కృత్రిమఅవయవంతో అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలివ్యక్తిగా, అతిచిన్న అమెరికా యువతిగా చరిత్రలో నిలిచిపోనుంది.. 29 ఏళ్ల హేలే ఆర్సెనాక్స్. కేన్సర్‌పై పోరాటంలో విజయం సాధించిన ఈ యువతి...అంతరిక్ష యాత్రకు సన్నద్ధమవుతోంది. అమెరికా వ్యాపారవేత్త, పైలట్ జేర్‌డ్ ఇసాక్‌మ్యాన్ ఈ ఏడాది చివర్లో తొలి ప్రైవేట్ అంతరిక్ష యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సిద్ధం చేస్తున్నారు. 4 సీట్లుండే ఈ స్పేస్ క్రాఫ్ట్‌లో 3 సీట్లు సాధారణ వ్యక్తులకు ఇవ్వగా, 4వ సీటును సెయింట్ జ్యూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఆసుపత్రిలో పనిచేసే హేలేకు కోసం కేటాయించారు.
భవిష్యత్తుపై ఆశను రేకెత్తిస్తూ..
కేన్సర్, లుకేమియా, లింఫోమా వంటి వ్యాధుల బారిన పడిన చిన్నారుల కోసం నిధుల సమీకరణే ముఖ్య ఉద్దేశంగా ఈ యాత్ర సాగనుంది. ఈ క్రమంలో చిన్నతనంలోనే క్యాన్సర్ బారిన పడి, ధైర్యంగా దాన్ని జయించడంతో పాటు.. అదే ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ ఎంతోమంది చిన్నారుల్లో భవిష్యత్తుపై ఆశను రేకెత్తిస్తోన్న హేలే ఈ అంతరిక్ష యానానికి ఎంపికైంది.
ధైర్యంగా ముందుకు వచ్చి..
అంతరిక్షయానం అంటే మాటలు కాదు.. శారీరకంగా, మానసికంగా పూర్తి సన్నద్ధం కావాలి. దాంతో పాటు ఒకవేళ వెళ్తే ఏమవుతుందోనన్న భయమూ ఉంటుంది. ఇలా ఏదైనా అరుదైన సాహసం చేయాలి అనుకుంటే మనకంటే ఎక్కువగా మన ఇంట్లో వాళ్లే భయపడిపోతుంటారు. కానీ తన తల్లిని ఒప్పించి.. ఈ యాత్రకు ధైర్యంగా ముందుకు వచ్చింది.. హేలే.
అందరూ భయపెట్టారు..
లూసియానాలోని సెయింట్ ఫ్రాన్సిస్‌విల్లే అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగింది... హేలే. అందరు పిల్లల్లాగే ఆడుతూ పాడుతూ ఉండేది. తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్ కూడా సాధించింది. ఒకరోజు ఎడమ కాలు బాగా నొప్పి పెట్టడంతో అమ్మతో కలిసి ఆసుపత్రికి వెళ్తే వైద్యులు పరీక్షించి.. కేన్సర్ గడ్డగా నిర్ధారించారు. ఆ మాట తెలియగానే అందరూ భయపెట్టారు. సెయింట్ జ్యూడ్ చిల్డ్రన్ రీసెర్చ్ ఆసుపత్రి వైద్యులు మాత్రం ఇతర శరీర భాగాలకు ఇంకా వ్యాపించలేదు. చికిత్సతో బయటపడొచ్చని ధైర్యం చెప్పారు.
కృతిమ అవయవంతో..
అలా హేలేకు కీమోథెరపీ చికిత్స ప్రారంభించారు. మోకాలికి ఆపరేషన్ చేసి టైటానియం రాడ్ అమర్చా రు. సుదీర్ఘంగా సాగిన చికిత్స... హేలేకు భరించలేని బాధనే కాదు ఎలాంటి ఇబ్బందులైనా అధిగమించే ఆత్మవిశ్వాసం అందించి... దృఢంగా మార్చింది. అప్పుడే తనలా కేన్సర్, ఇతర వ్యాధులతో బాధపడుతోన్న చిన్నారులకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే సెయింట్ జ్యూడ్ ఆస్పత్రి కోసం నిధుల సమీకరణకు నడుం బిగించింది. లూసియానా పబ్లిక్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ నుంచి యంగ్ హీరోస్ అవార్డు అందుకుంది.
మానసికంగా దృఢంగా..
నర్సింగ్ కోర్స్ చేసి జబ్బులతో బాధపడుతోన్న చిన్నారులకు సేవలందించటంపై హేలే దృష్టి సారించింది. ఏడాది కిందటే కోర్సు పూర్తి చేసి ఫిజీషియన్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరింది. కేన్సర్, లుకేమియా, లింఫోమా.. వంటి వ్యాధుల బారిన పడిన చిన్నారులకు సేవ చేయడంతో పాటు వారిని మానసికంగా దృఢంగా మారుస్తోంది. ఇదే సమయంలో అంతరిక్ష యాత్రలో పాల్గొనే అరుదైన అవకాశం దక్కించుకుంది.
ఇదీ చూడండి: ఈ 'కూలింగ్ సాల్ట్' గురించి విన్నారా?