పేట్రేగిపోతున్న ఇసుక అక్రమ రవాణా, నిషేధిత గుట్కా దందాలకు అడ్డుకట్ట వేసేందుకు సూర్యాపేట జిల్లా పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు... రెండు రోజులుగా పట్టణంలోని అక్రమ వ్యాపారాలపై మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో ఇప్పటివరకు లక్షన్నర విలువైన గుట్కా పాకెట్లను సీజ్ చేశారు. 4 కేసులు నమోదు చేసిన పోలీసులు... ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అక్రమంగా తరలిస్తున్న 16 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు... 35 మందిపై కేసులు నమోదు చేశారు. రెండు రోజులుగా నిర్వహించిన దాడుల్లో పట్టణ సీఐ ఆంజనేయులు, టాస్క్ఫోర్స్ ఇంఛార్జ్ ఇన్స్పెక్టర్ నిరంజన్, సీసీఎస్ సిబ్బంది, పట్టణ ఎస్సైలు భిక్షపతి, శ్రీనివాస్, ఏడుకొండలు, పట్టణ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.