చరవాణిలో ఆటలు ఆడొద్దన్న తండ్రి మాటలకు మనస్తాపం చెంది కొడుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో చోటుచేసుకుంది. గద్వాలలోని ఆఖరెల్లివీధికి చెందిన మియాబాష పెద్ద కొడుకు హెతేషామ్... ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. గత రెండు రోజులుగా చరవాణిలో ఆన్లైన్ తరగతులు వినకుండా ఆటలు ఆడుతున్నాడని గుర్తించిన తండ్రి మియాబాష... బుధవారం కొడుకును మందలించి చరవాణి తీసుకున్నాడు.
తండ్రి మాటలకు మనస్తాపం చెందిన ఆ విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గద్వాల పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాలలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి మియాబాష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రమాదేవి తెలిపారు.