ఆర్టీసీ కృష్ణా రీజియన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ బాధితులను మోసం చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ పథకం ప్రకారమే నిరుద్యోగులను నమ్మించి.. రూ.లక్షలు వసూలు చేసినట్లు విచారణలో గుర్తించారు. కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, గుర్తింపు కార్డులను చూపించి మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. వీరిపై కృష్ణలంక, కంకిపాడు, ఘంటసాల పోలీస్‌స్టేషన్‌లలో పలు సెక్షన్ల కింద కేసు నమోదవ్వగా.. విచారించిన పోలీసులు బుధవారం నిందితులను రిమాండ్ కోసం కోర్టులో హాజరు పరిచారు.
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఆశచూపి..
విజయవాడలోని విద్యాధరపురం డిపోలో వడ్డాన రవికుమార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి కొడాలి గ్రామానికి చెందిన వీరంకి బ్రహ్మారావుతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు సంపాదించాలని పథకాన్ని రచించారు. ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని 2017 నుంచి మూడు జిల్లాలోని 16 మంది దగ్గర నుంచి రూ.57.75 లక్షలు వసూలు చేశారు. నెలలు గడిచినా ఉద్యోగాలు రాలేదని బాధితులు నిలదీయడంతో.. ఒక నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్, గుర్తింపు కార్డులను తయారు చేసి వారికిచ్చారు. అవి నకిలీవని గుర్తించిన బాధితులు తాము మోసపోయామని గ్రహించారు. దీంతో వారు కొంతమందికి రూ.12.85 లక్షలను చెల్లించారు. మిగతా సొమ్ము ఇవ్వలేమని చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
అన్న, అక్క, బావలతో మొదలై..
రవికుమార్ తనకు ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పించినట్లు, ప్రస్తుతం అక్కడే పని చేస్తున్నట్లు కొడాలి గ్రామానికి చెందిన బ్రహ్మారావు గ్రామస్థులను నమ్మించారు. అనంతరం మీకు ఆసక్తి ఉంటే.. ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తానని ఆశచూపారు. దీనిపై నమ్మకం కలిగించేందుకు మొదటగా బ్రహ్మారావు అన్న వీరంకి యోగేశ్వరరావు, వదిన కృష్ణవేణి, బావ సురేష్‌ల దగ్గర నుంచి రూ.7 లక్షల వరకు కట్టించారు. ఆ నమ్మకంతో ఉయ్యూరు, కంకిపాడు, కొడాలి, కోడూరు, ఘంటసాల మండలాలతో పాటు పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు, తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలాలకు చెందిన 16 మంది నిరుద్యోగులను దఫదఫాలుగా మోసం చేశారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలానికి చెందిన బోలెం సురేష్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
విద్యాధరపురానికి చెందిన రవికుమార్ తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్ఫి. 2018 నవంబర్ నుంచి విడతలవారీగా రూ.5లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై గతనెల 16వ తేదీన విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం సీపీ బి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఈ కేసును సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. కేసులో దర్యాప్తులో చురుగ్గా వ్యవహరించి, విధి నిర్వహణలో ప్రతిభ చూపిన సీసీఎస్ ఏసీపీ కె.శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్లు ఎన్.చలపతిరావు,, ఎం.రామకుమార్, ఎస్‌ఐలు నాగేశ్వరరావు, శ్రీకాంత్‌కుమార్‌లను పోలీస్‌కమిషనర్ అభినందించారు.
ఇదీ చదవండి : 'వైఎస్ఆర్ హయాంలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రద్దు'