రాష్ట్రంలో జిల్లాల పునర్విభన అనంతరం.. పట్టణ, గ్రామ అనే తేడా లేకుండా భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. స్థిరాస్థి వ్యాపారం వృద్ధి చెందుతుండటం.. గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు వస్తుండటంతో ధరలు గణనీయంగా పెరిగాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి గ్రామంలో అతిపురాతనమైన శ్రీలక్ష్మినర్సింహస్వామి ఆలయం ఉంది. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని గ్రానైట్ మాఫియా చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో గుట్టను కాపాడుకోవడానికి గ్రామస్తులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
పట్టాలు చేసుకున్నారు..
ఇదిలా ఉంటే ఆలయంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించడంతో పాటు... ఏటా సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు దాతలు దాదాపు 45 ఎకరాల భూములను దానం చేశారు. ఈ భూములు కోట్ల నర్సింహుల పల్లితో పాటు తక్కళ్లపల్లి, నామాపూర్, తిర్మలాపూర్, సర్వారెడ్డిపల్లి గ్రామాల్లో ఉన్నాయి. చాలా చోట్ల ఇవి ఆక్రమణకు గురికాగా... తాజాగా కోట్ల నర్సింహులపల్లిలోని 38ఎకరాల భూమికి కొందరు వ్యక్తులు పట్టాలు చేసుకున్నారు. ఈ విషయం గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తోంది.
మింగుడుపడని వార్త..
ఎన్నో ఏళ్లుగా ఆలయం పేరిట ఉన్న భూములు... హఠాత్తుగా కొందరి భూములుగా రికార్డులు సృష్టించడం గ్రామస్తులకు మింగుడుపడటం లేదు. దాదాపు రూ.15కోట్ల విలువైన భూములు తమ ఖాతాల్లో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుచూపుతో దేవాదాయ భూమిని విద్యుత్ సబ్‌స్టేషన్‌కు విరాళంగా ఇచ్చారని... వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడే తెలిసింది..
అనాధిగా దేవుని పేరు మీద ఉన్న భూముల్లో... ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ధాన్యం కొనుగోలు కేంద్రం ఎక్కడో ఏర్పాటు చేసుకోకుండా అందుబాటులో ఉన్న దేవాలయ భూమిలో ఏర్పాటు చేద్దామని... చదును చేసుకుంటున్న తరుణంలో కొందరు ఆ భూములు తమవి అంటూ అభ్యంతరం చెప్పడంతో... గ్రామస్తులు కలెక్టర్‌తో పాటు సీపీ కమలాసన్‌రెడ్డి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆలయ భూములు ఆక్రమణకు గురైనట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని విచారణ జరిపి తగుచర్యలు తీసుకుంటామని తహసిల్దార్ శ్రీనివాస్ తెలిపారు.
ఎంతో చరిత్ర గల కోట్ల నర్సింహులపల్లి ఆలయ భూములపై వెంటనే విచారణ జరిపించి విలువైన భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: భూములు కనుమరుగు: పాగా వేసి.. ప్లాట్లు చేసి!