మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇంటి ముందు స్నేహితుడితో ఆడుకుంటున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా చిన్న పోచారం గ్రామానికి చెందిన సత్తయ్య జీవనోపాధి కోసం కుటుంబసభ్యులతో కలిసి ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామానికి వచ్చాడు. కుమారుడు గణేశ్(7) ఇంకో బాలుడితో ఇంటి ముందు ఆడుకుంటున్నాడు.
ఆ ప్రదేశానికి సమీపంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం గుంతలు తీశారు. ఇటీవల కురిసిన వర్షాలకు అందులో నీరు వచ్చి చేరింది. గణేశ్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడిపోయాడు. పక్కనే ఉన్న బాలుడు విషయాన్ని ఇంటికి వెళ్లి పెద్దలకు చెప్పాడు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరి... స్థానికుల సాయంతో బాలుడిని బయటకు తీశారు.
ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. విగతజీవిగా పడి ఉన్న కుమారున్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.