భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని పాతూరు, సంధిబందం గ్రామం సమీపంలో శుక్రవారం రాత్రి పెద్దపులి సంచారాన్ని గ్రామస్థులు, అటవీ అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం అటవీ ప్రాంతంలోని పంట పొలాల్లో కొమరం సత్యనారాయణ అనే రైతుకు సంబంధించిన దుక్కిటెద్దును పులి చంపి తిన్నట్లు ఆనవాళ్లు కనిపించాయి.
చింతగండి వాగు మీదుగా నడిచి వెళ్లినట్లు పంజా గుర్తులు కనిపించాయి. అవి పులివేనని నిపుణులు నిర్ధారించారు. అటవీ అధికారులు అక్కడి ప్రదేశాన్ని నిశితంగా పరిశీలించారు. పెద్దపులి జాడను కనుక్కునేందుకు అటవీ అధికారులు నిమగ్నమయ్యారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల్లో పులి జాడ గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 20 ఏళ్లలో తొలిసారిగా పులి సంచరించిందని అధికారులు తెలిపారు. పశువులను బయట కట్టేయవద్దని... రాత్రి సమయంలో ప్రజలు ఎవరు బయటకు తిరగొద్దని సూచించారు. ఎవరికైనా పులి జాడ కనిపిస్తే.. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.