వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం ఏపీలోని ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని పాతపాడు సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. హెచ్‌ఎంపాడు మండలం వలిచెర్ల గ్రామానికి చెందిన హమస్(24), కొనకనమిట్ల మండలం పాతపాడుకు చెందిన తోట రాజు(23) హైదరాబాద్‌లో తాపీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. స్వగ్రామాలకు వచ్చిన వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై పొదిలి వెళ్లారు. తిరిగి పాతపాడు వస్తున్నారు. అదే సమయంలో గరిమినపెంట నుంచి ఓ ట్రాక్టర్ వరిగడ్డితో వస్తోంది. ఈ రెండు వాహనాలు పాతపాడు సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. రాజు, హమాస్‌లు వాహనం పైనుంచి ఎగిరి పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. పనులు చేస్తూ కుటుంబాలకు అండగా ఉంటున్న ఇద్దరు యువకులు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి కుంటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండీ.. సైబర్ 'ఛీ'టర్స్: అంతర్జాలమే పెట్టుబడి.. మోసంతోనే రాబడి!