ములుగు జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి వేళ తెరాస కార్యకర్త ఇంట్లోకి చొరబడి.. కత్తులతో పొడిచి దారుణంగా చంపారు. వెంకటాపురం మండలం బోదాపురంలో తెరాస కార్యకర్తగా ఉన్న... మాడూరి భీమేశ్వరరావును కత్తులతో పొడిచి చంపేశారు. సాయుధులైన ఆరుగురు మావోయిస్టులు... రాత్రి సమయంలో భీమేశ్వరరావు ఇంటి తలుపులు బద్దలుగొట్టి లోపలికి వచ్చారు. ముందుగా కాల్పులు జరిపినా తప్పించుకోవడం వల్ల కత్తులతో పొడిచి చంపారు.
మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టులు ఘటనా స్థలిలో ఓ లేఖను వదిలివెళ్లారు. అధికార పార్టీ అండతో పెత్తనం చేస్తున్నారని... ప్రశ్నించిన వారిని పోలీసులకు పట్టిస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. వాజేడు పరిధిలో తెరాస, భాజాపా నాయకులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలంటూ లేఖలో డిమాండ్ చేశారు.
పార్టీ ఫండ్ తిరస్కరించినందుకు కక్ష్య సాధింపు చర్యగానే మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని జిల్లా ఎస్పీ సంగ్రాం సింగ్ పాటిల్ చెప్పారు. ప్రభుత్వ అందించే సంక్షేమ కార్యక్రమాలకు గిరిజనులకు దూరం చేస్తున్నారని... అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ రోడ్లను తవ్వి సామాన్యులకు ఆటంకాలు కలిగిస్తున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: చట్ట సవరణ ముసాయిదా బిల్లులకు మంత్రివర్గం ఆమోదం