నీళ్లు సరిగ్గా తాగట్లేదా?!
మన శరీరంలోని సెబేషియస్ గ్రంథులు సీబమ్ అనే మైనపు పదార్థాన్ని విడుదల చేస్తాయి. ఫలితంగా చర్మం హైడ్రేటెడ్‌గా, తేమగా ఉంటుంది. అయితే అది మరింత ఎక్కువగా ఉత్పత్తయితే మాత్రం చర్మం మరింత జిడ్డుగా మారుతుందంటున్నారు నిపుణులు. మనం సరైన మొత్తంలో నీళ్లు తాగకపోయినా సీబమ్ అధికంగా విడుదలవుతుందట! అదెలాగంటే.. మన శరీరానికి సరిపడా నీరు అందనప్పుడు శరీరం తగిన నీటి స్థాయుల కోసం సెబేషియస్ గ్రంథులపై ఆధారపడుతుంది. తద్వారా అవసరానికి మించి సీబమ్ ఉత్పత్తవుతుంది. ఇది జిడ్డు చర్మాన్ని మరింత జిడ్డుగా మార్చుతుంది. కాబట్టి ఇలా జరగకూడదంటే ఎవరికి వారు బరువును బట్టి సరిపడా మోతాదులో నీళ్లు తాగడం చాలా ముఖ్యం. అయితే ఎన్ని నీళ్లు తాగాలన్నది తెలుసుకోవడానికి మీ బరువును 30 తో భాగించి తెలుసుకోవచ్చు.. (ఉదాహరణకు.. మీ బరువు 60 కిలోలైతే.. 60/30=2.. అంటే రోజుకు రెండు లీటర్లు తాగాలన్నమాట!) లేదంటే సంబంధిత నిపుణుల సలహా కూడా తీసుకోవచ్చు.
ఈ నూనెల వల్లే..!
అందంలో అత్యవసర నూనెల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే కొన్ని ఎసెన్షియల్ నూనెలు జిడ్డు చర్మాన్ని బ్యాలన్స్ చేసి.. మొటిమలు, అలర్జీ.. వంటి ఇతర సౌందర్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తే.. మరికొన్ని నూనెలు మాత్రం ఈ జిడ్డుదనాన్ని మరింతగా పెంచుతాయంటున్నారు నిపుణులు. కొబ్బరి నూనె కూడా ఈ రెండో కోవకు చెందుతుందట! అందుకే ఈ సమస్య ఉన్న వారు రోజువారీ పాటించే సౌందర్య చికిత్సల్లో కొబ్బరి నూనెను ఉపయోగించకపోవడమే మంచిదంటున్నారు. అలాగే దీన్ని జుట్టుకు పట్టించినా.. జుట్టు కూడా మరింత జిడ్డుగా మారుతుంది. కాబట్టి జిడ్డు సమస్య మరీ ఎక్కువగా ఉన్న వారు మాత్రం కొబ్బరికి బదులుగా రోజ్‌మేరీ, జెరానియం.. వంటి అత్యవసర నూనెల్ని ఉపయోగిస్తే.. సీబమ్ ఉత్పత్తి అదుపులో ఉంటుంది. ఫలితంగా చర్మం మరింత జిడ్డుగా మారకుండా జాగ్రత్తపడచ్చు.
మాయిశ్చరైజర్ ఇలా!
జిడ్డు చర్మతత్వం ఉన్న వారు మాయిశ్చరైజర్ రాసుకుంటే చర్మం మరింత జిడ్డుగా మారుతుందని దాన్ని ఉపయోగించడమే మానేస్తుంటారు. కానీ ఇది కూడా చర్మం మరింత జిడ్డుగా మారేందుకు దోహదం చేస్తుందట! అలాగే ఒక చర్మతత్వం ఉన్న వారు మరో చర్మతత్వానికి సంబంధించిన మాయిశ్చరైజర్ రాసుకున్నా ఈ సమస్య తలెత్తుతుందంటున్నారు నిపుణులు. అందుకే చర్మతత్వాన్ని బట్టి సరైన మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవడమనేది చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే వేర్వేరు చర్మతత్వాలకు అనుగుణంగా ప్రత్యేకమైన మాయిశ్చరైజర్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దాన్ని బట్టి మాయిశ్చరైజర్ కొనుగోలు చేయడం లేదంటే ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం.. వంటివి చేయచ్చు.
మేకప్ ఎక్కువైనా..!
