పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్... ఇప్పుడు ఎక్కడ చూసినా అవే. ‘చీపురు కట్ట దగ్గర్నుంచి చింతపండు వరకూ... చెప్పుల నుంచి చెవి పోగుల వరకూ... వంటగదిలో వాడే చెంచాల దగ్గర్నుంచి పూజ గదిలో వాడే సాంబ్రాణి వరకూ... అన్నీ అక్కడ దొరుకుతాయి’ అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఇలాంటి సూపర్ మార్కెట్లకు అసలు పుట్టినిళ్లు ఒకప్పటి మన సంతలే. పాల పీక దగ్గర్నుంచి పశువుల వరకూ అన్నీ దొరికేవి అక్కడ, పైగా చాలా చౌకగా. ఇలాంటి
విషయాలతోపాటు, ఒకప్పటి మన సంప్రదాయాలూ కట్టూ బొట్టూ జీవనవిధానమూ కుల వృత్తులూ పాడి పశువుల పెంపకమూ ఆట పాటలూ ఇళ్ల నిర్మాణం... లాంటివాటిని ఈతరానికి కళ్లకు కట్టినట్లు చూపాలనుకున్నాడు ఓ కళాకారుడు. ఆయనే డాక్టర్ టి.బి సొలబక్కనవర్. అతడి ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే కర్ణాటకలోని హవెరి జిల్లా, గొటగొడి దగ్గర ఉన్న ‘ఉత్సవ్ రాక్‌గార్డెన్(Utsav Rock Garden)’. పేరులోనే ఉత్సవమున్నట్లు ఈ రాక్ గార్డెన్‌లో ఎటు చూసినా పల్లె వాతావరణం సందడి చేస్తుంటుంది.
వెయ్యికి పైగా శిల్పాలు
పల్లెవాతావరణాన్ని తెలియజేసే శిల్పాలతో ఉన్న పార్కులూ(Utsav Rock Garden) మ్యూజియాలూ చాలాచోట్లే ఉన్నాయి. కానీ మొత్తంగా పాతకాలం నాటి ఒక గ్రామాన్నీ గ్రామస్థుల రోజువారీ జీవన విధానాన్నీ వారి వృత్తులతో సహా పూర్తి స్థాయిలో సహజంగా కనిపించేలా తీర్చిదిద్దడమే ఉత్సవ్ రాక్ గార్డెన్ ప్రత్యేకత. ఒకసారి... సొలబక్కనవర్- పడుకున్న ఓ ఆవుని చూసి ముచ్చటపడి, అలాంటి ఆవునే సిమెంటుతో తయారు చేసి దానికి రంగులద్దాడట. అది అచ్చంగా నిజమైన ఆవులానే ఉండడంతో దారినపోయే ఆవులు దాని దగ్గరకొచ్చి ఆగేవట. తాను సృష్టించబోయే గ్రామంలోని మనుషుల్ని చూసినా తోటి మనుషులు అలాగే భ్రమపడాలి అనుకున్నాడాయన. ఆ పట్టుదలతోనే రాళ్లకు ప్రాణం పోశాడు. ఒకప్పుడు గ్రామాల్లో కుమ్మరులు, కమ్మరులు, చేనేతకారులు, స్వర్ణకారులు, దుకాణ దారులు, రజకులు, దర్జీలూ, పశువుల కాపరులు... ఇలా రకరకాల వృత్తులు చేసేవారుండేవారు. ఆయా వ్యక్తులను వారు చేసే పనితో పాటు వారి ఇళ్లూ ఆ చుట్టూ ఉండే వాతావరణంతో సహా ప్రతిదాన్నీ ఉత్సవ్ రాక్ గార్డెన్‌లో ఎంతో సహజంగా తీర్చి
దిద్దారు.
