వరంగల్ ఆర్బన్ జిల్లా ఏనమామూల సుందరయ్యనగర్‌కు మహమ్మద్ అస్లాం, యం.డి ఇమ్రాన్, యం.డి యాకుబ్ పాషా, యం.డి అబిద్ పాషా స్థానిక వెల్డింగ్ షాపులో పని చేస్తున్నారు. జల్సాలకు అవాటు పడ్డ వారికి వచ్చే ఆదాయం సరిపోక అక్రమంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 11న రాత్రి సమయంలో నలుగురు నిందితులు రెండు ద్విచక్ర వాహనలపైన బయల్దేరారు. ఆరేపల్లి నుంచి వంగపహాడ్ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న రైస్ మిల్ ప్రాంతంలో ఆగివున్న ఆటోను గమనించారు.
ఆటోలోని ఇద్దరు వ్యక్తులను బెదిరించి, వారిని కొట్టి ఆటో డిక్కీలోని 25వేల రూపాయలు, కవర్లో ఉన్న మరో 2వేలతోపాటు సెల్ ఫోన్ లాక్కొని పోయారు. కేసు నమోదు చేసుకున్న హసన్‌పర్తి పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ అదేశాల మేరకు సెంట్రల్ జోన్ ఇంచార్జీ డీసీపీ పుష్ప పర్యవేక్షణలో దర్యాప్తు జరిపారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు ఇంచార్జీ డీసీపీ పుష్ప తెలిపారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, 25 వేల నగదుతో పాటు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.