అర్ధరాత్రి సమయంలో జాతీయరహదారిపై పోలీసులమని చెప్పి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరిని సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆరు ద్విచక్ర వాహనాలు, 11 చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలానికి చెందిన పల్లపు శ్రీను, అంజిబాబు ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండేవారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇంటికి పరిమితమయ్యారు. అక్రమమార్గంలో డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో నకిలీ పోలీసులుగా అవతారమెత్తి జాతీయరహదారిపై దోపీడీలకు దిగారు. వాహనాలను ఆపి డబ్బు, చరవాణిలు, ద్విచక్రవాహనాలు ఎత్తుకెళ్లేవారు. ఇప్పటివరకు గుంటూరు, ఖమ్మం, కోదాడ మండలాల్లో దోపిడీలు చేసినట్లు నిందితులు విచారణలో తెలిపారు. వారి నుంచి ఆరు ద్విచక్రవాహనలు,11చరవాణిలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అర్ధరాత్రి సమయంలో పోలీసులమని చెప్పి వాహనాలను ఆపితే 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చెయ్యాలని డీఎస్పీ సూచించారు.