టాటూ కళలో వైవిధ్యమైన రూపాలతో జనాల్ని ఆకర్షిస్తోంది ఈ యువ హైదరాబాదీ. స్టైలిష్ బొమ్మలతో పాటు సందేశాత్మక చిత్రాలు గీస్తోంది. ఈ రంగంలో పురుషులదే ఆధిపత్యం అనే ముద్ర చెరిపివేస్తూ... హైదరాబాద్‌లో పియర్సింగ్ టాటూలు వేసే ఏకైక ఆర్టిస్ట్‌గా నిలుస్తోంది కుసుమ కుమారి.
ఇంట్లో వారించి..
హైదరాబాద్‌కు చెందిన కుసుమ కుమారి... విద్యావంతుల కుటుంబంలో జన్మించింది. ఇంకేముంది.. ఇంట్లోవారు కుసుమ డాక్టర్ లేదా ఇంజినీర్ అవ్వాలని పట్టుపట్టేవారు. తనేమో కళా రంగాల వైపు వెళ్లాలని కోరుకునేది. అందుకోసం ఇంట్లో వాళ్లతో వాదించి మరీ, మల్టీమీడియాలో శిక్షణ తీసుకుంది. ఆ క్రమంలోనే కుమారి టూటూలపై ఆసక్తి పెంచుకుంది. మెుదట యూట్యూబ్ వీడియోలతో ఓనమాలు నేర్చుకుంది. మెరుగైన శిక్షణకు ఉన్న మార్గాల్ని వెతుకుతున్న తరణంలో ముంబయికి చెందిన ప్రముఖ టాటూ కళాకారుడితో పరిచయం ఏర్పడింది. అతడి నేతృత్వంలోనే వైవిధ్యమైన పచ్చబొట్లు వేయడంలో శిక్షణ తీసుకుంది.
అవగాహన లేక..
సాధారణంగా టాటూలంటే యువతకు ఎంతో ఆసక్తి. కానీ, సరైన అవగాహన లేక చర్మ సమస్యలు తెచ్చుకుంటారు. అలా కాకుండా, ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్ట్‌లను సంప్రదిస్తే... తక్కువ ధరల్లోనే ఆరోగ్యకరమైన పచ్చబొట్లు వేసుకోవచ్చని చెబుతోంది...కుమారి. ఈ కళలో పియర్సింగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కష్టతరమైన ఈ పచ్చబొట్లని అలవోకగా వేస్తూ మంచి పేరు సంపాదించుకుంది కుసుమకుమారి. హైదరాబాద్ వ్యాప్తంగా ఇలాంటి టాటూలు వేస్తున్న ఏకైక ఆర్టిస్ట్ ఆమెనే.
నాణ్యతే ముఖ్యం..
పచ్చబొట్లు వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనేక సమస్యలు కాబట్టి, ఒకరికి ఉపయోగించిన వస్తువుల్ని మరొకరికి ఉపయోగించమంటోంది...కుమారి. నాణ్యతలేని పని చేయడం లాభాలు వస్తాయోమో కానీ, మంచి పేరు రాదంటోంది. పచ్చబొట్టు అనేది ఒక్కసారి వేస్తే జీవితాంతం చెరిగిపోకుండా ఉంటుంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ఆలోచనలు, భావాలకు తగ్గట్లు రూపాలు తీర్చిదిద్దడానికి కుమారి ఎంతో కష్టపడుతోంది. నచ్చినరంగంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. వెన్నుచూపకుండా ముందుకు సాగితే విజయం తప్పకుండా వరిస్తుందనడానికి కుసుమ కుమారే నిదర్శనం.
ఇదీ చూడండి: పిల్లలను ఇలా ‘హెల్దీ’గా మార్చేద్దాం!