రథసప్తమి అనేది కాలానుగుణంగా జరిగే మార్పుని కూడా సూచిస్తుంది. ఎముకలు కొరికే చలికాలం నుంచి వెచ్చవెచ్చని వేసవికి ఆహ్వానం పలుకుతుంది. అంటే వసంత రుతువుకి స్వాగతం పలకడమే కాకుండా పంట కోతలను కూడా ప్రారంభించడానికి ఇది చాలా అనువైన సమయం. రథసప్తమి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి పుణ్యస్నానం ఆచరిస్తారు. అయితే ఇలా స్నానం చేసే ముందు జిల్లేడు ఆకులు ఏడు తీసుకొని ఒకటి తల మీద, రెండు భుజాల మీద, రెండు మోకాళ్ల మీద మరో రెండు పాదాల మీద పెట్టుకొని తలస్నానం చేస్తారు. స్నానం చేసే సమయంలో-
'సప్త సప్త మహా సప్త
సప్త ద్వీప వసుంధర
సప్త అర్క పర్ణ మదయా
సప్తమ్యం స్నానమాచరేత్||' అనే శ్లోకాన్ని విధిగా పఠించాలి. ఇలా చేస్తే ఆ ఏడాదంతా చేపట్టిన ప్రతి పని విజయవంతంగా ముగుస్తుందన్నది భక్తుల నమ్మకం.
![sunssbdder650-2.jpg](http://www.vasundhara.net/articleimages/sunssbdder650-2.jpg)
పూజా ఏర్పాట్లు..
స్నానానంతరం రథం లేదా రథం మీద సూర్యుడు ఉన్నట్లు ముగ్గులు వేసి రంగులతో అందంగా తీర్చిదిద్దుతారు. అలాగే పూజ కోసం పళ్లు, ఫలహారాలు.. వంటివన్నీ సిద్ధం చేస్తారు. ఈలోపు సూర్యోదయం అయిపోతుంది. అప్పుడు ఆ నునువెచ్చని ఎండలోనే పూజ చేయడం ప్రారంభిస్తారు. పూలు, పండ్లతో సూర్యభగవానున్ని ఆరాధిస్తూ ఆవు పిడకలతో ఏర్పాటు చేసిన పొయ్యి మీద ఆవుపాలతో పాయసాన్ని తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విధంగా నైవేద్యం సిద్ధం చేసే క్రమంలో పాలను మూడుసార్లు పొంగిస్తారు. అలాగే ఈ పూజలో ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య సహస్రనామం.. వంటి శ్లోకాలను భక్తి, శ్రద్ధలతో చదువుతారు.
![sunssbdder650-3.jpg](http://www.vasundhara.net/articleimages/sunssbdder650-3.jpg)
దేవాలయాల్లోనూ..
రథసప్తమి సందర్భంగా కేవలం ఇళ్లలోనే కాకుండా ప్రసిద్ధి చెందిన సూర్యభగవానుడి పుణ్యక్షేత్రాలన్నిట్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఒడిశాలోని కోణార్క్ దేవాలయం, ఆంధ్రప్రదేశ్‌లోని అరసవెల్లి.. వంటి సుప్రసిద్ధ సూర్యదేవాలయాల్లో అయితే ఈ వేడుకలు మరింత ఘనంగా, కోలాహలంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా ఈ పర్వదినాన తిరుపతిలో కూడా శ్రీవారికి బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. శ్రీదేవి, భూదేవి సహితంగా శ్రీవారిని తిరుమాడ వీధుల్లో వూరేగిస్తారు.
![sunssbdder650-5.jpg](https://www.vasundhara.net/articleimages/sunssbdder650-5.jpg)
ఆరోగ్యపరంగా ప్రయోజనాలెన్నో..
ఈ పూజ పూర్తవడానికి దాదాపు గంట లేదా గంటన్నర సమయం పడుతుంది. అంతసేపు ఎండలో ఉండటం వల్ల మన శరీరానికి కావాల్సిన 'డి' విటమిన్ అందడమే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు దరి చేరవు. అలాగే స్నానం చేసే సమయంలో ఉపయోగించే జిల్లేడు ఆకులు కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వాటిని ఉపయోగించడం వల్ల చర్మానికి సంబంధించిన ఏ విధమైన వ్యాధులు, సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటాయి. అందుకే చర్మ సమస్యలకు చికిత్స చేసేటప్పుడు ఉపయోగించే ఔషధాలలో కూడా వీటిని వినియోగిస్తారు. అయితే వీటి నుంచి వచ్చే పాలు కళ్లలో పడకుండా జాగ్రత్తపడాలి. వీటితో పాటు రథసప్తమికి సూర్యభగవానుడికి సమర్పించే పండ్లలో రేగుపండ్లు ప్రధానమైనవి. వాటి వల్ల మనకు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే రథసప్తమి పూజ వల్ల మహిళలకు కలిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాల లిస్ట్ పెద్దదే అవుతుందండోయ్..!
ఇదీ చూడండి: సౌండెక్కువైతే చివరికి అసలు సౌండే వినలేం..!