కొంతమందికి వృత్తిలో భాగంగా మేకప్ వేసుకోక తప్పదు. మరికొంతమందికి రోజూ మేకప్‌తో తమ అందానికి మెరుగులు దిద్దుకోవడం ఒక అలవాటు. ఈ క్రమంలో కొంతమంది మరీ ఎక్కువగా మేకప్ వేసేసుకుంటుంటారు. జిడ్డు చర్మతత్వం గల వారు ఇలా అధిక మొత్తంలో మేకప్ వేసుకున్నా చర్మం మరింత జిడ్డుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదెలాగంటే మేకప్ వేసుకునే క్రమంలో చర్మ రంధ్రాలు మూసుకుపోవడంతో పాటు ఎక్కువ మొత్తంలో నూనెలు విడుదలవుతాయట! తద్వారా చర్మం మరింత జిడ్డుగా మారుతుందంటున్నారు. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే మేకప్ తక్కువగా వేసుకోవడం, నాన్-కమెడోజెనిక్ మేకప్ ఉత్పత్తులు (ఈ ఉత్పత్తులు చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా, ఎక్కువ నూనెలు విడుదలవకుండా చేస్తాయి) వాడడం వల్ల చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు.
ఇవి కూడా కారణమే!
* పదే పదే ముఖం కడుక్కుంటే జిడ్డు తగ్గుతుందనుకుంటాం.. కానీ ఈ అలవాటు చర్మంపై జిడ్డుదనాన్ని మరింత పెంచుతుందట! అందుకే వర్కవుట్ తర్వాత, ఎటైనా బయటికి వెళ్లొచ్చినప్పుడు.. వంటి సందర్భాల్లో తప్ప నీడపట్టునే ఉంటే పదే పదే ముఖం శుభ్రపరచుకోనక్కర్లేదంటున్నారు నిపుణులు.
* నూనె సంబంధిత పదార్థాలు, కొవ్వులు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్.. తినడానికి రుచిగానే ఉంటాయి. కానీ అవి చర్మాన్ని మరింత జిడ్డుగా మార్చుతాయి. కాబట్టి వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిదట!
* పీసీఓఎస్‌తో బాధపడే వారిలో ఆండ్రోజెన్ హార్మోన్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతుంటాయి. ఇక దీనికి తోడు మనం ఒత్తిడికి గురైనప్పుడు విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్ ఆండ్రోజెన్స్‌తో కలిసి ఎక్కువ మొత్తంలో నూనెల్ని విడుదల చేస్తుంది. తద్వారా చర్మం జిడ్డుగా మారుతుంది. అందుకే ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి యోగా, వ్యాయామం, ధ్యానం.. వంటివి మంచివని సలహా ఇస్తున్నారు నిపుణులు.
* మృత చర్మాన్ని తొలగించుకోవడానికి స్క్రబ్ చేసుకోవడం మనకు అలవాటే! అయితే ఈ ప్రక్రియను మరీ మితిమీరి చేయడం వల్ల కూడా చర్మం నుంచి ఎక్కువ మొత్తంలో నూనెలు విడుదలవుతాయట! అందుకే వారానికోసారి స్క్రబింగ్ సరిపోతుందంటున్నారు నిపుణులు.
ఇలా చేసి చూడండి!
ఈ కాలంలో మరీ జిడ్డు చర్మంతో బాధపడుతున్న వారు ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే ఫలితం ఉంటుంది.
* ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి చల్లటి నీటికి బదులుగా గోరువెచ్చటి నీటిని వాడితే జిడ్డు త్వరగా తొలగిపోతుంది.
* సెలిసిలికామ్లం, సిట్రికామ్లం, గ్లైకోలికామ్లం.. వంటి పదార్థాలతో తయారైన జెల్ ఆధారిత క్లెన్సర్‌ను ఉపయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
* నుదురు, ముక్కు.. వంటి భాగాల్లో పేరుకున్న జిడ్డును తొలగించుకోవడానికి చక్కటి టోనర్‌ను ఉపయోగించడం మంచిది. తద్వారా ఇందులోని యాస్ట్రింజెంట్ గుణాలు అధిక జిడ్డును తొలగించడంతో పాటు చర్మానికి చల్లదనాన్ని సైతం అందిస్తాయి.
* జిడ్డు చర్మంతో బాధపడే వారు ఈ వేసవిలో తీసుకునే ఆహారం విషయంలో కూడా పలు జాగ్రత్తలు పాటించాలి. ఈ క్రమంలో విటమిన్ ‘ఎ’ అధికంగా ఉండే చిలగడ దుంప, క్యారట్, ఆకుకూరలతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, తర్బూజా.. వంటి పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం.
ఇక వీటితో పాటు ఓట్‌మీల్-కలబంద స్క్రబ్, పాలు-ఓట్‌మీల్ కలిపి తయారుచేసిన స్క్రబ్.. వంటివి ఉపయోగిస్తే జిడ్డు చర్మం సమస్యకు చాలా వరకు పరిష్కారం దొరుకుతుంది. ఇంకా ఈ సమస్య గురించి మీకున్న సందేహాలకు నిపుణుల సలహాలు సైతం తీసుకోవచ్చు.
ఇదీ చదవండి: చెన్నై సూపర్‌కింగ్స్ ప్రధాన లోపం అదే: ఆకాశ్ చోప్రా