ఇల్లాలి చదువు.. ఇంటికి వెలుగు అని ఆమె నమ్మింది. క్షణం తీరిక లేకుండా పనులతో గడిపే గృహిణులు తమ కోసం కాస్త సమయం కేటాయించుకుని చదువుకోవాలని భావించింది. పడతి ప్రగతి దేశానికి ముఖ్యమని గట్టిగా అనుకుంది. వారి కోసం ఇంటింటికి తిరుగుతూ పుస్తకాలు, నవలలూ అందిస్తోంది. ఆమే వయనాడ్‌కు చెందిన రాధామణి.
కేరళ కొట్టాయంకు చెందిన రాధామణి 1979లో వాయనాడ్‌కి వచ్చారు. 2012 నుంచి ఆమె ఈ పనిని చేస్తూనే ఉన్నారు. మహిళల్లో చదివే అలవాటును అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ‘వనితా వయన పద్ధతి’ క్యాంపెయిన్ కింద కేరళ రాష్ట్ర విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సాధారణంగా స్థానిక గ్రంథాలయంలో ఏడాదికి 25 రూపాయలు లేదా నెలకు ఐదు రూపాయలు చొప్పున చెల్లించి సభ్యత్వం తీసుకోవచ్చు. ఒకవేళ అలా కూడా తీసుకోలేని వారి కోసం తనే పుస్తకాలను సేకరించి వారి ఇంటికే వెళ్లి ఇస్తోందామె. ‘రోజూ నా సంచిలో 20 నుంచి 25 మలయాళ పుస్తకాలను తీసుకువెళతా. ఇందులో చాలామటుకు నవలలు, పోటీపరీక్షల మెటీరియల్, చిన్నారులకిష్టమైన కథల పుస్తకాలు ఉంటాయి’ అని చెబుతారామె.

పదో తరగతి వరకు చదివిన ఆమెకు పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం. కేవలం లైబ్రేరియన్‌గానే కాకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే ప్రాజెక్ట్‌లోనూ చురుగ్గా పాలు పంచుకుంటారు. ఆమె భర్త పద్మనాభన్ నంబియన్ ఓ చిన్న కిరాణ కొట్టు నడుపుతారు. కొడుకు ఆటో డ్రైవరు. ‘ఇంట్లో ఉండే మహిళలకు పుస్తకాలను అందిస్తే వారు చదువుకుని ముందుకు వెళ్లగలుగుతారు. అలాగే నేనిలా ఇంటింటికీ తిరిగి పుస్తకాలను పంచడం వల్ల చాలామంది మహిళలకు లాభం చేకూరింది. చాలామంది వీటిని ఉపయోగించుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఎంతోమంది అమ్మాయిలు ఉద్యోగాలనూ తెచ్చుకున్నారు. ఈ విషయాలు నాకెంతో సంతోషాన్నీ,సంతృప్తినిస్తున్నాయి’ అంటారామె.
ఇంటి పనులతో తీరిక లేకుండా ఉండే గృహిణులకు పుస్తకాలు చదవడం అలవాటు చేయాలనేది ఆమె ఆలోచన. ఎందుకంటే ఇల్లాలు చదుకుంటేనే ఇంటికి వెలుగొస్తుందని ఆమె నమ్మకం.
- ఇదీ చదవండి : 300 రూపాయలతో బయటకొచ్చి...30 కోట్ల టర్నోవర్ చేశా!