![](https://assets.eenadu.net/article_img/9VASU2a.jpg)
విజయనగరం కొత్తవలస శ్రీరమ్య, శ్రీలిఖిత(Twin sisters) వాళ్లది. నాన్న పప్పు అప్పలరాజు చిరుద్యోగి, అమ్మ భాగ్యలక్ష్మి గృహిణి. ఇప్పుడు ఈ కవలలు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి ఇంటిగ్రేటెడ్ ఫుడ్ టెక్నాలజీలో ఎంఎస్‌సీ చివరి సంవత్సరం చదువుతున్నారు. చిన్నప్పటి నుంచీ చదువుతోపాటు ఇతర విభాగాల్లోనూ రాణించాలనుకున్నారు. దీనికి అమ్మానాన్నల ప్రోత్సాహం తోడైంది. అలా క్రీడలు, కళల్లోకి ప్రవేశించారు. 7వ తరగతిలో కరాటే శిక్షణలో చేరారు. ఆరెంజ్, గ్రీన్ బెల్టులు సాధించారు. క్రమంగా వేరే రంగాల్లోకీ వెళ్లాలన్న ఆసక్తి కలిగింది. భరతనాట్యం, కూచిపూడిల్లో శిక్షణ తీసుకున్నారు. కళాశాల స్థాయిలో యోగాపై దృష్టి మళ్లింది. చిన్నచిన్న ఆసనాలతో మెదలుపెట్టి కఠినమైనవి వేసే స్థాయికి చేరారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటాలనే లక్ష్యంతో పీజీ చేస్తూనే మహిళా వర్సిటీలో యోగాలో డిప్లొమానీ పూర్తి చేశారు.
![](https://assets.eenadu.net/article_img/9VASU2b.jpg)
దేనిలోనైనా ఒకరు నెమ్మదించినా మరొకరు చేయూతనిచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా కరాటేలో బ్లాక్ బెల్ట్‌నూ సాధించారు. లాక్‌డౌన్‌లో కర్రసాము, కత్తిసాముల్లో శిక్షణ తీసుకున్నారు. ఎన్‌సీసీ సభ్యులు కూడా. దీనిలో సి సర్టిఫికెట్ ఉంది. సంప్రదాయ నృత్య ప్రదర్శనలూ ఇస్తున్నారు. విశ్వవిద్యాలయం తరఫున జానపద నృత్య పోటీల్లో పాల్గొని జోన్, జాతీయ స్థాయిల్లో ద్వితీయ స్థానం పొందారు. అంతర్జాతీయ పోటీకి కురుక్షేత్రకు వెళ్లారు. అక్కడ దక్షిణాసియా నుంచి 9 దేశాల వర్సిటీలు పోటీ పడితే వీరిది ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. కరాటే, యోగా, నృత్య విభాగాల్లో పలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో మూడు, రాష్ట్ర స్థాయిలో 20కిపైగా పతకాలను గెలుచుకున్నారు.
పోటీలు, కార్యక్రమాలు ఉన్నా లేకపోయినా... కరాటే, నృత్యం, యోగా... వీటి సాధన ఏ రోజూ ఆపరు. ఉదయం, సాయంత్రం రోజూ అన్ని అంశాల్లోనూ సాధన చేస్తుంటారు. ఆసక్తి, పట్టుదల, ప్రణాళికబద్ధ సాధన ఉంటే ఏకకాలంలో వేర్వేరు రంగాల్లో కూడా విజయాలు సాధించవచ్చని అంటున్నారీ అక్కాచెల్లెళ్లు. భవిష్యత్తులో ఏ ఉద్యోగంలో ఉన్నా వీటిని కొనసాగిస్తామంటున్నారు. అంతేకాదు... ఆసక్తి ఉన్న వారికి తర్ఫీదునిచ్చే ఆలోచనా ఉందట.
- ఇదీ చదవండి : తోడు లేకుండానే పెరుగు తయారు చేసుకోండిలా..!