ఆన్లైన్ యాప్‌ల ద్వారా అప్పులు చేసి, తిరిగి వాటిని తీర్చలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సునీల్.. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ రాజేంద్రనగర్‌లోని కిస్మత్పూర్ ఓం నగర్లో నివాసముంటున్నాడు.
కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌తో సునీల్ ఉద్యోగం కోల్పోయినట్లు రాజేంద్రనగర్ ఎస్సై సురేశ్ తెలిపారు. ఈ క్రమంలో ఆన్లైన్లో అప్పులు చేశాడని చెప్పారు. ఇన్స్టంట్ క్రెడిట్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడని, అధిక మొత్తంలో అప్పులు చేయడంతో చివరికి వాటిని తీర్చలేక చనిపోవాలని నిర్ణయించుకున్నాడని వివరించారు. భార్య ఇంట్లో లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరివేసుకుని సునీల్ బలవన్మరణానికి పాల్పడ్డాడని వెల్లడించారు.
ఆ యాప్‌లకు అనుమతులు ఉండవు
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇటువంటి యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు. రుణం తీసుకునేప్పుడు యాప్ నిబంధనలు అంగీకరించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. రుణ గ్రహీత సెల్‌ఫోన్ కాంటాక్ట్ జాబితా యాప్ నిర్వాహకులకు చేరుతుందని, అతను రుణం చెల్లించకపోతే ఆ జాబితాలోని అందరికీ వివరాలు పంపిస్తారని పేర్కొన్నారు. ఇటువంటి యాప్‌లకు అనుమతులు ఉండవని, వీటి ద్వారా వేధింపులకు గురైతే పోలీసులను ఆశ్రయించాలని వెల్లడించారు. సునీల్ ఆత్మహత్యకు కారణమైన యాప్ నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని అన్నారు.
ఇదీ చదవండి: కేబుల్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం... ఆలస్యంగా వెలుగులోకి...