సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటకు చెందిన కిర్ని భూపాణి కుమార్తె మౌనిక (24).. ఖాత క్లస్టర్ పరిధిలో ఏఈవోగా రెండేళ్ల నుంచి విధులు నిర్వహిస్తోన్నారు. వీరి కుటుంబం సిద్దిపేటలో కొన్నాళ్లుగా నివాసం ఉంటోంది. తండ్రి వ్యాపార ప్రయత్నాల్లో నష్టపోవడంతో కుటుంబ అవసరాల కోసం మౌనిక ‘స్నాప్‌ఇట్ లోన్’ యాప్ నుంచి రెండు నెలల కిందట రూ.3 లక్షల రుణం తీసుకున్నారు. నిర్దేశించిన గడువులోగా దాన్ని తిరిగి చెల్లించలేకపోయారు.
దీంతో యాప్ నిర్వాహకులు రుణం ఎగవేతదారుగా ప్రకటిస్తూ ఆమె ఫోన్‌లోని కాంటాక్టు నంబర్లన్నింటికీ వాట్సప్ సందేశాలు పంపారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఈ నెల 14న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మరణించారు. ఆమె సోదరుడు భరత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట పోలీసులు తెలిపారు.