యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెంలో పక్కపక్క ఇళ్లలో నివసించే రవీందర్ రెడ్డి, సుజాత ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 2015 లో హైదరాబాద్ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. అమెరికా వెళ్లి కాపురం పెట్టారు. ఏడాదిపాటు సజావుగానే సాగిన సంసారంలోకి రవీందర్‌రెడ్డి తండ్రి చంద్రారెడ్డి ఎంటరయ్యాడు. బంధువుల అందరి సమక్షంలో ఘనంగా వివాహం జరిపిస్తానని స్వగ్రామానికి పిలిపించాడు. కానీ తండ్రి కుట్రలను రవీందర్‌రెడ్డి పసిగట్టి... సుజాతతో కలిసి తిరిగి అమెరికా వెళ్లిపోయాడు.
కొడుకు ప్రేమ వివాహం నచ్చని చంద్రారెడ్డి... ఎలాగైనా రవీందర్ రెడ్డి, సుజాతను విడగొట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అమెరికా వెళ్లి కొడుకుకు మాయ మాటలు చెప్పాడు. తండ్రి వెళ్లే వరకు వేర్వేరుగా ఉందామంటూ... సుజాతను దూరం ఉంచాడు. చంద్రారెడ్డి తిరిగి ఇండియా వచ్చినప్పటికీ... దూరంగానే ఉంచడం వల్ల అనుమానం వచ్చి భర్తను నిలదీసింది. కలిసి ఉడటం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదు... విడాకులు తీసుకుందామని అసలు విషయం అప్పుడు బయటపెట్టాడు రవీందర్ రెడ్డి.
దేశం కాని దేశంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న సుజాత... రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్‌కు ఆన్లైన్లో ఫిర్యాదు చేసి, స్వగ్రామానికి తిరిగి వచ్చింది. 2018 అక్టోబర్‌లో సీపీ చొరవ తీసుకొని ఇండియాకు తీసుకొచ్చాడు. గ్రామంలో పంచాయితీ పెట్టి ఇద్దరు కలిసి ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. ఓ ఏడాది తర్వాత సుజాతను వదిలిపెట్టి... రవీందర్‌రెడ్డి తిరిగి అమెరికా వెళ్లాడు. అప్పటి నుంచి అత్తారింట్లోనే ఉంటున్న సుజాతను... చిత్రహింసలకు గురిచేశారు. ఎప్పటికైనా అత్తమామల్లో మార్పు వస్తుందన్న నమ్మకంతో భరించింది.
రోజురోజుకు పెరుగుతన్న అఘాయిత్యాలు తట్టుకోలేక నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన సుజాతను ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సుజాతను అత్తమామలు ఇంట్లో రాకుండా అడ్డుకున్నారు. చేసేదేమీ లేక అత్తారింటి ఎదుట మౌనంగా రోదిస్తూ ధర్నా చేస్తోంది. అత్తమామలకు రాజకీయ పలుకుబడి ఉండటం వల్ల పోలీసులు కూడా నాకు న్యాయం చేయడం లేదని సుజత వాపోతుంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. తాము ఏమీ అనటం లేదని... కావాలనే గొడవ చేస్తోందని మామ అన్నాడు.
ఇదీ చూడండి: 'చిన్నారిపై హత్యాచారం కేసులో యావజ్జీవం సరైందే'