అన్నిటికన్నా ప్రత్యేకంగా కనిపించేది ఇక్కడి సంత. అక్కడ పశువులనూ, రకరకాల దినుసులూ కూరగాయలనూ అమ్ముతున్న వర్తకులనూ వాటిని కొనేందుకు వచ్చిన జనం కనిపించే దృశ్యాలను చూస్తే నిజంగా ఒక్కసారిగా మన అమ్మమ్మలూ తాతయ్యల చిన్న తనంలోకి వెళ్లినట్లే ఉంటుంది. వీటితో పాటు, జ్యోతిష్యుడి ఇంట్లో చిన్నారికి జోతిషం చెప్పించుకుంటున్న తల్లి, చెరువులో గేదెను శుభ్రం చేస్తున్న రైతు, దుకాణంలో సరకులు అమ్మే వర్తకుడు... ఎడ్లబండ్ల మీద ప్రయాణం, పొలంలో పనులు చేస్తున్న రైతులు, గోళీ గుండా, గిల్లీ దండా, ఒప్పుల కుప్ప, కుస్తీపోటీలూ... కర్ణాటకలో ఒకప్పటి గ్రామ పెద్దల ఇళ్లు... ఇలా ఇక్కడి ఒక్కో దృశ్యం ఓ అద్భుతమనే చెప్పాలి. దసనూర్ గ్రూపుకి చెందిన ప్రకాష్ దసనూర్ సహకారంతో సొలబక్కనవర్ సృష్టించిన ఈ గార్డెన్(Utsav Rock Garden)లో ఇలాంటివి వెయ్యికి పైగా శిల్పాలున్నాయట. ఇక్కడున్న ప్రతి శిల్పాన్నీ సిమెంటుతో చేత్తో చేసి, ఆ తర్వాత రంగులద్దడం విశేషం. ఇంకో విషయం ఏంటంటే... ఇంత పెద్ద పార్కులో ఎటుపక్క తిరిగినా పర్యటకులకు ఎండ పొడ తగలకుండా చెట్లు పరుచుకుని ఉంటాయి. ఎండ తగలదు కాబట్టి, శిల్పాలూ ఎప్పుడూ రంగు కోల్పోకుండా ఉంటాయి.
విహారం విజ్ఞానం
ఆరుబయట- పాతకాలం నాటి దృశ్యాలతో ఆకట్టుకునే ఈ పార్కులో ఇండోర్ మ్యూజియంలో ఆధునిక కళాకృతులు దర్శనమిస్తాయి. ఇక్కడ హోటల్‌లో భోజనం చేసేందుకు కూర్చున్న అరబ్ షేకుల్ని చూస్తున్నా ఓ క్షణం వాళ్లు నిజమైన మనుషులేనా అనిపించకమానదు. ఓచోట... కళ్యాణమండపంలో పెళ్లి జరుగుతున్నట్లుంటుంది. తీరా దగ్గరకెళ్లాక ‘ఆ దృశ్యం కూడా సిమెంటుతో జీవం పోసిన శిల్పాలు చేసే మాయే’ అని తెలిసి ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. వీటితో పాటు, కన్నడ నటుడు రాజ్‌కుమార్ సినిమాల్లోని దృశ్యాలను తెలిపే శిల్పాలు, ఎమ్యూజ్‌మెంట్ పార్కు, రకరకాల వాటర్ గేమ్‌లు కూడా ఉంటాయి. రాక్ గార్డెన్(Utsav Rock Garden)లో ఉన్న చిన్న సరస్సులో పర్యటకులు సరదాగా బోటు షికారుకీ వెళ్లొచ్చు. అదండీ సంగతి... అటు విజ్ఞానాన్ని పెంపొందించేలానూ ఇటు అద్భుతమైన కళా సంపత్తిని కళ్లకుకట్టేలానూ ఉన్న ఈ రాక్ గార్డెన్‌ను చూసేందుకు పర్యటకులతో పాటు, పాఠశాలలూ కళాశాలల విద్యార్థులూ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఇక, ఇంత అద్భుతాన్ని సృష్టించిన కళాకారుడు సొలబక్కనవర్‌కీ ఆ అద్భుతానికి వేదికైన ఉత్సవ్ రాక్ గార్డెన్‌కీ ఎన్నో అవార్డులు వచ్చాయంటే ఆశ్చర్యం ఏముందీ..?
- ఇదీ చదవండి : నయా బిజినెస్.. స్పేస్ టూరిజంలో కాసుల వర్షం