ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గొల్లప్రోలుకు చెందిన కొండపల్లి శ్రావణి కుటుంబంతో సహా ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. మధురానగర్‌లో ఉంటున్న శ్రావణి.. టీవీ సీరియళ్లలో అవకాశాలు రాగా పలు ఛానళ్లలో నటించారు. కొన్ని సంవత్సరాల క్రితం శ్రావణికి కాకినాడకు చెందిన దేవరాజురెడ్డి అలియాస్ సన్నీ అనే వ్యక్తి టిక్‌టాక్ ద్వారా పరిచయం అయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారింది. అప్పడప్పుడు కలుస్తూ ఉండేవారు. గత సెప్టెంబర్‌లో దేవరాజురెడ్డి నగరానికి వచ్చి శ్రావణి కుటుంబంతో కలిసి ఉన్నాడు. అతనికి వేరే యువతితో సంబంధం ఉందని తెలిసింది. పలువురు యువతులతోనూ మాట్లాడుతున్నాడని గుర్తించిన శ్రావణి.. అతన్ని దూరం పెట్టింది. అప్పటి నుంచి దేవరాజురెడ్డి అతని స్నేహితుడి గదిలో ఉన్నాడు.
డబ్బుల కోసం వేధించేవాడు..
దేవరాజురెడ్డి ఖర్చుల కోసం డబ్బులు అడగ్గా శ్రావణి 30వేలు పంపింది. తనతో కలిసి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించి డబ్బుల కోసం వేధించాడని.. ఫిబ్రవరిలో అత్యాచారం చేసేందుకు యత్నించగా.. ప్రతిఘటించానని శ్రావణి ఎస్ఆర్ నగర్ పోలీసులకు జూన్ 22న ఫిర్యాదు చేసింది. లక్ష రూపాయలు ఇస్తే ఫొటోలు డిలీట్ చేస్తానని చెప్పగా.. విడతల వారీగా గూగూల్ పే ద్వారా నగదు బదిలీ చేశానని పేర్కొంది. ఫొటోల్ డిలీట్ చేస్తానని చెప్పి...సీతాలఫల్‌మండికి రమ్మన్నాడని అక్కడికి వెళ్లగా... దేవరాజురెడ్డి వేధించాడని తెలిపింది. వేధింపులు తాళలేక ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దేవరాజురెడ్డిని రిమాండ్‌కు తరలించారు.
అనూహ్యంగా..
ఈ వివాదం ఇలా ఉండగానే.. మంగళవారం రాత్రి అనూహ్యంగా శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. ఉదయాన్నే షూటింగ్ ఉందని గదిలోకి వెళ్లిన ఆమె.. ఎంతకీ బయటకు రాలేదు. కుటుంబ సభ్యులు గమనించగా శ్రావణి విగతజీవిగా పడిఉంది. ఈ ఘటనపై శ్రావణి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో దేవరాజురెడ్డిపై కేసులు పెట్టిన శ్రావణి.. తిరిగి అతనితో ద్విచక్రవాహనంపై తిరగ్గా గమనించిన మందలించామని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఈ ఘటన జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కుమార్తెను దేవరాజురెడ్డి మానసికంగా వేధించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కారణమేంటి?
శ్రావణి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్సార్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శవపరీక్ష అనంతరం శ్రావణి మృతదేహాన్ని కుటుంబం సభ్యులకు అప్పగించారు. అసలు.. నటి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటని తేలాల్సి ఉంది. బలవన్మరణానికి దేవరాజురెడ్డి వేధింపులా..? లేదంటే కుటుంసభ్యుల మందలింపే కారణమా అనే అంశాలు తేలాల్సి ఉంది.
నాకు సంబంధం లేదు..
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి.. ఆమె బలవన్మరణంపై స్పందించారు. ఆమె ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబధం లేదని వెల్లడించారు. కుటుంబ సభ్యుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.
నేను మంచి మిత్రుడిని..
నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ చేసిన కామెంట్లు అవాస్తవమని... సాయికృష్ణ రెడ్డి అన్నారు. శ్రావణి కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఆమె ఆత్మహత్యకు కారణం తాను కాదని వెల్లడించారు.