ లాంటి వివిధ ఫ్యాషన్ వేదికల మీద ఈ బూట్లు తళుక్కుమంటున్నాయి.
ఫ్యాషన్ అంటే బూట్లు కూడా...
కొందరు ప్రముఖులు మా బ్రాండ్ బూట్లను ఉపయోగించి సౌకర్యంగా, ఆకర్షణీయంగా ఉన్నాయని ప్రశంసించడం నేనెప్పటికీ మర్చిపోలేను. లండన్‌లో లభించే కొన్ని రకాల డిజైన్లు మా దగ్గర కూడా అందుబాటులో ఉన్నాయి. నాణ్యమైన లెదర్‌బూట్లను అందుబాటు ధరకు అందించడమే నా లక్ష్యం.
వినియోగదారుడు కోరిన వివిధ రంగుల్లోనూ బూట్లను తయారుచేస్తుంటాం. కొందరు దుస్తుల రంగుకు మ్యాచయ్యేలా షూస్ తయారుచేసి ఇవ్వమని అడుగుతుంటారు. మారుతున్న ఫ్యాషన్లకు అనుగుణంగా ఇప్పుడు రంగురంగుల బూట్లు తయారుచేయమని కోరుతున్నారు. ఫ్యాషన్ అనగానే అందరూ దుస్తుల గురించి మాత్రమే ఆలోచిస్తారు. నేను మాత్రం షూస్ గురించే ఆలోచిస్తాను.’ అంటుంది సునయన.
ఇదీ చూడండి:అసోం గజగజ.. వరదలకు 89 మంది మృతి