కార్తిక పౌర్ణమి(karthika pournami 2021) రోజునే సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్(guru nanak dev jayanti 2021) జన్మించారు. జైనులు ఇదే రోజున ఆదినాథ ప్రభువు దర్శనం కోసం వెళతారు. ఈ మాసం హిందువులకు చాలా పవిత్రమైనది. దీపావళి ఈ మాసంలోనే వస్తుంది. శరీర శక్తిని పెంచుకునేందుకు ఈ మాసంలో ఉపోషాలు చేస్తారు. వివాహాలు చెయ్యరు. కార్తిక మాసం(karthika masam 2021) శివ, విష్ణువులిద్దరికీ ప్రీతికరమైంది. కాబట్టి ఇద్దరినీ సేవిస్తారు. కార్తిక పూర్ణిమ(karthika pournami 2021)నే త్రిపురి లేక త్రిపురారి పూర్ణిమ అంటారు. దీన్ని దేవ దీపావళి అనీ అంటారు.
శక్తి కలిగిన భక్తులు ఉపవాస దీక్ష చేస్తారు. లేనివారు చంద్రదర్శనం తరవాత, పూజలు చేసి, భోజనం చేస్తారు. దీనినే పూర్ణిమ వ్రతం అంటారు. కార్తిక పూర్ణిమ రోజున తులసీ వివాహం చేస్తారు. ఈ రోజున ఉల్లిపాయలు తినరు. పళ్లు, పాలు, తేలిక సాత్విక ఆహారాలే తీసుకుంటారు. స్త్రీలు తమ సోదరుల క్షేమం, అభివృద్ధి ఆకాంక్షిస్తూ పూజలు చేస్తారు. కేరళ, తమిళనాడు, శ్రీలంకల్లో పూజలు భగవతి అనుగ్రహం కోసం చేస్తారు.
హైందవ సంప్రదాయంలోని వార్షిక ఉత్సవాలన్నీ భక్తులకు భగవంతుడి అనుగ్రహానికి అర్హతలు కలిగిస్తాయి. అజ్ఞానమనే తిమిరానికి జ్ఞానం అనే జ్యోతి వెలుగులిచ్చి మనసులను ఆనందమయం చేస్తుంది. కార్తిక మాసంలో దీపాల పండుగ జరపడం శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రమని చెబుతారు. భక్తులందరూ పరమాత్మకు దీపాలతో పూజలు చేయడం కార్తిక మాస ప్రత్యేకత. కార్తికమాసాన్ని పురుషోత్తమ మాసం అనీ అంటారు. శివకేశవులనిద్దరినీ ఆరాధించడం ఈ మాసంలోని ప్రత్యేకత. ఇద్దరూ కలిసి ఉండటం ఈ మాసంలో జరుగుతుంది. ఈ మాసంలో నిత్యమూ విష్ణు సహస్రనామ పారాయణం శివప్రీతిగా సోమవారాలు, కార్తిక ఏకాదశి, కార్తికపౌర్ణమి రోజుల్లో, ఉపవాసంతోపాటు దీపారాధనలు చేస్తారు.
దీపారాధన ద్వారా మనలోని అజ్ఞానం, అహంకారం, ఆగ్రహం, స్వార్థం, అసూయ, ద్వేషం వంటి ప్రతికూల శక్తులన్నీ నశిస్తాయని నమ్ముతారు. కార్తిక దీపారాధన ద్వారా మన ఆత్మ చెడు కర్మలనుంచి శుద్ధి చెందుతుంది. పరమాత్మతో అనుబంధాన్ని కలిగిస్తుంది. ఆత్మజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించడం జరుగుతుంది. కార్తికమాసంలో శివపురాణ పఠనం చేస్తారు. దానాలు చేస్తారు. ‘నమశివాయ’ అనే ధ్యానం మన ఆత్మలను పవిత్రం చేస్తుంది. కార్తికమాసం పవిత్రత, ధ్యానాలకు ఎంతో ముఖ్యమైంది. శివకేశవుల ఇద్దరి అనుగ్రహానికి ఈ మాసంలోని ఆరాధనలు ఎంతో ఉపకరిస్తాయి. కార్తిక పౌర్ణమినాడు రోజుకొక్కటిగా మూడువందల అరవై అయిదు వత్తులను వెలిగించి, శివుడి ఎదుట ఉంచుతారు.