సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చౌదరిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మనుక వెంకట్ గౌడ్, రేవతి దంపతులు రోజూలాగే... వ్యవసాయ పనులు చేసుకునేందుకు బావి వద్దకు వెళ్లారు. పొలం పనులు ముగించుకొని బోరు మోటార్ వద్ద ఉన్న సంపులో కాళ్లు, చేతులు కడుక్కునే ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు విద్యుత్ తీగ తెగిపోయి సంపులో పడిపోయింది.
విషయం గమనించని భార్యాభర్తలు చేతులు కడుక్కోబోతుండగా... విద్యుదాఘాతానికి గురయ్యారు. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వెంకట్ గౌడ్, రేవతిలు ఎంతకీ ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు. విగతజీవులుగా పడి ఉన్న భార్యాభర్తలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు నాలుగేళ్ల కుమారుడు, రెండేళ్ల కూతురు ఉన్నారు. తల్లిదండ్రులకు ఏమైందో తెలియక ఏడుస్తున్న పిల్లలను చూసి గ్రామస్థులంతా కన్నీరుమున్నీరయ్యారు.
ఇవీ చూడండి: గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి.. రక్తనాళాలపై దుష్ప్రభావం