మరో నెలరోజుల్లో గోవర్ధన్ రెడ్డి స్వదేశానికి తిరిగి రావాలని అనుకున్నాడు. సంపాదించిన ఆస్తితో ఇక్కడ వ్యాపారం చేస్తూ..తన కుటుంబసభ్యులతో సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. ఇంతలోనే దారుణం చోటు చేసుకుంది. అమెరికాఫ్లోరిడాలోని పెన్సకోలా పట్టణంలో ఓ డిపార్ట్మెంట్ స్టోర్‌లో కౌంటర్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న గోవర్ధన్ రెడ్డి దుండగుల తూటాలకు బలయ్యాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రహీంఖాన్ పేట్ గ్రామానికి చెందిన గోవర్ధన్ రెడ్డి ఏడేళ్ల క్రితం ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వెళ్లారు. గోవర్ధన్ రెడ్డి భార్య శోభారాణి,ఇద్దరు పిల్లలు హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నివసిస్తున్నారు. గోవర్ధన్ రెడ్డి బుధవారం విధుల్లో ఉన్న సమయంలో మాస్క్ ధరించిన దుండగులు రాత్రి 8.30 గంటలకు (అమెరికా కాలమానం) కాల్పులు జరిపారు. దీంతో గోవర్ధన్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందగా,ఫ్లోరిడాలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కుటుంబంలోవిషాదం
గోవర్ధన్ రెడ్డి మృతితో లో ఉప్పల్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరో నెలరోజుల్లో వస్తాడకున్న తండ్రి దుండగుల తూటాలకు బలైపోవడంతో ఆయన కూతుళ్లు కన్నీరుమున్నీరవుతున్నారు. భార్య శోభారాణి కన్నీళ్ల పర్యంతమవుతోంది.
తమ స్నేహితుడి మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని గోవర్ధన్ స్నేహితులు, కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇద్దరు ఆడపిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.
దుండగులు కాల్పులు జరపడానకి గల కారణాలు ఇంకా తెలియలేదని కుటుంబసభ్యులు తెలిపారు.